AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HBD Ganguly: దాదా బయోపిక్‌ ‘ఫస్ట్‌ లుక్‌’ అదుర్స్.. ఆ ఐకానిక్ సీన్‌తో ఫ్యాన్స్‌కు పూనకాలే..!

Dada Movie First Look: సౌరవ్ గంగూలీ బయోపిక్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడో వచ్చినప్పటికీ, ఈ ఫస్ట్ లుక్ చిత్ర పరిశ్రమతో పాటు క్రీడా ప్రపంచంలోనూ సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ చిత్రం 2027 మే 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ ఎత్తున విడుదల కానుంది. దాదా క్రీడా జీవితంలోని భావోద్వేగాలను, తెరవెనుక రాజకీయాలను ఈ సినిమా ఏ విధంగా చూపిస్తుందో అని యావత్ భారతదేశం ఎంతగానో ఎదురుచూస్తోంది.

HBD Ganguly: దాదా బయోపిక్‌ ‘ఫస్ట్‌ లుక్‌’ అదుర్స్.. ఆ ఐకానిక్ సీన్‌తో ఫ్యాన్స్‌కు పూనకాలే..!
Rajkummar Rao Turns Sourav Ganguly In First Look From Dada Biopic
Venkata Chari
|

Updated on: Jul 08, 2026 | 11:10 AM

Share

సౌరవ్ గంగూలీ.. భారత క్రికెట్ చరిత్రను మలుపు తిప్పిన ధీరుడు. మైదానంలో ఆయన చూపిన దూకుడు, తెగువ కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. ఇప్పుడు ఆ ‘దాదా’ జీవిత విశేషాలు వెండితెరపై ఆవిష్కృతం కాబోతున్నాయి. బాలీవుడ్ ప్రతిభావంతుడు రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ బయోపిక్ ఫస్ట్‌ లుక్ తాజాగా విడుదలై సామాజిక మాధ్యమాలను ఊపేస్తోంది.

లార్డ్స్ బాల్కనీలో ఆ చారిత్రాత్మక క్షణం..!

భారత క్రికెట్ ప్రేమికులు ఎప్పటికీ మరచిపోలేని రోజు 2002 నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్. లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌పై సాధించిన చారిత్రాత్మక విజయం అనంతరం, అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ లార్డ్స్ బాల్కనీలో నిలబడి తన జెర్సీని గాల్లోకి ఊపుతూ చేసిన సంబరాలు ఒక సంచలనం. తాజాగా విడుదలైన ‘దాదా: ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో నటుడు రాజ్‌కుమార్ రావు సరిగ్గా అదే ఐకానిక్ సీన్‌ని రీక్రియోట్ చేశారు. దాదా పుట్టినరోజును పురస్కరించుకుని విడుదల చేసిన ఈ పోస్టర్ అభిమానులలో పూనకాలు తెప్పిస్తోంది. గంగూలీ నాటి తెగువను, గంభీరమైన ముఖ కవళికలను రాజ్‌కుమార్ రావు అద్భుతంగా పలికించినట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతోంది.

క్రికెట్ దిగ్గజం ప్రస్థానం వెండితెరపై..

ఈ బయోపిక్ సౌరవ్ గంగూలీ చిన్ననాటి రోజుల నుంచి, భారత జట్టుకు అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ఎదిగిన వరకు సాగిన ప్రయాణాన్ని చూపించనుంది. కేవలం ఆట మాత్రమే కాకుండా, భారత క్రికెట్‌కు లభించిన కొత్త ఆత్మవిశ్వాసాన్ని, మ్యాచ్ ఫిక్సింగ్ కల్లోలంలో చిక్కుకున్న జట్టును దాదా ఎలా నిలబెట్టారనే స్ఫూర్తిదాయకమైన కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. విక్రమాదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని లవ్ రంజన్, అంకుర్ గార్గ్ నిర్మిస్తున్నారు. టి-సిరీస్ సంస్థ ఈ సినిమాను సమర్పిస్తోంది.

సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన..

ఈ ఫస్ట్ లుక్ విడుదలైన కొద్దిసేపటికే ఇంటర్నెట్‌లో విపరీతమైన చర్చ మొదలైంది. మెజారిటీ అభిమానులు రాజ్‌కుమార్ రావు రూపానికి ఫిదా అవుతున్నారు. “ఇది కేవలం ఒక సంబరం కాదు, భారత క్రికెట్ గౌరవాన్ని డిమాండ్ చేసిన క్షణం. దీనిని వెండితెరపై చూడటానికి ఎదురుచూస్తున్నాం” అంటూ కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, మరికొందరు నెటిజన్లు మాత్రం ఈ పోస్టర్ గ్రాఫిక్స్ అంతగా బాగోలేదని, ఇది ఒక అభిమాని చేసిన పోస్టర్‌లా ఉందంటూ పెదవి విరుస్తున్నారు. నటుడిగా రాజ్‌కుమార్ రావును తక్కువ అంచనా వేయలేమని, సినిమాలో ఆయన నటనతో అందరి నోళ్లు మూయిస్తారని దాదా అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us