Mumbai Indians : హర్మన్‌ప్రీత్ హంగామా మొదలైంది.. కొత్త జెర్సీలో కెప్టెన్ స్వ్యాగ్ అదిరిపోయిందిగా!
Mumbai Indians : ముంబై ఇండియన్స్ అంటేనే ఒక బ్రాండ్. ఐపీఎల్‌లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో కూడా అదే దూకుడును ప్రదర్శిస్తోంది. వచ్చే వారం (జనవరి 9) నుంచి ప్రారంభం కానున్న డబ్ల్యూపీఎల్ 2026 కోసం ముంబై ఇండియన్స్ తమ సరికొత్త జెర్సీని విడుదల చేసింది.

Mumbai Indians : ముంబై ఇండియన్స్ అంటేనే ఒక బ్రాండ్. ఐపీఎల్‌లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో కూడా అదే దూకుడును ప్రదర్శిస్తోంది. వచ్చే వారం (జనవరి 9) నుంచి ప్రారంభం కానున్న డబ్ల్యూపీఎల్ 2026 కోసం ముంబై ఇండియన్స్ తమ సరికొత్త జెర్సీని విడుదల చేసింది. ఈసారి జెర్సీలో ముంబై నగర వేగాన్ని, సముద్రపు అలల శక్తిని ప్రతిబింబించేలా ప్రత్యేక డిజైన్‌ను రూపొందించారు. హర్మన్‌ప్రీత్ కౌర్ సేన ఈ కొత్త డ్రెస్‌లో మైదానంలోకి అడుగుపెట్టేందుకు ఉవ్విళ్లూరుతోంది.
ముంబై ఇండియన్స్ తాజాగా విడుదల చేసిన జెర్సీలో ఐకానిక్ బ్లూ అండ్ గోల్డ్ రంగులతో పాటు కోరల్ రంగును కూడా జోడించారు. ఈ డిజైన్‌కు వికెట్ పల్స్ అని పేరు పెట్టారు. ముంబై లోకల్ ట్రైన్ల వేగం, అరేబియా సముద్రపు అలల కదలికల నుంచి ఈ డిజైన్‌ను రూపొందించినట్లు జట్టు యాజమాన్యం తెలిపింది. ఈ జెర్సీ కేవలం ఒక యూనిఫామ్ మాత్రమే కాదని, ముంబై ప్రజల సంకల్పానికి, ముంబై ఇండియన్స్ పోరాట పటిమకు ప్రతీక అని వారు పేర్కొన్నారు.
ఈ సీజన్ కోసం జరిగిన మెగా వేలంలో ముంబై ఇండియన్స్ తమ కోర్ టీమ్‌ను నిలబెట్టుకుంది. జట్టులో అత్యంత ఖరీదైన క్రీడాకారిణిగా ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ నాట్ సీవర్-బ్రంట్ (రూ.3.50 కోట్లు) నిలవగా, న్యూజిలాండ్ స్టార్ అమేలియా కెర్ (రూ.3 కోట్లు) రెండో స్థానంలో ఉంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను రూ.2.50 కోట్లకు రిటైన్ చేసుకున్నారు. వీరితో పాటు సౌతాఫ్రికా స్పీడ్ గన్ షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్ వంటి కీలక ఆటగాళ్లతో ముంబై టీమ్ చాలా బలంగా కనిపిస్తోంది.
𝙋𝙧𝙞𝙙𝙚 𝙤𝙛 𝙈𝙪𝙢𝙗𝙖𝙞 𝙞𝙣 𝙚𝙫𝙚𝙧𝙮 𝙩𝙝𝙧𝙚𝙖𝙙 💙
Presenting our jersey for #TATAWPL 2026 👕💫
Shop now 👉 https://t.co/GJ9oLcYP12#AaliRe #MumbaiIndians pic.twitter.com/HcsqnsrPg6
— Mumbai Indians (@mipaltan) January 2, 2026
డబ్ల్యూపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ అత్యంత విజయవంతమైన జట్టు. 2023లో జరిగిన మొదటి ఎడిషన్‌లోనే ఛాంపియన్‌గా నిలిచిన ముంబై, గత ఏడాది (2025) జరిగిన మూడో ఎడిషన్‌లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి రెండోసారి టైటిల్‌ను గెలుచుకుంది. ఇప్పటివరకు జరిగిన మూడు సీజన్లలో రెండుసార్లు కప్పు కొట్టిన ఏకైక జట్టు ముంబై మాత్రమే. ఇప్పుడు 2026 సీజన్‌లో కూడా టైటిల్ గెలిచి హ్యాట్రిక్ సాధించాలని టీమ్ ప్లాన్ చేస్తోంది.
డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ జనవరి 9న నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఈ టోర్నమెంట్ మొత్తం రెండు వేదికల్లో (నవీ ముంబై, వడోదర) జరగనుంది. ఫిబ్రవరి 5న వడోదర వేదికగా గ్రాండ్ ఫినాలే నిర్వహించనున్నారు. హర్మన్‌ప్రీత్ నాయకత్వంలోని ఈ జట్టు తన హోమ్ గ్రౌండ్‌లో సిరీస్‌ను ఘనంగా ప్రారంభించాలని భావిస్తోంది.
