21 ఫోర్లతో ధోని శిష్యుడు తుఫాన్ ఇన్నింగ్స్.. కట్ చేస్తే.. రోహిత్‌తో కీలక భాగస్వామ్యం.. చివరికి..

సాధారణంగా మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని ఓ బ్యాటర్‌పై నమ్మకం ఉంచాడంటే.. అతడు అద్భుతాలు చేయడం పక్కా. ఇప్పుడు ఇదే సీన్ రిపీట్ అయింది.

21 ఫోర్లతో ధోని శిష్యుడు తుఫాన్ ఇన్నింగ్స్.. కట్ చేస్తే.. రోహిత్‌తో కీలక భాగస్వామ్యం.. చివరికి..
Dhoni

Updated on: Dec 28, 2022 | 7:00 AM

సాధారణంగా మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని ఓ బ్యాటర్‌పై నమ్మకం ఉంచాడంటే.. అతడు అద్భుతాలు చేయడం పక్కా. ఇప్పుడు ఇదే సీన్ రిపీట్ అయింది. ఐపీఎల్-2023 మినీ వేలంలో నాలుగుసార్లు విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్.. ఓ యువ ఆటగాడిని కొనుగోలు చేసింది. అతడు వరుసగా రెండో సెంచరీ చేసి అదరగొట్టాడు. ఈ ఆటగాడు అండర్-19 టీమిండియా ప్రపంచకప్ స్క్వాడ్‌లో కూడా కీలక సభ్యుడు. ఇక అతడెవరో కాదు నిశాంత్ సింధు. ఈ హర్యానా బ్యాట్స్‌మెన్ రంజీ ట్రోఫీలోని గ్రూప్-ఎ మ్యాచ్‌లో ఒడిశాపై శతకొట్టాడు.

సింధు రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి హర్యానా 5 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. సింధు 209 బంతుల్లో 21 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 142 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ప్రస్తుతం అతడికి తోడుగా జయంత్ యాదవ్(28) క్రీజులో ఉన్నాడు. ఇదిలా ఉంటే.. నిశాంత్ సింధును చెన్నై సూపర్ కింగ్స్ రూ. 60 లక్షలకు మినీ వేలంలో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

మరోవైపు ఈ మ్యాచ్‌లో ఒడిశా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ తరుణంలోనే హర్యానా జట్టు టాప్ ఆర్డర్‌ను తక్కువ పరుగులకే ఒడిశా బౌలర్లు పెవిలియన్‌కు పంపించారు. అయితే ఆ తర్వాత సెకండ్ డౌన్‌లో దిగిన నిశాంత్ సింధు(142), ఆ జట్టు వికెట్ కీపర్ రోహిత్ పర్మోద్ శర్మ(55)తో కలిసి ఐదో వికెట్‌కు 155 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రోహిత్ అర్ధ సెంచరీ చేసి.. 246 పరుగుల వద్ద తన వికెట్‌ను కోల్పోయాడు.

గత మ్యాచ్‌లోనూ సింధు సెంచరీ..

ప్రస్తుత రంజీ ట్రోఫీ సీజన్‌లో బరోడాతో తొలి మ్యాచ్ ఆడింది హర్యానా. ఈ మ్యాచ్‌లో సింధు అద్భుత సెంచరీతో అదరగొట్టాడు. 100 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు, రెండు సిక్సర్లతో 110 పరుగులు చేశాడు. అలాగే బంతితో మూడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. అయితే ఈ మ్యాచ్ చివరికి డ్రాగా ముగిసింది. కాగా, ఈ ఏడాది ఆరంభంలో యష్‌ ధుల్‌ సారథ్యంలో భారత్‌ ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచిన విషయం విదితమే. ఈ జట్టులో సింధు కీలక సభ్యుడు.