
Shubman Gill : క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ కు అండగా నిలిచారు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకబడింది. దీంతో యువ కెప్టెన్ గిల్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కానీ కెప్టెన్‌గా, ఆటగాడిగా చాలా ఒత్తిళ్లను చూసిన కపిల్ మాత్రం, గిల్ ప్రదర్శన గురించి ఆందోళన పడటం లేదు. బదులుగా ఆశాభావం వ్యక్తం చేశాడు. ఢిల్లీలో జరిగిన ఒక గోల్ఫ్ ఈవెంట్‌లో కపిల్ దేవ్ మాట్లాడుతూ.. గిల్‌కు ఇది మొదటి కెప్టెన్సీ సిరీస్. తప్పులు చేయడం సహజం, వాటి నుంచే నేర్చుకుంటాడు. తప్పులు చేయడం వల్ల నష్టం లేదు, నేర్చుకోవడం ముఖ్యమని అన్నారు.
కెప్టెన్‌గా గిల్ బర్మింగ్‌హామ్‌లో గెలిచి మంచి ఓపెనింగ్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు మాంచెస్టర్ టెస్ట్‌లో భారత్ కష్టాల్లో ఉంది. కపిల్ దేవ్ ప్రకారం, ఇది కొత్త జట్టుకు మామూలే. ఇది కొత్త టీమ్. ఏ కొత్త జట్టు అయినా సరే తమదైన రిథమ్ కనుక్కోవడానికి కాస్త టైం పడుతుందని చెప్పారు. విమర్శలు ఎదుర్కొంటున్నది గిల్ ఒక్కడే కాదు. భారత ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా ఐదు టెస్టుల్లో మూడింటిలో మాత్రమే ఆడాలని నిర్ణయించుకోవడం కొందరిని ఆశ్చర్యపరిచింది. అయితే, కపిల్ ఈ నిర్ణయాన్ని సమర్థించారు. బుమ్రా బౌలింగ్ యాక్షన్ ప్రత్యేకంగా ఉంటుంది. అది శరీరంపై చాలా ఒత్తిడి పెడుతుంది. అతను ఇంతకాలం ఆడతాడని కూడా మేము అనుకోలేదు. అయినా కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. అతనికి హాట్స్ ఆఫ్ అని కపిల్ అన్నారు.
అలాగే, తొలి మ్యాచ్ ఆడిన ఫాస్ట్ బౌలర్ అన్షుల్ కంబోజ్ పెద్దగా ప్రభావం చూపకపోయినా, అది పర్వాలేదని కపిల్ చెప్పారు. మొదటి మ్యాచ్‌లు కష్టంగా ఉంటాయి. వెంటనే అద్భుతాలు ఆశించలేం. అతనిలో క్రికెట్ పట్ల ఆ స్ఫూర్తి ఉందా లేదా అనేది ముఖ్యం. నాకైతే అది ఉందని నమ్ముతున్నానని కపిల్ అన్నారు. ఇక ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ గురించి అడగ్గా కపిల్.. అతను మంచి ఆల్ రౌండర్. కానీ రవీంద్ర జడేజా అతనికంటే మెరుగు. జడేజా మరింత నిలకడగా ఉన్నాడని తెలిపారు. ప్రస్తుతం భారత జట్టు కష్టాల్లో ఉండవచ్చు. కానీ కపిల్ దేవ్ దృష్టిలో, ఇది ఆటలో ఒక భాగం. అన్నింటినీ చూసిన వ్యక్తిగా, ఆయన ప్రశాంతంగా ఒకే మాటలో తన సందేశాన్ని అందించారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..