Pakistan: బిర్యానీ వివాదానికి తెరలేపిన పాకిస్తాన్..! వాళ్ల కోసం 27 లక్షలు ఖర్చు చేసిందట..
Pakistan: న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ఇటీవల పాకిస్థాన్ పర్యటనకు వెళ్లింది. అక్కడ వన్డే, టి 20 సిరీస్ ఆడవలసి ఉంది. కానీ భద్రతా కారణాలతో పర్యటన రద్దు చేసుకుంది.
Pakistan: న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ఇటీవల పాకిస్థాన్ పర్యటనకు వెళ్లింది. అక్కడ వన్డే, టి 20 సిరీస్ ఆడవలసి ఉంది. కానీ భద్రతా కారణాలతో పర్యటన రద్దు చేసుకుంది. ఈ విషయం పెద్ద వివాదానికి కారణమైంది. న్యూజిలాండ్ మోసం చేసినట్లు పాకిస్థాన్ ఆరోపిస్తోంది. కానీ ఇప్పుడు మరో విషయం తెరమీదకు వచ్చింది. మీడియా నివేదికల ప్రకారం న్యూజిలాండ్ జట్టు ఎనిమిది రోజుల పాటు పాకిస్తాన్‌లో ఉంది. అప్పుడు బిర్యానీ బిల్లు రూ.27 లక్షలు అయినట్లు పాకిస్తాన్ ఆరోపిస్తుంది.
న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్ పర్యటనలో భాగంగా ఇస్లామాబాద్‌లోని ఒక హోటల్‌లో బస చేసింది. ఆటగాళ్ల భద్రత కోసం ఇస్లామాబాద్ క్యాపిటల్ టెరిటరీ పోలీసులను ఇక్కడ మోహరించారు. దీని కింద 500 మంది పోలీసులు హోటల్‌లో భద్రతా విధులు నిర్వహించారు. ఇందులో ఐదుగురు ఎస్పీలు కొంతమంది ఇతర అధికారులు ఉన్నారు. ఈ పోలీసుల భోజనం ఖర్చు రూ.27 లక్షలు అయినట్లు హోటల్ నిర్వాహకులు తెలిపారు. సెక్యూరిటీగా మోహరించిన పోలీసులకు రోజుకు రెండుసార్లు భోజనం అందించాలని అందులో భాగంగా బిర్యానీ కూడా పెట్టామని వారు తెలిపారు. బిల్లు ఆమోదం కోసం ఆర్థిక శాఖకు పంపినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
అయితే ఈ బిల్లు నిలిపివేశారు. ఇది ఇంకా పాస్ కాలేదు. అంతేకాదు కివీస్ ఆటగాళ్లను రక్షించడానికి బోర్డర్ కాన్స్టాబ్యులరీ సిబ్బందిని కూడా నియమించారు. వారి భోజన బిల్లు ఇంకా రాలేదు. అవి విడిగా వస్తాయి.18 సంవత్సరాల తర్వాత న్యూజిలాండ్ జట్టు పాకిస్థాన్ పర్యటనకు వెళ్లింది. జట్టులో కీలక ఆటగాళ్లు లేరు. అందరు కొత్తవారే. కానీ క్వారంటైన్, ప్రాక్టీస్ తర్వాత మ్యాచ్ జరగాల్సిన రోజు పర్యటన రద్దు చేశారు. తమకు బెదిరింపులు వచ్చాయని న్యూజిలాండ్ ఆరోపించింది. పర్యటన రద్దుపై పాకిస్థాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కివీ ఆటగాళ్లకు ఎలాంటి బెదిరింపులు వచ్చాయో కూడా చెప్పలేదని బోర్డు తెలిపింది.