
ఐపీఎల్‌లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో ఒకవైపు వికెట్లు పడుతూ తీవ్ర ఒత్తిడి నెలకొన్నా ఎక్కడా తడబడకుండా భారీ షాట్లు ఆడుతూ ఢిల్లీ కేపిటల్స్‌ను విజేతగా నిలిపాడు యువ సంచలనం రిషభ్ పంత్. 36 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో చెలరేగి అజేయంగా 78 పరుగులు చేశాడు. దీంతో ఈ మ్యాచ్‌లో గెలుస్తుందనుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓటమి పాలైంది.
చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో పంత్ విన్నింగ్ షాట్ కొట్టగానే ఢిల్లీ జట్టు సభ్యులంతా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మైదానంలోకి పరుగెత్తుకుని వచ్చారు. ఢిల్లీ మెంటార్ గంగూలీ అయితే పంత్‌ను పైకెత్తి మరీ అభినందనలు తెలియజేశాడు. దీంతో పంత్ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఈ మ్యాచ్ తన కెరీర్‌లో చాలా ప్రత్యేకమని, గెలిచిన తర్వాత ఎంతో సంతోషం కలిగిందని అన్నాడు. మ్యాచ్ పూర్తి చేసి బయటకు వస్తుంటే జట్టు సభ్యులంతా నాపై ఎనలేని ప్రేమను కురిపించారు. సౌరవ్ సర్ నన్ను ఎత్తుకోవడం ప్రత్యేకమైన అనుభూతిని కలిగించింది. ఇది కొత్త అనుభవమని పంత్ తెలిపాడు.