
SRH vs PBKS : ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఆరెంజ్ ఆర్మీ 33 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో హైదరాబాద్ గడ్డపై పంజాబ్ కింగ్స్ వరుసగా 9వ ఓటమిని చవిచూసింది. అయితే, మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. తన పేరును ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ప్రకటించగానే సాక్షాత్తూ ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆశ్చర్యపోయారు.
కమిన్స్ ఎందుకు షాకయ్యారు?
సాధారణంగా ఎక్కువ పరుగులు చేసిన వారికో లేదా ఎక్కువ వికెట్లు తీసిన వారికో ఈ అవార్డు దక్కుతుంది. ఈ మ్యాచ్‌లో హెన్రిక్ క్లాసెన్ అద్భుతంగా ఆడి టాప్ స్కోరర్‌గా నిలిచారు. యువ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి కేవలం 13 బంతుల్లో 29 పరుగులు చేయడమే కాకుండా, బౌలింగ్‌లోనూ కీలకమైన ప్రభసిమ్రన్ సింగ్ వికెట్ తీసి, ఒక క్యాచ్ కూడా పట్టారు. వీరందరినీ కాదని తనను అవార్డుకు ఎంపిక చేయడంపై కమిన్స్ సరదాగా స్పందిస్తూ.. “నాకు ఈ అవార్డు ఎలా వచ్చిందో తెలియదు, కానీ అందుకున్నందుకు సంతోషంగా ఉంది” అని వ్యాఖ్యానించారు.
అసలు కమిన్స్‌కే ఎందుకు ఇచ్చారు?
నిశితంగా గమనిస్తే కమిన్స్ ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు. బౌలింగ్‌లో 4 ఓవర్లలో 34 పరుగులిచ్చి 2 ముఖ్యమైన వికెట్లు తీశారు. ముఖ్యంగా మంచి ఫామ్‌లో ఉన్న ప్రియాన్ష్ ఆర్యను, ప్రమాదకరంగా మారుతున్న సూర్యాన్ష్ షెడ్గేను అవుట్ చేసి పంజాబ్‌ను దెబ్బకొట్టారు. కేవలం బౌలింగ్‌లోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ మెరుపులు మెరిపించారు. ప్రభసిమ్రన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్ వంటి దిగ్గజ బ్యాటర్ల క్యాచ్‌లను అద్భుతంగా అందుకున్నారు. ఆల్ రౌండ్ పెర్ఫార్మెన్స్ కారణంగానే నిర్వాహకులు ఆయన్ను హీరోగా ప్రకటించారు.
ఎస్ఆర్‌హెచ్ సరికొత్త రికార్డు
ఐపీఎల్ 2026లో ఎస్ఆర్‌హెచ్ ఆడిన 10 మ్యాచ్‌లలో ఇది 7వ విజయం. విశేషమేమిటంటే, ఈ ఏడు విజయాల్లోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు ఏడుగురు వేర్వేరు ఆటగాళ్లకు దక్కాయి. మొదటి విజయంలో నితీష్ కుమార్ రెడ్డి, రెండో గెలుపులో ప్రఫుల్ హింగే, మూడో దాంట్లో ఇషాన్ మలింగ హీరోలుగా నిలిచారు. నాలుగో విజయంలో అభిషేక్ శర్మ, ఐదో దాంట్లో ఇషాన్ కిషన్, ఆరో గెలుపులో హెన్రిక్ క్లాసెన్ అవార్డులు అందుకోగా.. తాజా 7వ విజయానికి గానూ ప్యాట్ కమిన్స్ ఎన్నికయ్యారు. ఇది ఎస్ఆర్‌హెచ్ టీమ్ వర్క్‌కు నిదర్శనం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..