T20 World Cup 2026: 2009 తరహాలోనే స్కాట్లాండ్‌కు బంపర్ ఆఫర్..బంగ్లా స్థానాన్ని భర్తీ చేయగలదా?
T20 World Cup 2026: 2026 టీ20 ప్రపంచకప్‌కు ముందు క్రికెట్ ప్రపంచంలో పెను సంచలనం నమోదైంది. భద్రతా కారణాల సాకుతో భారత్‌లో ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్ జట్టుపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కఠిన చర్యలు తీసుకుంది. ఐసీసీ విధించిన గడువు ముగియడంతో, బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తప్పించి ఆ స్థానంలో స్కాట్లాండ్ జట్టును చేర్చుతూ తుది నిర్ణయం తీసుకుంది.

T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026 ఆరంభానికి ముందే ఒక దేశం టోర్నీ నుంచి తప్పుకోవడం క్రికెట్ చరిత్రలో అరుదైన ఘటన. భారత్‌లో తమకు భద్రత లేదని, తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీని కోరింది. అయితే, నిపుణుల నివేదికల ప్రకారం భారత్‌లో ఎటువంటి ప్రమాదం లేదని ఐసీసీ తేల్చిచెప్పింది. జనవరి 21 వరకు ఇచ్చిన గడువులోగా బంగ్లాదేశ్ తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో, ఐసీసీ బోర్డు ఓటింగ్ నిర్వహించి ఆ జట్టును టోర్నీ నుంచి తొలగించాలని నిర్ణయించింది. దీంతో ర్యాంకింగ్స్, క్వాలిఫైయర్ ప్రదర్శన ఆధారంగా తదుపరి ఉత్తమ జట్టుగా ఉన్న స్కాట్లాండ్‌కు ఈ అవకాశం దక్కింది.
నిజానికి స్కాట్లాండ్ జట్టు ఈసారి యూరోపియన్ క్వాలిఫైయర్లలో నాలుగో స్థానంలో నిలిచి నేరుగా అర్హత సాధించలేకపోయింది. కానీ ఐసీసీ నిబంధనల ప్రకారం.. ఏదైనా జట్టు తప్పుకుంటే ఆ ప్రాంతం నుంచి లేదా ర్యాంకింగ్స్ ఆధారంగా మెరుగైన జట్టును తీసుకోవాల్సి ఉంటుంది. స్కాట్లాండ్ ప్రస్తుతం టీ20 ర్యాంకింగ్స్‌లో 14వ స్థానంలో ఉండి, క్వాలిఫై కాని జట్లన్నింటిలో అగ్రస్థానంలో ఉంది. దీంతో బంగ్లాదేశ్ ఉన్న గ్రూప్-సి(ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఇటలీ, నేపాల్‌లతో కూడిన గ్రూప్)లోకి స్కాట్లాండ్ ఎంటర్ కానుంది.
స్కాట్లాండ్‌కు ఇలాంటి అదృష్టం వరించడం ఇది మొదటిసారి కాదు. గతంలో 2009 టీ20 ప్రపంచకప్ సమయంలో కూడా జింబాబ్వే జట్టు రాజకీయ కారణాలతో తప్పుకోగా, అప్పుడు కూడా స్కాట్లాండ్ జట్టుకే వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించింది. స్కాట్లాండ్ ఇప్పటివరకు 6 సార్లు టీ20 ప్రపంచకప్‌లో పాల్గొంది. 2021లో సూపర్-12 దశకు చేరుకోవడమే ఆ జట్టు అత్యుత్తమ ప్రదర్శన. మొత్తం 22 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించిన స్కాట్లాండ్, అసోసియేట్ దేశాల్లో బలమైన జట్టుగా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా 2024 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ వంటి జట్లకు చుక్కలు చూపించిన చరిత్ర స్కాట్లాండ్ సొంతం.
బంగ్లాదేశ్ ప్రభుత్వం, బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం ఆ దేశ క్రికెట్‌కు పెద్ద దెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐసీసీ నుంచి వచ్చే భారీ నిధులు కోల్పోవడంతో పాటు, భవిష్యత్తులో ఐసీసీ టోర్నీల్లో పాల్గొనడంపై కూడా ఆంక్షలు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు స్కాట్లాండ్ ప్లేయర్లు మాత్రం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు. కోల్‌కతా, ముంబై వేదికలుగా జరగనున్న ఈ మ్యాచ్‌లలో స్కాట్లాండ్ ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
