AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MI vs PBKS IPL 2026: డికాక్ సెంచరీ వృథా.. ప్రభసిమ్రాన్, శ్రేయస్ అయ్యర్ మెరుపులతో పంజాబ్ ఘనవిజయం

MI vs PBKS IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా వాంఖడే స్టేడియంలో జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్ ఘనవిజయం సాధించింది. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ అలవోకగా ఛేదించి, ఈ సీజన్‌లో తమ అజేయ ప్రస్థానాన్ని కొనసాగించింది.

MI vs PBKS IPL 2026: డికాక్ సెంచరీ వృథా.. ప్రభసిమ్రాన్, శ్రేయస్ అయ్యర్ మెరుపులతో పంజాబ్ ఘనవిజయం
Mi Vs Pbks Ipl 2026
Rakesh
|

Updated on: Apr 16, 2026 | 11:05 PM

Share

MI vs PBKS IPL 2026 : ఐపీఎల్ 2026లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్ ఘనవిజయం సాధించింది. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ మరో 21 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి, ఈ సీజన్‌లో తమ అజేయ ప్రస్థానాన్ని కొనసాగించింది. క్వింటన్ డికాక్ అద్భుత సెంచరీ వృథా కాగా, పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ప్రభసిమ్రాన్ సింగ్ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో జట్టును గెలుపు తీరాలకు చేర్చారు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. అర్ష్‌దీప్ సింగ్ నిప్పులు చెరిగే బంతులతో వరుస బంతుల్లో రికెల్టన్ (2), సూర్యకుమార్ యాదవ్ (0)లను అవుట్ చేసి ముంబైని డిఫెన్స్‌లో పడేశాడు. అయితే, రోహిత్ శర్మ గాయంతో దూరం కావడంతో వచ్చిన అవకాశాన్ని క్వింటన్ డికాక్ అద్భుతంగా వాడుకున్నాడు. కేవలం 60 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనికి నమన్ ధీర్ (50) తోడవ్వడంతో ముంబై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.

196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు పవర్‌ప్లేలో రెండు వికెట్లు కోల్పోయినా ప్రభసిమ్రాన్ సింగ్ అండగా నిలిచాడు. ప్రభసిమ్రాన్ కేవలం 18 బంతుల్లోనే 35 పరుగులు చేసి వేగాన్ని పెంచాడు, ఆపై గేర్ మార్చి 78 పరుగులు బాదాడు. ఆ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో కలిసి మూడో వికెట్‌కు 70 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరి జోరుకు ముంబై బౌలర్లు బెంబేలెత్తిపోయారు.

కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన కూల్ అండ్ క్లాస్ బ్యాటింగ్‌తో ముంబై బౌలర్లను ఆడుకున్నాడు. గజన్‌ఫర్ రెండు వికెట్లు తీసి ముంబైని రేసులోకి తెచ్చే ప్రయత్నం చేసినా, శ్రేయస్ అయ్యర్ (66) ఏమాత్రం తడబడకుండా బాదాడు. 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న శ్రేయస్, పంజాబ్ జట్టును గెలుపు ముంగిట నిలిపి అవుట్ అయ్యాడు. పంజాబ్ కేవలం 16.3 ఓవర్లలోనే 198 పరుగులు చేసి విజయం సాధించింది.

జస్ప్రీత్ బుమ్రా పొదుపుగా బౌలింగ్ చేసినా, ఇతర బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా శ్రేయస్, ప్రభసిమ్రాన్ పార్టనర్ షిప్ ముంబై అవకాశాలను దెబ్బతీసింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబైకి ఇది ఈ సీజన్‌లో ఐదో మ్యాచ్ కాగా, అందులో ఇది నాలుగో ఓటమి. మరోవైపు శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో పంజాబ్ ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు గెలిచి, ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.

Follow Us