Shreyas Iyer : కెప్టెన్సీ ముళ్ల కిరీటమేనా?.. భారత జట్టుకు కెప్టెన్‌గా ఎంపికవ్వగానే అయ్యర్ అట్టర్ ఫ్లాప్
Shreyas Iyer : టీమిండియా కొత్త టీ20 కెప్టెన్‌గా ఎంపికైన శ్రేయస్ అయ్యర్ ముంబై టీ20 లీగ్‌లో వరుసగా విఫలమవుతున్నాడు. సోబో ముంబై ఫాల్కన్స్ తరఫున నిరాశాజనక ప్రదర్శన చేసిన అయ్యర్ ఫామ్‌పై ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

Shreyas Iyer : భారత క్రికెట్ జట్టుకు కొత్త టీ20ఐ కెప్టెన్‌గా ఎంపికైన స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు ఊహించని షాక్ తగిలింది. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ఆయన ఫామ్ ఒక్కసారిగా పడిపోయింది. ప్రస్తుతం జరుగుతున్న ముంబై టీ20 లీగ్‌లో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం బీసీసీఐ ఇతనికి జట్టు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే లీగ్‌లో జరిగిన తాజా మ్యాచ్‌లో అయ్యర్ కనీస ప్రభావం కూడా చూపలేకపోవడంతో విమర్శలు మొదలయ్యాయి.
సూర్యకుమార్ యాదవ్ స్థానంలో ఎంపిక
శ్రేయస్ అయ్యర్ కెరీర్‌లో అత్యంత కీలకమైన మైలురాయిని అందుకున్న వెంటనే ఈ ఫామ్ మిస్సవ్వడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జూన్ 6వ తేదీన చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్.. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను భారత కొత్త టీ20 కెప్టెన్‌గా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. టీ20 వరల్డ్ కప్ 2026 ప్రచారం ముగిసిన తర్వాత సెలెక్షన్ కమిటీలో జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఈ కీలక మార్పు జరిగింది. అయితే, సెలెక్టర్లు తనపై ఉంచిన నమ్మకానికి తగ్గట్టుగా అయ్యర్ ముంబై లీగ్‌లో ఆడలేకపోతున్నాడు.
సోబో ముంబై ఫాల్కన్స్ తరఫున నిరాశాజనక ప్రదర్శన
ఈ లీగ్‌లో సోబో ముంబై ఫాల్కన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రేయస్ అయ్యర్, ఇప్పటివరకు ఆడిన మూడు ఇన్నింగ్స్‌లలో కేవలం 15.00 సగటుతో, 109.76 స్ట్రైక్ రేట్‌తో కేవలం 45 పరుగులు మాత్రమే చేయగలిగాడు. జూన్ 9వ తేదీ మంగళవారం వాంఖడే స్టేడియంలో ఆకాశ్ టైగర్స్ ఎండబ్ల్యూఎస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అయ్యర్ 10 బంతుల్లో కేవలం 10 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. ఈ మ్యాచ్‌లో అతని జట్టు 66 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూసింది. ఇన్నింగ్స్ అంతటా శ్రేయస్ అసలు లయలో ఉన్నట్లు కనిపించలేదు.
చేతులెత్తేసిన ముంబై ఫాల్కన్స్ బ్యాటర్లు
వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆకాశ్ టైగర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 227/6 పరుగుల భారీ స్కోరు సాధించింది. జై బిస్తా 27 బంతుల్లో 57 రన్స్ చేయగా, అజిత్ యాదవ్ 35 బంతుల్లో 68 రన్స్‌తో రెచ్చిపోయాడు. సర్ఫరాజ్ ఖాన్ కేవలం 10 బంతుల్లోనే 31 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు మంచి ఊపునిచ్చాడు. అనంతరం 228 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సోబో ముంబై ఫాల్కన్స్ క్రమంగా వికెట్లు కోల్పోతూ పేకమేడలా కూలిపోయింది. ఇషాన్ ముల్‌చందాని 40 పరుగులతో వేగంగా ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటికీ, అతను అవుటయ్యాక జట్టు తలవంచేసింది. మిడిల్ ఆర్డర్‌లో వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా చేతులెత్తేయడంతో ఫాల్కన్స్ జట్టు 17.5 ఓవర్లలో 161 పరుగులకే ఆలౌట్ అయింది.
ఐపీఎల్ రికార్డులు చూసే కెప్టెన్సీ
శ్రేయస్ అయ్యర్ ఫామ్ పై ఇంతలా చర్చ జరగడానికి కారణం.. అతను ఐపీఎల్‌లో చూపించిన అద్భుతమైన కెప్టెన్సీ రికార్డే. 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టిన అయ్యర్, ఆ తర్వాత 2025లో పంజాబ్ కింగ్స్ జట్టును ఐపీఎల్ ఫైనల్‌కు చేర్చాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆయన 175.07 స్ట్రైక్ రేట్‌తో 604 రన్స్ చేయగా, ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ తరఫున 168.81 స్ట్రైక్ రేట్‌తో 498 పరుగులు సాధించాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనల వల్లే సెలెక్టర్లు అతడిని టీమిండియా తదుపరి తరం లీడర్‌గా ఎంపిక చేశారు. అజిత్ అగార్కర్ కూడా అయ్యర్ రికార్డులను ప్రశంసిస్తూనే అతనికి కెప్టెన్సీ కట్టబెట్టారు. మరి ఈ తాత్కాలిక ఫ్లాప్ షో నుంచి శ్రేయస్ ఎలా పుంజుకుంటాడో చూడాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
