
IPL 2026: భారత వెటరన్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన కెరీర్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు. మార్చి 28 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 కోసం ఆయన తన జీవనశైలిని పూర్తిగా మార్చుకున్నాడు. గత కొంతకాలంగా గాయాలు, అనారోగ్య సమస్యలతో సతమతమైన చాహల్.. ఈసారి తన శరీరానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఏబీ డివిలియర్స్ యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడిన చాహల్, “నేను మద్యం మానేసి ఆరు నెలలు దాటింది. ఇప్పుడు నాకు 35 ఏళ్లు, నా జట్టు కోసం మైదానంలో 150 శాతం శక్తిని ధారబోయాలని అనుకుంటున్నాను” అని స్పష్టం చేశాడు.
గత ఐపీఎల్ సీజన్లలో చాహల్ అద్భుతంగా రాణించినప్పటికీ, టైటిల్ మాత్రం చేజారిపోతూనే ఉంది. 2013లో ముంబై ఇండియన్స్‌తో టైటిల్ గెలిచిన తర్వాత, ఆర్‌సీబీ, రాజస్థాన్ రాయల్స్, గత ఏడాది పంజాబ్ కింగ్స్ తరపున ఫైనల్స్ ఆడినా ట్రోఫీని అందుకోలేకపోయాడు. గత సీజన్ చివర్లో ఎదురైన గాయాలు తన ప్రదర్శనపై ప్రభావం చూపాయని చాహల్ ఆవేదన వ్యక్తం చేశాడు. కేకేఆర్‌తో మ్యాచ్ తర్వాత రిబ్ ఫ్రాక్చర్, నకిల్ ఇంజ్యూరీ కారణంగా సెమీఫైనల్, ఫైనల్స్‌లో తాను సరిగ్గా బౌలింగ్ చేయలేకపోయానని ఆయన గుర్తు చేసుకున్నాడు.
గత సీజన్ ఫైనల్ ఓటమిపై స్పందిస్తూ, ఆల్ రౌండర్ మార్కో జాన్సెన్ సేవలను పంజాబ్ కింగ్స్ కోల్పోవడం కోలుకోలేని దెబ్బ అని చాహల్ అభిప్రాయపడ్డాడు. జాన్సెన్ ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదని, బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ ఆయన కీలక సిక్సర్లు కొట్టగల సామర్థ్యం కలవాడని కొనియాడాడు. ప్రస్తుతం జాన్సెన్ ఫామ్‌లో ఉండటం జట్టుకు కొండంత బలాన్ని ఇస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.
ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకరైన చాహల్, ఇప్పటివరకు 172 మ్యాచ్‌ల్లో 221 వికెట్లు పడగొట్టాడు. నవంబర్ 2025లో హర్యానా తరపున ఆడిన తర్వాత డెంగ్యూ, చికన్ గున్యా బారిన పడి విశ్రాంతి తీసుకున్నాడు. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో, కొత్త ఉత్సాహంతో మార్చి 31న గుజరాత్ టైటాన్స్‌తో జరగబోయే తొలి మ్యాచ్ కోసం సిద్ధమవుతున్నాడు. న్యూ చండీగఢ్ వేదికగా జరగనున్న ఈ పోరులో చాహల్ తన మ్యాజిక్ స్పిన్‌తో మళ్ళీ అలరించాలని అభిమానులు కోరుకుంటున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..