World Cup 2023: ప్రపంచకప్ గ్లోబల్ అంబాసిడర్‌గా సచిన్ టెండూల్కర్.. ప్రకటించిన ఐసీసీ..

|

Oct 04, 2023 | 2:51 PM

Sachin Tendulkar: అహ్మదాబాద్‌లో అక్టోబర్ 5 నుంచి ఐసీసీ వన్డే ప్రపంచ కప్ మొదలుకానుంది. కాగా, ఈ వన్డే క్రికెట్ ప్రపంచకప్‌నకు భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గ్లోబల్ అంబాసిడర్‌గా మంగళవారం నియమించింది. దీంతో తొలి మ్యాచ్ జరిగే అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియానికి ప్రపంచ కప్ ట్రోఫీని తీసుకురానున్నాడు. దానితో ప్రపంచ కప్‌ను ఐసీసీ అధికారికంగా ప్రారంభించనుంది.

World Cup 2023: ప్రపంచకప్ గ్లోబల్ అంబాసిడర్‌గా సచిన్ టెండూల్కర్.. ప్రకటించిన ఐసీసీ..
Sachin
Follow us on

World Cup 2023: అహ్మదాబాద్‌లో అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే వన్డే క్రికెట్ ప్రపంచ కప్ (ODI World Cup 2023) కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) మంగళవారం భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ (Sachin Tendulkar) ను ప్రపంచ అంబాసిడర్‌గా నియమించింది. దీని ప్రకారం, సచిన్ టెండూల్కర్ ఇప్పుడు ఐసీసీ ప్రపంచ కప్ ట్రోఫీని సెప్టెంబర్ 4, గురువారం ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ (England vs New Zealand) మధ్య జరిగే మ్యాచ్‌కు ముందు మైదానానికి తీసుకరానున్నారు. దానితో ప్రపంచ కప్‌ను అధికారికంగా ప్రారంభిస్తారు. క్రికెట్ దేవుడు 1987లో బాల్ బాయ్‌గా అవతారమెత్తి.. వరుసగా 6 ప్రపంచ కప్ టోర్నమెంట్లలో దేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఈ క్రమంలో ప్రపంచ కప్ ఎల్లప్పుడూ నా హృదయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందంటూ సచిన్ ప్రకటించారు. ఐసీసీ ప్రపంచకప్ 2011 నా కెరీర్‌లో మరిచిపోలేని ఓ అందమైన అనుభూతి అంటూ సచిన్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.

యువ ఆటగాళ్లకు స్ఫూర్తి..

సచిన్ మాట్లాడుతూ, ‘భారత్‌లో జరిగే ప్రపంచకప్‌ కోసం చాలా జట్లు సిద్ధమవుతున్నాయి. ఈ జట్ల మధ్య గట్టి పోరు జరగనుంది. ఐసీసీ వన్డే ప్రపంచకప్ కోసం ఎదురుచూస్తున్నాను. ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నీలో ఆడటం యువ ఆటగాళ్లకు స్ఫూర్తినిస్తుంది. ఈ ప్రపంచకప్ యువతను ఆటకు చేరువయ్యేలా, దేశానికి ప్రాతినిధ్యం వహించేలా స్ఫూర్తినిస్తుంది’ అని అన్నారు.

19 ఏళ్ల వయసులో అరంగేంట్రం..

ఇదిలా ఉంటే, క్రికెట్ ప్రపంచంలో అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మెన్‌గా సచిన్ నిలిచిన సంగతి తెలిసిందే. 19 ఏళ్ల వయసులో తొలి ప్రపంచకప్‌ ఆడిన సచిన్‌.. క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకునే సమయం వరకు ఎన్నో ప్రపంచ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ రికార్డు సృష్టించాడు. ప్రపంచకప్‌లో 2000 పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ సచిన్ టెండూల్కర్. అలాగే, ఒకే ప్రపంచకప్‌లో 663 పరుగులు చేసిన ప్రపంచ రికార్డు సచిన్ పేరిట ఉంది.

ప్రపంచకప్‌లో టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్.

టీం ఇండియా వన్డే ప్రపంచకప్ 2023 పూర్తి షెడ్యూల్ ఇదే..

అక్టోబర్ 8: భారత్ vs ఆస్ట్రేలియా – చెన్నై

అక్టోబర్ 11: భారత్ vs ఆఫ్ఘనిస్తాన్ – ఢిల్లీ

అక్టోబర్ 14: భారత్ vs పాకిస్థాన్ – అహ్మదాబాద్

అక్టోబర్ 19: భారత్ vs బంగ్లాదేశ్ – పూణె

అక్టోబర్ 22: భారత్ vs న్యూజిలాండ్ – ధర్మశాల

అక్టోబర్ 29: భారత్ vs ఇంగ్లండ్ – లక్నో

నవంబర్ 2: భారత్ vs శ్రీలంక – ముంబై

నవంబర్ 5: భారత్ vs దక్షిణాఫ్రికా – కోల్‌కతా

నవంబర్ 12: భారత్ vs నెదర్లాండ్స్ – బెంగళూరు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..