
PCB Chairman Mohsin Naqvi India Visit: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2026) ముగింపు దశకు చేరుకున్న వేళ క్రికెట్ ప్రపంచంలో ఒక ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా మే 30, 31 తేదీల్లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలక బోర్డు సమావేశాలు జరగనున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా తొలుత దోహాలో జరగాల్సిన ఈ సమావేశాలను ఐసీసీ అహ్మదాబాద్‌కు మార్చింది. ఐసీసీ నిబంధనల ప్రకారం సభ్య దేశాల ప్రతినిధులందరికీ ఆహ్వానాలు వెళ్లాయి. ఇందులో భాగంగానే పీసీబీ ఛైర్మన్, ప్రస్తుత పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీకి కూడా భారత్ రావాల్సిందిగా పిలుపు అందింది.
ఐసీసీ సమావేశాలతో పాటు నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2026 మేగా ఫైనల్‌ను వీక్షించేందుకు కూడా నఖ్వీకి ఆహ్వానం అందినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది బీసీసీఐ వ్యక్తిగతంగా పంపిన ఆహ్వానం కాకపోయినప్పటికీ, భారత్-పాక్ మధ్య ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన రాక పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే, ఆయన భారత్ పర్యటనకు వస్తారా లేదా అనేది పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉందని అక్కడి మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి.
మొహ్సిన్ నఖ్వీ భారత్ రాకపై వార్తలు రాగానే, గతేడాది జరిగిన ఆసియా కప్ వివాదాన్ని అభిమానులు మళ్లీ తెరపైకి తెచ్చారు. ఆసియా కప్ 2025 టోర్నీ సమయంలో జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి కారణంగా భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి నిరాకరించారు. ఆ తర్వాత ఫైనల్ గెలిచిన భారత్ ప్రెజెంటేషన్ వేడుకల్లో పీసీబీ ఛైర్మన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని అందుకోవడానికి ఇష్టపడలేదని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
ఆ సమయంలో తీవ్ర అసంతృప్తికి లోనైన నఖ్వీ, ట్రోఫీని, మెడల్స్‌ను తీసుకుని మైదానాన్ని వీడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆ ప్రతిష్టాత్మక ఆసియా కప్ ట్రోఫీ పీసీబీ ఆదేశాల మేరకు దుబాయ్‌లోని ఒక లాకర్‌లో బంధించి ఉంచినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై బీసీసీఐ ఐసీసీకి ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు.
ఈ నేపథ్యంలో నఖ్వీ భారత్ పర్యటన వార్తలపై భారత క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో గట్టిగా స్పందిస్తున్నారు. “నఖ్వీ గారూ.. భారత్‌కు వస్తే కరచాలనాలు వద్దు కానీ, మా ఆసియా కప్ ట్రోఫీని మాత్రం మాతో పాటే తీసుకురండి” అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. “భారత్ రావాలనుకుంటే ఒట్టి చేతులతో కాదు, ఆసియా కప్‌తో పాటు ఆటగాళ్లకు ఇవ్వాల్సిన మెడల్స్ కూడా వెంట పెట్టుకుని రావాలి” అని మరికొందరు హెచ్చరిస్తున్నారు.
రాజకీయంగా, క్రికెట్ పరంగా భారత్-పాక్ మధ్య సంబంధాలు క్షీణించిన తరుణంలో మొహ్సిన్ నఖ్వీ అహ్మదాబాద్‌కు రావడం అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. క్రీడా స్ఫూర్తిని పక్కనబెట్టి ట్రోఫీని లాకర్‌లో దాచిన పాక్ బోర్డుకు, భారత అభిమానులు సోషల్ మీడియా వేదికగా సరైన సమాధానమే ఇస్తున్నారు. మరి పాక్ ప్రధాని ఈ పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో వేచి చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..