
Mumbai Indians : ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఆటతీరు ఆశించిన స్థాయిలో లేకపోయినా, ఆ జట్టు రికార్డుల వేటలో మాత్రం దూసుకుపోతోంది. మైదానంలో వరుస ఓటములతో సతమతమవుతున్న హార్దిక్ సేన, గణాంకాల్లో మాత్రం ప్రపంచ క్రికెట్లోనే అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. టీ20 క్రికెట్ చరిత్రలో మరే జట్టుకు సాధ్యం కాని రీతిలో 50 వేల పరుగుల మైలురాయిని దాటి ముంబై ఇండియన్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఈ భారీ ఘనతను అందుకుంది. తన ఇన్నింగ్స్‌లో 114వ పరుగును పూర్తి చేసిన వెంటనే టీ20 ఫార్మాట్‌లో 50,000 పరుగులు పూర్తి చేసిన ప్రపంచంలోనే మొదటి జట్టుగా ముంబై అవతరించింది. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ మొత్తం 308 టీ20 మ్యాచ్‌లు ఆడి ఈ మైలురాయిని చేరుకుంది. జట్టు కష్టకాలంలో ఉన్నప్పటికీ, బ్యాటర్ల సమిష్టి కృషితో ఈ భారీ స్కోర్ల రికార్డు సాధ్యమైంది.
మిగిలిన జట్ల పరిస్థితి ఏంటి?
ఈ జాబితాలో ముంబై తర్వాత రెండో స్థానంలో ఇంగ్లాండ్‌కు చెందిన దేశవాళీ జట్టు సమర్‌సెట్ ఉంది. ఈ జట్టు ఇప్పటివరకు 48,244 పరుగులు చేసింది. ఇక ఐపీఎల్ జట్ల విషయానికి వస్తే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మూడో స్థానంలో నిలిచింది. ఆర్‌సీబీ ఇప్పటివరకు 295 మ్యాచ్‌ల్లో 47,304 పరుగులు సాధించింది. ముంబైకి అత్యంత ప్రధాన ప్రత్యర్థి అయిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) 286 మ్యాచ్‌ల్లో 46,598 పరుగులతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
ఓటముల్లోనూ ఊరట
ప్రస్తుత సీజన్‌లో ముంబై ఇండియన్స్ పరిస్థితి ఏమీ ఆశాజనకంగా లేదు. చెన్నైతో జరిగిన తాజా మ్యాచ్‌లో కూడా 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ సీజన్‌లో ఆడిన 9 మ్యాచ్‌ల్లో ముంబైకి ఇది 7వ ఓటమి. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో జట్టు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ 50 వేల పరుగుల రికార్డు అభిమానులకు కాస్త ఊరటనిస్తోంది. ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించినా, గణాంకాల పరంగా తాము ఎప్పుడూ తోపులమేనని ముంబై నిరూపించుకుంది.
ముంబై ఇండియన్స్ ఈ స్థాయికి చేరుకోవడంలో రోహిత్ శర్మ, కీరన్ పొలార్డ్, సూర్యకుమార్ యాదవ్ వంటి దిగ్గజ బ్యాటర్ల పాత్ర ఎంతో ఉంది. ప్రారంభం నుంచి నిలకడగా భారీ స్కోర్లు సాధిస్తూ రావడం వల్లే ఈ రికార్డు సాధ్యమైంది. సగటున ప్రతి మ్యాచ్‌లోనూ ముంబై భారీ పరుగులు పిండుకోవడంలో ముందుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో టీ20 లీగ్ జట్ల కంటే ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ విభాగం ఎంత బలంగా ఉందో ఈ 50 వేల పరుగుల రికార్డు స్పష్టం చేస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..