అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటేందుకు కొంతమంది క్రికెటర్లకు డొమెస్టిక్ టోర్నమెంట్లు మంచి అవకాశంగా నిలుస్తున్నాయి. జేమ్స్ విన్స్, అలెక్స్ హేల్స్, మ్యాక్స్‌వెల్, స్టిర్లింగ్, స్టీఫెన్ ఎస్కినాజీ లాంటి వారు ఈ జాబితాలో ఉన్నారు. ఇప్పుడు చెప్పబోయే బ్యాటర్‌కు అంతర్జాతీయ అనుభవం లేదు.. అలా అని డొమెస్టిక్ క్రికెట్ కూడా పెద్దగా ఆడలేదు. జస్ట్ అండర్ 19 మాత్రమే ఆడాడు. అయినా సీనియర్స్‌ను సైతం గడగడలాడించాడు. సంచలన ఇన్నింగ్స్‌తో 19 ఏళ్లకే లెజెండ్స్ క్లబ్‌లో చేరాడు. అతడెవరో కాదు ఇంగ్లీష్ ప్లేయర్ టామ్ ప్రెస్ట్. తాజాగా జరుగుతున్న రాయల్ లండన్ కప్‌లో ప్రెస్ట్ చెలరేగిపోయాడు. అద్భుత ఇన్నింగ్స్‌తో తన జట్టుకు అపూర్వ విజయాన్ని అందించాడు.
ఇటీవల కెంట్, హాంప్‌షైర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ప్రెస్ట్ డబుల్ సెంచరీకి ఒక్క అడుగు దూరంలో నిలిచాడు. ఈ మ్యాచ్‌లో హాంప్‌షైర్ 163 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన హాంప్‌షైర్ 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 396 పరుగులు చేసింది. ఓపెనర్ గబ్బిన్స్(117) సెంచరీతో అదరగొట్టగా.. వన్ డౌన్‌లో టామ్ ప్రెస్ట్(181) భారీ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. వెరిసి ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో భారీ స్కోర్ సాధించింది. దీనికి సమాధానంగా బరిలోకి దిగిన కెంట్ జట్టు నిర్ణీత ఓవర్లకు 233 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో కెప్టెన్ అలెక్స్ బ్లేక్(62) ఒక్కడే టాప్ స్కోరర్.
19 ఏళ్ల టామ్ ప్రెస్ట్.. ఈ సీజన్‌లో హాంప్‌షైర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కెంట్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్ ఆడటమే కాకుండా.. జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 138 బంతులు ఎదుర్కున్న ప్రెస్ట్ 14 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 181 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతడి స్ట్రైక్ రేట్ 131.16. అంతేకాకుండా బౌండరీల రూపంలో ప్రెస్ట్ కేవలం 21 బంతుల్లోనే 92 పరుగులు రాబట్టాడు.