BAN vs SL: టీ20 ప్రపంచ కప్ 2021లో భాగంగా నేడు శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో బంగ్లాదేశ్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక 4 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. మొదటగా టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఓపెనర్లు నయీం, దాస్ శుభారంభం ఇచ్చారు. ముఖ్యంగా నయిమ్ చెలరేగి ఆడాడు.
52 బంతుల్లో 6 ఫోర్లతో 62 పరుగులు చేసి వెనుదిరిగాడు. తర్వాత ముష్పికర్ రెహ్మాన్ ధాటిగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగెత్తింది. 37 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతో 57 పరుగులు చేశాడు. దీంతో బంగ్లాదేశ్ 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో కరుణరత్న 1, ఫెర్నాండో 1, కుమార1 వికెట్ దక్కించుకున్నారు.
172 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్‌లోనే నసూమ్ వేసిన నాలుగో బంతికి కుశాల్ పెరీరా బౌల్డ్ అయ్యాడు. నిసాంక కూడా 24 పరుగులకే వెనుదిరిగాడు. ఈ సమయంలో క్రీజులో అడుగుపెట్టిన అసలంక ధాటిగా ఆడాడు. స్కోరు బోర్డుని పరుగెత్తించాడు. 49 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 80 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఇతనికి తోడుగా రాజపక్స హాప్ సెంచరీతో అదరగొట్టాడు. 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబుల్ హసన్ 2, మహ్మద్ సైఫ్‌ద్దీన్ 1, అహ్మద్ 2 వికెట్లు సాధించారు.