
Sreesanth Ban Lifted: భారత క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా కేరళ స్పీడ్‌స్టర్ ఎస్. శ్రీశాంత్ మద్దతుదారులకు ఇది ఒక పెద్ద ఊరటనిచ్చే వార్త. గత కొంతకాలంగా వివాదాలు, నిషేధాలతో సతమతమవుతున్న ఈ సీనియర్ ఫాస్ట్ బౌలర్‌పై విధించిన మూడేళ్ల నిషేధాన్ని ఎత్తివేస్తూ కేరళ క్రికెట్ అసోసియేషన్ (KCA) సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన మళ్లీ క్రికెట్ మైదానంలో చురుకైన పాత్ర పోషించేందుకు మార్గం సుగమమైంది.
గత ఏడాది కేరళ క్రికెట్ లీగ్ ప్రారంభానికి ముందు సోషల్ మీడియా, అలాగే విజువల్ మీడియాలో బోర్డుకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గానూ శ్రీశాంత్‌పై కేరళ క్రికెట్ అసోసియేషన్ మూడేళ్ల పాటు కఠిన నిషేధం విధించింది. ఈ చర్యతో శ్రీశాంత్ ప్రతిష్టకు, కెరీర్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బోర్డు తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆయన తిరువనంతపురం మున్సిఫ్ కోర్టును ఆశ్రయించినప్పటికీ, అక్కడ ఆయనకు ఎలాంటి ఊరట లభించలేదు. కోర్టు శ్రీశాంత్ పిటిషన్‌ను తిరస్కరించింది.
అయితే, ఇటీవలి కాలంలో శ్రీశాంత్ తన తప్పును తెలుసుకుని, బోర్డు పట్ల తాను చేసిన వ్యాఖ్యలకు గానూ బేషరతుగా క్షమాపణలు కోరారు. తన ప్రవర్తనకు విచారం వ్యక్తం చేస్తూ బోర్డుకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కేరళ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన ప్రత్యేక జనరల్ బాడీ సమావేశంలో శ్రీశాంత్ క్షమాపణలపై సుదీర్ఘంగా చర్చించారు. శ్రీశాంత్ భారత క్రికెట్‌కు అందించిన సేవలను, అతని సుదీర్ఘ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని, బోర్డు పెద్దలు అతనిపై సానుకూలతను కనబరిచారు. చివరకు అతనిపై ఉన్న మూడేళ్ల నిషేధాన్ని పూర్తిగా తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఈ నిషేధం తొలగిపోవడంతో శ్రీశాంత్ మళ్లీ క్రికెట్ ప్రపంచంలో బిజీ కానున్నారు. కేరళ క్రికెట్ లీగ్ మూడో సీజన్‌లో ‘ఏరీస్ కొల్లాం సెలర్స్’ ఫ్రాంచైజీకి సహ-యజమానిగా (కో-ఓనర్) తన బాధ్యతలను ఆయన యథావిధిగా కొనసాగించవచ్చు. ఈ నిర్ణయం శ్రీశాంత్ అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. మైదానంలో ఆటగాడిగా కాకపోయినా, మెంటార్‌గా, యజమానిగా యువ ఆటగాళ్లకు ఆయన మార్గదర్శకత్వం వహించనున్నారు.
శ్రీశాంత్ కెరీర్ ఎప్పుడూ ఒడిదుడుకులతోనే సాగింది. 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న సమయంలో ఢిల్లీ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బీసీసీఐ ఆయనపై జీవితకాల నిషేధం విధించింది. కానీ, పట్టువదలని విక్రమార్కుడిలా న్యాయపోరాటం చేసిన శ్రీశాంత్‌ను 2019లో సుప్రీంకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. దీనితో ఆయనపై ఉన్న జీవితకాల నిషేధాన్ని ఏడేళ్లకు తగ్గిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆ నిషేధం ముగిసిన తర్వాత మళ్లీ దేశవాళీ క్రికెట్ ఆడిన శ్రీశాంత్, ఆపై వ్యాఖ్యాతగా, విశ్లేషకుడిగా రాణించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..