AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rinku Singh: లీగ్‌లో 10 కి 9 విజయాలు.. రింకూ సింగ్ కెప్టెన్సీకి ఫిదా అవుతున్న ఐపీఎల్ దిగ్గజాలు

Rinku Singh: యూపీ టీ20 లీగ్ 2026లో రింకూ సింగ్ కెప్టెన్సీలో మెరట్ మావెరిక్స్ అద్భుతంగా రాణించి ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో లక్నో ఫాల్కన్స్‌పై 94 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది. లీగ్‌లో 10 మ్యాచ్‌ల్లో 9 విజయాలతో సత్తా చాటిన రింకూ నాయకత్వంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఐపీఎల్ 2027లో కేకేఆర్ కెప్టెన్‌గా రింకూకు అవకాశం దక్కుతుందా అనే చర్చ ఆసక్తికరంగా మారింది.

Rinku Singh: లీగ్‌లో 10 కి 9 విజయాలు.. రింకూ సింగ్ కెప్టెన్సీకి ఫిదా అవుతున్న ఐపీఎల్ దిగ్గజాలు
Rinku Singh
Rakesh
|

Updated on: Sep 07, 2026 | 9:34 AM

Share

Rinku Singh: టీమిండియా యంగ్ సెన్సేషన్ రింకూ సింగ్ తన కెప్టెన్సీతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయన సారథ్యంలోని మెరట్ మావెరిక్స్ జట్టు యూపీ టీ20 లీగ్ 2026 ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్‌లో భువనేశ్వర్ కుమార్ నేతృత్వంలోని లక్నో ఫాల్కన్స్‌ను చిత్తు చేసి రెండోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఫైనల్ పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన మెరట్ మావెరిక్స్ నిర్ణీత ఓవర్లలో 203 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ దివ్యాంశ్ జోషి మైదానంలో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు. కేవలం కొన్ని ఓవర్ల వ్యవధిలోనే 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 105 పరుగులు చేసి లక్నో బౌలర్లకు చుక్కలు చూపించారు. మిగతా బ్యాటర్లు ఎవరూ 25 పరుగుల మార్కును దాటలేకపోయినా, కెప్టెన్ రింకూ సింగ్ ఒక పరుగుకే అవుట్ అయినా దివ్యాంశ్ ఒంటరి పోరాటం జట్టును భారీ స్కోరు వైపు నడిపించింది. లక్నో బౌలర్లలో అభినందన్ సింగ్ 3 వికెట్లు పడగొట్టగా, కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ ఒక వికెట్ దక్కించుకున్నారు.

109 పరుగులకే కుప్పకూలిన లక్నో

204 పరుగుల విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగిన లక్నో ఫాల్కన్స్ ఆరంభం నుంచి నిలకడ కోల్పోయింది. మెరట్ బౌలర్లు క్రమబద్ధమైన దాడితో లక్నో బ్యాటర్లను కట్టడి చేశారు. అజిత్ వర్మ సాధించిన 39 పరుగులే ఆ జట్టులో అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఏ దశలోనూ పోరాటపటిమ చూపలేకపోయిన లక్నో జట్టు చివరకు 109 పరుగులకే కుప్పకూలింది. 94 పరుగుల భారీ ఆధిక్యంతో విజయాన్ని నమోదు చేసిన మెరట్ మావెరిక్స్ జట్టు లీగ్‌లో తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. అద్భుత సెంచరీతో మెరిసిన దివ్యాంశ్ జోషికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

లీగ్‌లో తిరుగులేని ఆధిపత్యం

ఈ టోర్నీలో రింకూ సింగ్ జట్టు ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఏకంగా 9 మ్యాచ్‌లు గెలిచి విజయపరంపర కొనసాగించింది. గతంలో 2024 లోనూ రింకూ సారథ్యంలోనే మెరట్ మావెరిక్స్ తొలిసారి విజేతగా నిలిచింది. నాయకుడిగా జట్టును ముందుకు నడిపించడంలో, యువ ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టడంలో రింకూ చూపిన చొరవను మాజీ ఆటగాళ్లు ప్రశంసిస్తున్నారు. మైదానంలో ఆయన తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాయి.

కేకేఆర్ కెప్టెన్‌గా రింకూ సింగ్?

ఈ ఘనవిజయంతో ఐపీఎల్ ఫ్రాంచైజీ కలకత్తా నైట్ రైడర్స్ (కేకేఆర్) దృష్టి ఇప్పుడు రింకూ సింగ్ వైపు మళ్లింది. సీనియర్ ఆటగాడు అజింక్యా రహానే క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో కేకేఆర్ కొత్త కెప్టెన్ వేటలో పడింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో కేకేఆర్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన రింకూకు ఇప్పుడు పూర్తి స్థాయి నాయకత్వ బాధ్యతలు అప్పగించే ఆలోచనలో యాజమాన్యం ఉంది. అత్యుత్తమ ఫినిషర్‌గా గుర్తింపు పొందిన ఆయనకు కెప్టెన్సీ ఇస్తే జట్టుకు ఎంతో మేలు జరుగుతుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us