AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఏంటి భయ్యా ఈ వీరంగం! 47 ఏళ్ల వయసులో కళ్ళు చెదిరిపోయే క్యాచ్ పట్టిన సంగ.. వీడియో వైరల్!

శ్రీలంక లెజెండ్ కుమార్ సంగక్కర 47 ఏళ్ల వయసులోనూ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నాడు. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో సౌతాఫ్రికా మాస్టర్స్‌పై మ్యాచ్‌లో ఒక అద్భుతమైన క్యాచ్ పట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వేగంగా వచ్చిన బంతిని ఒక చేత్తో డైవ్ చేసి అందుకున్న సంగక్కర పట్ల అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ తీసుకున్నా, అతని ఆటతీరు ఇప్పటికీ యువ క్రికెటర్లకు స్ఫూర్తినిస్తోంది.

Video: ఏంటి భయ్యా ఈ వీరంగం! 47 ఏళ్ల వయసులో కళ్ళు చెదిరిపోయే క్యాచ్ పట్టిన సంగ.. వీడియో వైరల్!
Kumara Sangakkara
Narsimha
|

Updated on: Mar 01, 2025 | 9:05 AM

Share

సాధారణంగా క్రికెటర్లకు 35 ఏళ్ల వయసు దాటిన తర్వాత ఫిట్‌నెస్ స్థాయి తగ్గిపోతుంది. వికెట్ల మధ్య చురుగ్గా పరిగెత్తడం, క్యాచులు పట్టుకోవడం కష్టతరమవుతుంది. అయితే కొంతమంది మాత్రమే వయసు పెరిగినా తమ ప్రతిభను కొనసాగిస్తారు. అటువంటి వారిలో శ్రీలంక లెజెండ్ కుమార్ సంగక్కర ఒకడు. తాజాగా, 47 ఏళ్ల వయసులో అద్భుతమైన క్యాచ్ పట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఈ అద్భుత ఫీట్‌ను ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో శ్రీలంక మాస్టర్స్-సౌతాఫ్రికా మాస్టర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అందుకున్నాడు. స్టంప్స్ వెనక ఉన్న సంగక్కర ఒక దూకుడు క్యాచ్‌తో అందరినీ విస్మయానికి గురిచేశాడు. వేగంగా వచ్చిన బంతిని ఎడమ వైపుకు డైవ్ చేసి ఒక చేత్తో పట్టుకున్నాడు. ఈ అద్భుత ఘట్టానికి మ్యాచ్‌లోని ఆటగాళ్లు, ప్రేక్షకులు, క్రికెట్ అభిమానులు నోరెళ్లబెట్టారు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కుమార్ సంగక్కర తన ఫిట్‌నెస్, క్రమశిక్షణ, ఆట పట్ల అంకితభావంతో రిటైర్మెంట్ తర్వాత కూడా యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. క్రికెట్ ప్రొఫెషనల్ లీగ్‌కు గుడ్‌బై చెప్పినప్పటికీ, అతని ఫిట్‌నెస్, రిఫ్లెక్స్‌లు ఇప్పటికీ అత్యున్నత స్థాయిలోనే ఉన్నాయి. ఫిట్‌గా ఉండటానికి అతని అంకితభావం యువ క్రికెటర్లకు ఒక ఆదర్శంగా మారింది.

ఈ మ్యాచ్‌లో శ్రీలంక మాస్టర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. హషీమ్ ఆమ్లా నాయకత్వంలోని సౌతాఫ్రికా మాస్టర్స్ 181 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆమ్లా తన క్లాసిక్ బ్యాటింగ్ స్కిల్స్‌ను ప్రదర్శిస్తూ 53 బంతుల్లో 76 పరుగులు సాధించి జట్టును ముందుండి నడిపించాడు. అయితే, ఛేదనలో శ్రీలంక మాస్టర్స్ తొలి దశలో కష్టాల్లో పడినా, చివరకు ఘన విజయం సాధించింది.

కుమార్ సంగక్కర, ఉపుల్ తరంగ 50 పరుగుల భాగస్వామ్యాన్ని అందించగా, సౌతాఫ్రికా బౌలర్ తండి త్సాబలాల వేగంగా రెండు వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. లహిరు తిరిమన్నే రనౌట్ కావడంతో శ్రీలంక 69/3 వద్ద కష్టాల్లో పడింది. కానీ, గుణరత్నే (59), చింతక జయసింహ (51) అద్భుత భాగస్వామ్యం నెలకొల్పి 114 పరుగుల అజేయ భాగస్వామ్యంతో శ్రీలంక మాస్టర్స్‌ను కేవలం 17.2 ఓవర్లలో విజయతీరాలకు చేర్చారు.

ఈ విజయంలో సంగక్కర పట్టిన క్యాచ్ ఓ కీలక ఘట్టంగా నిలిచింది. ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ, అతని ఆటతీరు ఇప్పటికీ క్రికెట్ అభిమానులకు ఆనందాన్ని పంచుతోంది. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో అతని ప్రదర్శన యువ క్రికెటర్లకు ప్రేరణగా నిలుస్తోంది. 47 ఏళ్ల వయసులోనూ పక్షిలా గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టిన సంగక్కర.. నిజంగా ఓ లెజెండే!

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.