Sarfaraz Khan : సెలక్టర్లూ..ఇంకా ఎన్ని సెంచరీలు కొట్టాలి? ఇలా ఆడుతున్నా ఈ స్టార్ ప్లేయర్ మీద కన్నేయరేం ?
Sarfaraz Khan : టీమిండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మరోసారి దేశవాళీ క్రికెట్‌లో పరుగుల సునామీ సృష్టించాడు. సెలక్టర్లకు తన బ్యాట్‌తోనే సమాధానం ఇస్తూ, రంజీ ట్రోఫీలో మరో సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. ముంబై తరఫున ఆడుతున్న ఈ రన్ మెషిన్, హైదరాబాద్ బౌలర్లను ఉతికి ఆరేస్తూ మైదానంలో పండుగ చేసుకున్నాడు.

Sarfaraz Khan : హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టు మొదట్లో ముంబైని గట్టిగానే దెబ్బతీసింది. కేవలం 82 పరుగులకే ముంబై 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్, అద్భుతమైన పోరాట పటిమను కనబరిచాడు. ఒత్తిడిలో కూడా ఏమాత్రం తడబడకుండా కేవలం 120 బంతుల్లోనే తన సెంచరీ మార్కును అందుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు ఉండటం విశేషం.
సర్ఫరాజ్ ఖాన్ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. గత కొద్ది నెలలుగా అతను ఆడిన ప్రతి ఫార్మాట్‌లోనూ భారీ స్కోర్లు సాధిస్తున్నాడు. గతేడాది డిసెంబర్‌లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సెంచరీ బాదిన అతను, ఆ తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో గోవాపై 157 పరుగులతో వీరవిహారం చేశాడు. ఇప్పుడు మళ్లీ రంజీ ట్రోఫీలో అదే జోరును కొనసాగిస్తూ 22 జనవరి 2026న హైదరాబాద్‌పై సెంచరీతో మెరిశాడు. ఈ సెంచరీతో ముంబై స్కోరును 250 పరుగుల దాటించి జట్టును సురక్షితమైన స్థితిలో నిలబెట్టాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సర్ఫరాజ్ ఖాన్ గణాంకాలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇప్పటివరకు ఆడిన 61 మ్యాచ్‌ల్లోనే ఇది అతనికి 17వ సెంచరీ. అంతేకాకుండా 16 హాఫ్ సెంచరీలు కూడా సాధించాడు. 60కి పైగా సగటుతో పరుగులు చేస్తున్న సర్ఫరాజ్, దేశవాళీ క్రికెట్‌లో ఒక ఐకాన్‌గా మారిపోయాడు. అయినప్పటికీ టీమిండియాలో రెగ్యులర్ ప్లేయర్ గా మారడానికి అతను ఇంకా పోరాడాల్సి రావడం గమనార్హం. గతంలో ఇంగ్లాండ్ సిరీస్‌లో మంచి ప్రదర్శన చేసినా, సీనియర్ల రాకతో జట్టులో స్థానం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ముందున్న 12 నెలల్లో ఆసియా గడ్డపై భారత్ సుమారు 8 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇలాంటి సమయంలో స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనే సర్ఫరాజ్ ఖాన్ వంటి ప్లేయర్ ఫామ్‌లో ఉండటం టీమిండియాకు పెద్ద ప్లస్ పాయింట్. కేవలం టెస్టులకే కాదు, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కూడా తాను వేగంగా ఆడగలనని ఈ ఇన్నింగ్స్ ద్వారా నిరూపించాడు. సర్ఫరాజ్ నిలకడ చూస్తుంటే సెలక్టర్లు అతడిని ఇకపై విస్మరించడం దాదాపు అసాధ్యమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
