Smriti Mandhana : 4 సెంచరీలు, 3 ఫిఫ్టీలు.. వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. ఒకే ఏడాది 1000 పరుగులు చేసిన మహిళా క్రికెటర్
టీమిండియా మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మైదానంలోకి అడుగుపెడితే రికార్డులు బద్దలు కావాల్సిందే. ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025లో మొదట్లో కాస్త తడబడ్డా, కీలకమైన ఆస్ట్రేలియా మ్యాచ్‌లో మాత్రం ఆమె బ్యాట్ ఝుళిపించింది. ఈ క్రమంలో మంధాన మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనే ఏ క్రికెటర్‌కూ సాధ్యం కాని అరుదైన ఘనతను సాధించింది.

Smriti Mandhana : టీమిండియా మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మైదానంలోకి అడుగుపెడితే రికార్డులు బద్దలు కావాల్సిందే. ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025లో మొదట్లో కాస్త తడబడ్డా, కీలకమైన ఆస్ట్రేలియా మ్యాచ్‌లో మాత్రం ఆమె బ్యాట్ ఝుళిపించింది. ఈ క్రమంలో మంధాన మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనే ఏ క్రికెటర్‌కూ సాధ్యం కాని అరుదైన ఘనతను సాధించింది. ఒక క్యాలెండర్ సంవత్సరంలో (2025లో) 1000 వన్డే పరుగులు పూర్తి చేసిన తొలి మహిళా బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించింది. విశాఖపట్నంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆమె తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకుంది.
విశాఖపట్నం వేదికగా ఆదివారం (అక్టోబర్ 12) జరిగిన ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్‌లో టీమిండియా ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. గత మూడు మ్యాచ్‌లలో మంధాన 50 పరుగుల మార్కును కూడా అందుకోలేకపోవడంతో ఆమెపైనే అందరి దృష్టి నిలిచింది. కానీ, తన ఫేవరెట్ ప్రత్యర్థి అయిన ఆస్ట్రేలియా జట్టును చూడగానే ఈ స్టైలిష్ లెఫ్ట్ హ్యాండర్ రెచ్చిపోయింది. వరల్డ్ కప్ కంటే ముందు ఆస్ట్రేలియా సిరీస్‌లో పరుగుల వర్షం కురిపించిన మంధాన, అదే ఊపును వరల్డ్ కప్‌లోనూ కొనసాగించింది. ఈ మ్యాచ్‌లో కేవలం 18 పరుగులు చేయగానే ఆమె ఈ సరికొత్త ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
స్మృతి మంధాన ఈ రికార్డు సాధించడంతో, దాదాపు 28 ఏళ్ల నాటి రికార్డు చెరిగిపోయింది. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన దిగ్గజ క్రికెటర్ బెలిండా క్లార్క్ పేరిట ఉండేది. ఆమె ఒక క్యాలెండర్ ఇయర్‌లో 970 వన్డే పరుగులు చేసింది. ఇప్పుడు మంధాన క్లార్క్‌ను దాటి, 1000 పరుగుల మైలురాయిని చేరుకుని చరిత్ర సృష్టించింది.
ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వన్డే పరుగులు (రికార్డు):
స్మృతి మంధాన: 1,000+ పరుగులు (2025)
బెలిండా క్లార్క్: 970 పరుగులు (1997)
లారా వుల్వార్ట్: 882 పరుగులు
స్మృతి మంధాన 2025లో అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తోంది. ఈ ఏడాది ఆమె ఇప్పటికే నాలుగు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు సాధించింది. మొత్తం మీద, 2025 సంవత్సరంలో అత్యధిక వన్డే పరుగులు చేసిన బ్యాటర్‌గా ఆమె అగ్రస్థానంలో ఉంది. ఈ జాబితాలో ఆమె తర్వాత స్థానంలో టీమిండియాకే చెందిన మరో యువ బ్యాటర్ ప్రతిక రావల్ ఉన్నారు. ఆమె కూడా ఈ ఏడాది 800కు పైగా పరుగులు చేసి, తన ఫామ్‌ను చాటుకుంది. మంధాన లాంటి స్టార్ బ్యాటర్ ఇలాంటి మైలురాయిని చేరుకోవడం భారత మహిళా క్రికెట్‌కు గర్వకారణం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




