Rinku Singh : ఆ 5 సిక్సర్ల తర్వాత మారిపోయిన రింకూ సింగ్ జీవితం.. పెళ్లి ముందే ఏడ్చేసిన కాబోయే భార్య ప్రియా సరోజ్
భారత క్రికెటర్ రింకూ సింగ్, తన ప్రేమ వ్యవహారం గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. ఐపీఎల్‌లో తాను కొట్టిన వరుసగా ఐదు సిక్స్‌లు తన ప్రేమకథను ఎలా బలోపేతం చేశాయో వివరించాడు. తన ప్రియురాలు, ఎంపీ ప్రియా సరోజ్తో నవంబర్‌లో జరగాల్సిన పెళ్లిని వచ్చే ఏడాదికి వాయిదా వేసుకున్నట్లు కూడా రింకూ సింగ్ తెలిపాడు.

Rinku Singh : రింకూ సింగ్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నాడు. అక్కడ టీం ఇండియా సెప్టెంబర్ 14న ఆసియా కప్ 2025లో తన తదుపరి మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో ఆడనుంది. దీనికి ముందు రింకూ సింగ్ తనకు కాబోయే భార్య ప్రియా సరోజ్ మధ్య ఉన్న సంబంధం గురించి ఒక పెద్ద విషయాన్ని బయటపెట్టాడు. రింకూ, ప్రియా ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నారు. నవంబర్‌లో వారికి పెళ్లి జరగాల్సి ఉంది, కానీ అది వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఐపీఎల్‌లో తాను కొట్టిన ఆ 5 సిక్సర్లు వారి బంధాన్ని ఎలా బలోపేతం చేశాయో రింకూ వెల్లడించాడు.
5 సిక్సర్ల కథ
ఐపీఎల్ 2023లో ఒక మ్యాచ్‌లో, కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చివరి ఓవర్‌లో గెలవడానికి 29 పరుగులు అవసరం. అప్పుడు రింకూ సింగ్ వరుసగా 5 సిక్సర్లు కొట్టాడు. ఆ మ్యాచ్‌లో కోల్‌కతా గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ, మొదటి బంతికి ఉమేశ్ యాదవ్ సింగిల్ తీసి రింకూకు స్ట్రైక్ ఇచ్చాడు. ఆ తర్వాత రింకూ వరుసగా 5 సిక్సర్లు కొట్టి తన జట్టును గెలిపించాడు.
2 ఏళ్ల తర్వాత రింకూ సంచలన విషయాలు
ఆ సంఘటన జరిగి రెండు సంవత్సరాలు అయిన తర్వాత, రింకూ ఆ 5 సిక్సర్లు ప్రియాతో తన బంధాన్ని ఎలా బలోపేతం చేశాయో గుర్తు చేసుకున్నాడు. రాజ్ షమనీ యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. ఆ సమయంలో ప్రియా సరోజ్ తండ్రికి తాను ఎవరో తెలియదని చెప్పాడు. ప్రియా సరోజ్ తండ్రి తుఫానీ సింగ్ ఒక ఎంపీగా పనిచేసారు, ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు.
రింకూ సింగ్ ఆ ఇన్నింగ్స్ ఆడినప్పుడు ప్రియా సరోజ్ చాలా ఎమోషనల్ అయిందని చెప్పాడు. ఆమె ఫోన్‌లో ఏడ్చిందని, సాచి దీదీ (క్రికెటర్ నితీశ్ రాణా భార్య) తనతో చెప్పిందని అన్నాడు. ఆ రోజు తనకు చాలా ముఖ్యమని రింకూ అన్నాడు. ఆ 5 సిక్సర్ల తర్వాత ప్రజలు తనను గుర్తించడం మొదలుపెట్టారని, అందుకే ఇప్పుడు విషయాలు సులభంగా మారతాయని తాను భావించానని చెప్పాడు. ఆ సమయంలో తన తండ్రికి తాను ఎవరో తెలియదని, అతనికి క్రికెట్‌పై కూడా ఆసక్తి లేదని రింకూ వివరించాడు. అందుకే ప్రియా తండ్రికి తన గురించి పెద్దగా తెలియదని చెప్పాడు.
5 సిక్సర్లు జీవితాన్ని మార్చేశాయి
యశ్ దయాల్ ఓవర్‌లో ఆ 5 సిక్సర్లు కొట్టిన తర్వాత, రింకూ సింగ్ జీవితం రాత్రికి రాత్రే మారిపోయింది. అతనికి ఒక గుర్తింపు లభించింది. తాను చేసిన కష్టానికి ఆ మ్యాచ్‌లో ఫలితం దొరికిందని రింకూ అన్నాడు. ఆ తర్వాత అతని సోషల్ మీడియా ఫాలోవర్స్ సంఖ్య పెరిగిపోయింది. రింకూ సింగ్, ప్రియా సరోజ్ ఈ సంవత్సరం జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవచ్చని భావిస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




