Richest Cricketer: ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళా క్రికెటర్ ఎవరో తెలుసా? టాప్ 5లో ముగ్గురు మనోళ్లే
Richest Cricketer: ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళా క్రికెటర్‌గా ఆస్ట్రేలియా స్టార్ ఎలిస్ పెర్రీ నిలిచింది. సుమారు రూ.120 కోట్ల నెట్‌వర్త్‌తో ఆమె అగ్రస్థానంలో ఉండగా, మెగ్ లానింగ్ రెండో స్థానంలో ఉంది. భారత్ నుంచి మిథాలీ రాజ్, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ టాప్5లో చోటు దక్కించుకున్నారు. మహిళా క్రికెట్‌లో ఆటతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, లీగ్‌లు ఆదాయాన్ని పెంచుతున్నాయి.

Richest Cricketer: మహిళా క్రికెట్ ప్రయాణం గత కొన్నేళ్లుగా ఊహించని మలుపులు తిరుగుతోంది. క్రీడాకారుల సంపాదనలో కూడా భారీ మార్పులు కనిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళా క్రికెటర్ రేసులో భారత్ అగ్రస్థానంలో నిలుస్తుందని అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ ఆల్‌రౌండర్ ఎలిస్ పెర్రీ రూ.120 కోట్ల నెట్‌వర్త్‌తో ప్రపంచంలోనే ధనిక మహిళా క్రికెటర్‌గా అగ్రస్థానంలో నిలిచింది.
నెంబర్ వన్ స్థానంలో ఎలిస్ పెర్రీ
ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్‌రౌండర్ ఎలిస్ పెర్రీ ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగిన మహిళా క్రికెటర్‌గా నిలిచింది. క్రికెట్ మైదానంలో అద్భుత ప్రదర్శన చేయడమే కాకుండా, బ్రాండ్ ప్రపంచంలోనూ ఆమె ఒక శక్త్యత్మక ముద్ర వేసింది. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్, డబ్ల్యూబీబీఎల్‌లో సిడ్నీ సిక్సర్స్ జట్టుతో ఒప్పందం, అడిడాస్, కామన్వెల్త్ బ్యాంక్ వంటి అంతర్జాతీయ బ్రాండ్ల ప్రమోషన్ల ద్వారా ఆమె భారీగా ఆర్జిస్తోంది. మైదానం బయట ఇచ్చే మోటివేషనల్ స్పీచ్‌ల ద్వారా కూడా ఆమెకు పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతోంది.
రెండో స్థానంలోనూ ఆసీస్ మాజీ కెప్టెన్
సంపన్న మహిళా క్రికెటర్ల జాబితాలో రెండో స్థానాన్ని కూడా ఆస్ట్రేలియా క్రీడాకారిణే సొంతం చేసుకుంది. ఆసీస్ మాజీ కెప్టెన్ మెగ్ లానింగ్ దాదాపు రూ.75 కోట్ల అంచనా నెట్‌వర్త్‌తో రెండో స్థానంలో కొనసాగుతోంది. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా ఆమె వివిధ క్రికెట్ లీగ్‌లు, ది హండ్రెడ్ టోర్నీ, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, బ్రాడ్‌కాస్టింగ్, క్రికెట్ కన్సల్టింగ్ ద్వారా నిరంతరం భారీగా సంపాదిస్తోంది.
భారత్ నుంచి మిథాలీ రాజ్
భారత మహిళా క్రికెటర్ల విషయానికి వస్తే మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ దేశంలోనే అత్యంత సంపన్న క్రికెటర్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ జాబితాలో ఆమె రూ.43 కోట్ల నెట్‌వర్త్‌తో మూడో స్థానాన్ని దక్కించుకుంది. సుదీర్ఘమైన క్రికెట్ కెరీర్‌తో పాటు వ్యాఖ్యాతగా బాధ్యతలు నిర్వర్తించడం, బ్రాండ్ ప్రచారాలు, మీడియా కార్యక్రమాలు, ఆమె బయోపిక్ సినిమా ఒప్పందాలు మిథాలీ ఆదాయానికి ప్రధాన మూలాలుగా నిలిచాయి.
టాప్ 5లో భారత్ నుంచి ముగ్గురు క్రీడాకారిణులు
ప్రపంచ ధనిక మహిళా క్రికెటర్ల టాప్ 5 జాబితాలో ముగ్గురు భారతీయ క్రీడాకారిణులు స్థానం సంపాదించడం విశేషం. మిథాలీ రాజ్ మూడో స్థానంలో ఉండగా, రూ.35 కోట్ల నెట్‌వర్త్‌తో స్మృతి మంధాన నాలుగో స్థానంలో నిలిచింది. డబ్ల్యూపీఎల్ కాంట్రాక్ట్, బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్, సోషల్ మీడియా ప్రమోషన్ల ద్వారా స్మృతి సంపాదిస్తోంది. ఇక రూ.26 కోట్ల అంచనా నెట్‌వర్త్‌తో భారత టి20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఐదో స్థానాన్ని సొంతం చేసుకుంది. విదేశీ ఫ్రాంచైజీ లీగ్‌లు, బ్రాండ్ ఒప్పందాలు ఈమె సంపాదనను పెంచాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
