
టీ20 వరల్డ్‌కప్ 2026 సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు భారత జట్టు ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ లేమితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ టీ20 బ్యాటర్ అయినప్పటికీ, ఈ టోర్నమెంట్‌లో అతడు అంతగా రాణించడం లేదు. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌ల్లో కేవలం 80 పరుగులు మాత్రమే చేశాడు. గ్రూప్ దశలో అమెరికా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లపై మూడుసార్లు డక్ అవుట్ అయ్యాడు. సూపర్ 8లో జింబాబ్వేతో అర్ధశతకం సాధించినప్పటికీ, వెస్ట్ ఇండీస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో కేవలం 10 పరుగులకే ఔట్ అయ్యాడు. మరోసారి స్పిన్నర్ దెబ్బకి సులువుగా క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ టీమిండియాను హెచ్చరిస్తూనే అభిషేక్ శర్మకు విలువైన సూచనలు చేశాడు. ముంబైలోని వాంఖెడే స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరగబోయే సెమీఫైనల్ ముందు మానసికంగా ఫ్రెష్‌గా ఉండాలని సూచించాడు. ఒత్తిడిలో ఉన్నప్పుడు ప్రతిరోజు నెట్స్‌లో గంటల కొద్దీ బ్యాటింగ్ చేయడం మంచిది కాదని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. కొన్నిసార్లు మానసికంగా విశ్రాంతి తీసుకోవడం అవసరం అని, నైపుణ్యాలు ఎక్కడికి పోవని అన్నాడు. ఒత్తిడి ఎక్కువగా ఉన్న టోర్నమెంట్‌లలో బ్యాటింగ్‌కు కొద్దిసేపు విరామం ఇచ్చి, ఫీల్డింగ్, బౌలింగ్ ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టాలని అభిషేక్‌కు సూచించాడు. ఈ విధమైన వ్యూహ మార్పు బ్యాటర్‌కు మానసిక స్థైర్యాన్ని, ఆట పట్ల కొత్త దృక్పథాన్ని అందిస్తుందని పాంటింగ్ నమ్మకం వ్యక్తం చేశాడు.
అంతేకాకుండా, ముంబైలో ఇంగ్లాండ్‌తో జరగబోయే సెమీఫైనల్‌లో అభిషేక్ శర్మను తప్పించకూడదని పాంటింగ్ టీమిండియాను కోరాడు. అభిషేక్ శర్మకు ఇంగ్లాండ్‌పై మంచి రికార్డు ఉందని గుర్తు చేశాడు. గత జనవరిలో ఇదే వాంఖెడే మైదానంలో ఇంగ్లాండ్‌పై శతకం సాధించిన విషయాన్ని పాంటింగ్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. సెమీఫైనల్‌లో అభిషేక్ శర్మ ఏదో ప్రత్యేకంగా చేస్తాడని తనకు నమ్మకం ఉందని, అతడు మ్యాచ్ విన్నర్ అని, ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించవద్దని రికీ పాంటింగ్ స్పష్టం చేశాడు. కచ్చితంగా వాంఖెడేలో దుమ్ము దుమారం రేపుతాడని పాంటింగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఇది చదవండి: సెమీస్‌లో గెలిచి ఫైనల్‌కు వెళ్తే.. టీమిండియాకు శనిలా అతిపెద్ద రెండు గండాలు