IPL 2026 : అర్ష్‌దీప్ సింగ్‌పై పంజాబ్ కింగ్స్ సీరియస్.. డ్రెస్సింగ్ రూమ్ రహస్యాల లీక్‌పై అత్యవసర సమావేశం

IPL 2026 : పంజాబ్ కింగ్స్ జట్టులో కీలక ఆటగాడైన అర్ష్‌దీప్ సింగ్‌కు సోషల్ మీడియాలో ఆరు మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన తరచుగా డ్రెస్సింగ్ రూమ్, మైదానంలోని దృశ్యాలను వీడియోల రూపంలో తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేస్తూ ఉంటారు.

IPL 2026 : అర్ష్‌దీప్ సింగ్‌పై పంజాబ్ కింగ్స్ సీరియస్.. డ్రెస్సింగ్ రూమ్ రహస్యాల లీక్‌పై అత్యవసర సమావేశం
Arshdeep Singh (4)

Updated on: May 09, 2026 | 9:10 PM

IPL 2026 : ఐపీఎల్ 2026లో వరుస వివాదాలు బీసీసీఐ, ఫ్రాంచైజీలను కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా ఆటగాళ్లు సోషల్ మీడియాలో వ్యక్తిగత వీడియోలు (వ్లాగ్స్) షేర్ చేయడం పై పంజాబ్ కింగ్స్ యాజమాన్యం కఠిన నిర్ణయం తీసుకోనుంది. శనివారం జరగనున్న అత్యవసర సమావేశంలో స్టార్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌పై కీలక ఆంక్షలు విధించే అవకాశం ఉంది. డ్రెస్సింగ్ రూమ్ క్రమశిక్షణే లక్ష్యంగా ఈ అడుగులు పడుతున్నాయి.

అర్ష్‌దీప్ సింగ్ వ్లాగింగ్‌పై నిషేధం?

పంజాబ్ కింగ్స్ జట్టులో కీలక ఆటగాడైన అర్ష్‌దీప్ సింగ్‌కు సోషల్ మీడియాలో ఆరు మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన తరచుగా డ్రెస్సింగ్ రూమ్, మైదానంలోని దృశ్యాలను వీడియోల రూపంలో షేర్ చేస్తూ ఉంటారు. అయితే, దీనివల్ల జట్టు అంతర్గత వ్యూహాలు, రహస్యాలు బయటకు పొక్కే ప్రమాదం ఉందని యాజమాన్యం భావిస్తోంది. ఈ క్రమంలో సీజన్ ముగిసే వరకు ఆటగాళ్లందరూ వ్యక్తిగత వ్లాగ్స్ చేయకుండా నిషేధం విధించాలని పంజాబ్ కింగ్స్ నిర్ణయించింది.

అత్యవసర సమావేశం, సంతకాలు

ధర్మశాలలోని స్టేడియంలో శనివారం సాయంత్రం ప్రాక్టీస్ ముగిసిన తర్వాత పంజాబ్ కింగ్స్ యాజమాన్యం ఆటగాళ్లతో భేటీ కానుంది. ఈ సమావేశంలో కొత్త నిబంధనల గురించి వివరించి, ప్రతి ఆటగాడి నుంచి రాతపూర్వక అంగీకారాన్ని తీసుకోనున్నారు. ఇకపై జట్టుకు సంబంధించిన ఏ సమాచారమైనా లేదా వీడియోలైనా కేవలం పంజాబ్ కింగ్స్ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ల ద్వారానే రావాలని, పర్సనల్ అకౌంట్లలో ఎటువంటి కంటెంట్ పోస్ట్ చేయకూడదని నిబంధన విధించనున్నారు.

బీసీసీఐ కఠిన మార్గదర్శకాలు

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో కొందరు ఆటగాళ్లు నిషేధిత ప్రాంతాల్లో పొగత్రాగడం (వేపింగ్) వంటి చర్యలకు పాల్పడటం కలకలం రేపింది. దీంతో బీసీసీఐ రంగంలోకి దిగి కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది.

* ఆటగాళ్లు హోటల్ వదిలి వెళ్లే ముందు అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.

* జట్టు మేనేజర్, భద్రతా అధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా బయటకు వెళ్లకూడదు.

* తెలియని వ్యక్తులు ఆటగాళ్ల గదుల్లోకి ప్రవేశించకుండా కఠినమైన నిఘా ఉంచాలి.

* హనీట్రాప్, బెట్టింగ్ వంటి ముప్పుల నుంచి ఆటగాళ్లను రక్షించడమే ఈ నియమాల ప్రధాన ఉద్దేశ్యం.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

బీసీసీఐ నిబంధనలను ఖాతరు చేయని ఆటగాళ్లు, ఫ్రాంచైజీలపై భారీ జరిమానాలు విధించనున్నారు. తీవ్రమైన సందర్భాల్లో ఆటగాళ్లను ప్రస్తుత సీజన్ లేదా తదుపరి సీజన్ల నుండి సస్పెండ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ చట్టపరమైన ఉల్లంఘనలు జరిగితే, విషయాన్ని పోలీసు అధికారులకు అప్పగిస్తామని బోర్డు హెచ్చరించింది. పంజాబ్ కింగ్స్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం ఐపీఎల్‌లో క్రమశిక్షణను పునరుద్ధరించడానికి ఒక కీలక అడుగుగా భావించవచ్చు.

Follow Us