Team India : పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు టీమిండియా పరిస్థితి.. అభిషేక్ స్థానంలో సంజూకు ఛాన్స్
Team India : టీమిండియా ఓపెనింగ్ స్థానంపై సందిగ్ధత నెలకొంది. జింబాబ్వే సిరీస్‌లో అభిషేక్ శర్మ వరుసగా విఫలమవుతుండగా, మెరుగైన సగటు కలిగిన సంజూ శామ్సన్‌ను తిరిగి జట్టులోకి తీసుకురావాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. రాబోయే మ్యాచ్‌ల్లో జట్టు యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తిగా మారింది.

Abhishek Sharma : భారత టీ20 క్రికెట్ జట్టులో ఓపెనింగ్ స్థానంపై చర్చ తీవ్రమవుతోంది. వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శామ్సన్ తీవ్ర ఫామ్‌లేమితో ఇబ్బంది పడి జట్టుకు దూరమవ్వగా, ఇప్పుడు మరో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా వరుసగా విఫలమవుతున్నాడు. యూకే పర్యటనలో శామ్సన్ 4 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 33 పరుగులు మాత్రమే చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొని జింబాబ్వే పర్యటనకు దూరమయ్యాడు. అయితే ఇప్పుడు జింబాబ్వే సిరీస్‌లో అభిషేక్ శర్మ సైతం ఘోరంగా నిరాశపరిచాడు. ఈ సిరీస్‌లోని 3 మ్యాచ్‌లలో అభిషేక్ కేవలం 11 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఒక్క మ్యాచ్‌లో కూడా కనీసం 10 పరుగుల మార్కును దాటలేకపోయాడు. దీంతో శామ్సన్‌ను పక్కనబెట్టి అభిషేక్‌కు అవకాశాలు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2026 ప్రదర్శన గణాంకాల్లో ఎవరు ముందంజ?
ఈ ఏడాది టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల గణాంకాలను పరిశీలిస్తే, సగటు పరంగా అభిషేక్ శర్మ కంటే సంజూ శామ్సన్ మెరుగైన స్థానంలో ఉన్నాడు. శామ్సన్ ఈ ఏడాది 14 ఇన్నింగ్స్‌లలో 30.77 సగటుతో మొత్తం 400 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. విశేషమేమిటంటే ఈ మూడు హాఫ్ సెంచరీలు కూడా టీ20 వరల్డ్ కప్ లాంటి కీలక టోర్నీలో రావడం గమనార్హం. మరోవైపు అభిషేక్ శర్మ 2026లో ఏకంగా 23 ఇన్నింగ్స్‌లు ఆడి 514 పరుగులు చేసినప్పటికీ, అతని బ్యాటింగ్ యావరేజ్ కేవలం 23.36గా మాత్రమే ఉంది. అభిషేక్ ఈ ఏడాది ఐదు హాఫ్ సెంచరీలు బాదినప్పటికీ, అతని ప్రదర్శనలో ఏమాత్రం స్థిరత్వం లేదు. పైగా ఇదే ఏడాది టీ20ల్లో 6 సార్లు డకౌట్ అయి నిరాశపరిచాడు.
చివరి 10 ఇన్నింగ్స్‌ల రికార్డులు ఏం చెబుతున్నాయి?
ఇరు ఆటగాళ్ల చివరి 10 ఇన్నింగ్స్‌ల ప్రదర్శనను పోల్చి చూస్తే స్పష్టమైన తేడా కనిపిస్తుంది. అభిషేక్ శర్మ తన గత 10 ఇన్నింగ్స్‌లలో కేవలం 19.1 సగటుతో 191 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ (అత్యధిక స్కోరు 59) ఉంది. అదే సమయంలో సంజూ శామ్సన్ తన చివరి 10 ఇన్నింగ్స్‌లలో 40 అత్యుత్తమ సగటుతో 360 పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్ధశతకాలు ఉన్నాయి. అయితే టీ20 వరల్డ్ కప్‌లో చేసిన ఆ మూడు వరుస హాఫ్ సెంచరీలను మినహాయిస్తే, మిగిలిన 7 ఇన్నింగ్స్‌లలో శామ్సన్ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.
ఎవరికి అవకాశం ఇస్తే జట్టుకు మేలు?
ప్రస్తుత గణాంకాలను బట్టి చూస్తే అభిషేక్ శర్మ కంటే సంజూ శామ్సన్ సగటు, స్థిరత్వం విషయంలో మెరుగ్గా ఉన్నట్లు కనిపిస్తోంది. అభిషేక్ శర్మ వద్ద విధ్వంసకర బ్యాటింగ్ నైపుణ్యం ఉన్నప్పటికీ, పదే పదే డకౌట్ అవ్వడం, తక్కువ సగటు కలిగి ఉండటం భారత జట్టు యాజమాన్యానికి పెద్ద తలనొప్పిగా మారింది. రాబోయే మ్యాచ్‌లలో అభిషేక్‌కే మళ్లీ అవకాశం ఇస్తారా లేక అనుభవం, మెరుగైన రికార్డులు ఉన్న సంజూ శామ్సన్‌ను తిరిగి తుది జట్టులోకి తీసుకుంటారా అనేది వేచి చూడాల్సిందే.
