Asia Cup 2025: బీసీసీఐ స్కెచ్‌తో గజగజ వణికిపోతోన్న మోహ్సిన్ నఖ్వి.. ఐసీసీ సమావేశానికి గైర్హాజరు..?

Asia Cup 2025: ఏసీసీ అధ్యక్షుడిగా నఖ్వీ వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేసి, అవసరమైతే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పదవి నుంచి ఆయన్ను తొలగించాలని కూడా బీసీసీఐ డిమాండ్ చేయవచ్చని తెలుస్తోంది. టోర్నమెంట్ ముగిసినా ట్రోఫీని అందించకుండా జాప్యం చేయడం సరైన పద్ధతి కాదని, విజేతగా భారత్‌కు ట్రోఫీ దక్కడం ఖాయమని బీసీసీఐ గట్టిగా చెబుతోంది.

Asia Cup 2025: బీసీసీఐ స్కెచ్‌తో గజగజ వణికిపోతోన్న మోహ్సిన్ నఖ్వి.. ఐసీసీ సమావేశానికి గైర్హాజరు..?
Bcci Vs Mohsin Naqvi

Updated on: Nov 05, 2025 | 1:47 PM

BCCI vs PCB: దుబాయ్‌లో జరగనున్న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB) ఛైర్మన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) హాజరు కావడం లేదని వార్తలు వస్తున్నాయి. మరోవైపు, ఇటీవల ముగిసిన ఆసియా కప్ 2025 ట్రోఫీని భారత జట్టుకు అందజేయకపోవడంపై ఉన్న వివాదాన్ని ఈ సమావేశంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) లేవనెత్తేందుకు సిద్ధమైంది. దీంతో మోహ్సిన్ నఖ్వీ ఈ సమావేశానికి హాజరుకావొద్దని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఆసియా కప్ ట్రోఫీ వివాదం ఏంటి?

2025లో జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో భారత జట్టు పాకిస్తాన్‌పై విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. అయితే, విజేతగా నిలిచిన టీమిండియా ఆటగాళ్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్ అయిన మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించారు. దీనికి ప్రధాన కారణం, సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత, పాక్ మధ్య ఉన్న రాజకీయ, క్రీడా సంబంధాలే కారణం.

భారత జట్టు నిరాకరించడంతో, నఖ్వీ ట్రోఫీని వేదికపైనే ఉంచకుండా తనతో పాటు దుబాయ్‌లోని ఏసీసీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ట్రోఫీని వెంటనే తమకు అప్పగించాలని బీసీసీఐ.. ఏసీసీకి అధికారికంగా లేఖ రాసింది.

ఇవి కూడా చదవండి

నఖ్వీ మొండి పట్టుదల..

అయితే, నఖ్వీ మాత్రం తమ ప్రతినిధి ద్వారానే భారత జట్టు ట్రోఫీని తన కార్యాలయం నుంచి తీసుకోవాలని పట్టుబడుతున్నారు. నవంబర్ 10న దుబాయ్‌లో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి ట్రోఫీని అందిస్తామని కూడా ఆయన ప్రతిపాదించారు. కానీ బీసీసీఐ దాన్ని తిరస్కరించింది. ట్రోఫీ ఇప్పటికీ దుబాయ్‌లోని ఏసీసీ ప్రధాన కార్యాలయంలో లాక్ చేసి ఉన్నట్లు సమాచారం.

ఐసీసీ సమావేశానికి నఖ్వీ డుమ్మా?

దుబాయ్‌లో అంతర్జాతీయ క్రికెట్ మండలి ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం ప్రారంభమైంది. ఆసియా కప్ ట్రోఫీ వివాదంపై బీసీసీఐ ఈ సమావేశంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయనుండటంతో, నఖ్వీ హాజరుపై సందేహాలు నెలకొన్నాయి.

పాకిస్తాన్‌లో ఉన్న “దేశీయ రాజకీయ సమస్యల” కారణంగా మోహ్సిన్ నఖ్వీ సమావేశానికి హాజరు కాకపోవచ్చని పీసీబీ వర్గాలు తెలిపినట్లు సమాచారం. ఒకవేళ నఖ్వీ హాజరు కాకపోతే, పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుమైర్ సయ్యద్ బోర్డు సమావేశంలో పాకిస్తాన్ తరపున పాల్గొనే అవకాశం ఉంది.

మరోవైపు నఖ్వీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొనే అవకాశం కూడా ఉందని వార్తలు వస్తున్నాయి.

ఐసీసీలో బీసీసీఐ దూకుడు..

మోహ్సిన్ నఖ్వీ ట్రోఫీని అప్పగించడంలో జాప్యం చేయడాన్ని బీసీసీఐ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ వ్యవహారం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని భావిస్తున్న బీసీసీఐ, ఐసీసీ ప్లాట్‌ఫామ్‌పై ఈ సమస్యను బలంగా లేవనెత్తడానికి సిద్ధమైంది. బీసీసీఐ ప్రతినిధులు ఇప్పటికే నఖ్వీకి ట్రోఫీని త్వరగా అప్పగించాలని, లేనిపక్షంలో ఐసీసీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

ఏసీసీ అధ్యక్షుడిగా నఖ్వీ వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేసి, అవసరమైతే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పదవి నుంచి ఆయన్ను తొలగించాలని కూడా బీసీసీఐ డిమాండ్ చేయవచ్చని తెలుస్తోంది. టోర్నమెంట్ ముగిసినా ట్రోఫీని అందించకుండా జాప్యం చేయడం సరైన పద్ధతి కాదని, విజేతగా భారత్‌కు ట్రోఫీ దక్కడం ఖాయమని బీసీసీఐ గట్టిగా చెబుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..