AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LSG : ఈసారి ఐపీఎల్‎లోకి సరికొత్తగా రాబోతున్న లక్నో సూపర్ జెయింట్స్.. ప్రత్యర్థులకు దబిడిదిబిడే

LSG : ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందే లక్నో సూపర్ జెయింట్స్ (LSG) భారీ మార్పుకు శ్రీకారం చుట్టింది. తమ జట్టు అదృష్టాన్ని మార్చుకోవడమే లక్ష్యంగా సరికొత్త లోగోను రిలీజ్ చేసింది. ఈ కొత్త లోగోలో ఆధ్యాత్మికత, రాజసం, శక్తిని మేళవించడం విశేషం.

LSG : ఈసారి ఐపీఎల్‎లోకి సరికొత్తగా రాబోతున్న లక్నో సూపర్ జెయింట్స్.. ప్రత్యర్థులకు దబిడిదిబిడే
Lsg
Rakesh
|

Updated on: Feb 24, 2026 | 7:24 PM

Share

LSG : ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందే లక్నో సూపర్ జెయింట్స్ (LSG) భారీ మార్పుకు శ్రీకారం చుట్టింది. తమ జట్టు అదృష్టాన్ని మార్చుకోవడమే లక్ష్యంగా సరికొత్త లోగోను రిలీజ్ చేసింది. ఈ కొత్త లోగోలో ఆధ్యాత్మికత, రాజసం, శక్తిని మేళవించడం విశేషం. ముఖ్యంగా విఘ్నేశ్వరుడి ఆశీస్సులు తమ జట్టుకు ఉండాలని కోరుకుంటూ, సాక్షాత్తూ వినాయకుడి ప్రతిరూపమైన ఏనుగును లోగోలో అంతర్భాగం చేసింది. లక్నో, ఉత్తరప్రదేశ్ సంస్కృతికి అద్దం పట్టేలా మూడు శక్తివంతమైన చిహ్నాలను కలిపి ఈ కొత్త లోగోను రూపొందించారు.

పాత లోగోలో కేవలం రెక్కల మధ్య బ్యాట్, బాల్ ఉండగా.. ఇప్పుడు వాటి స్థానంలో మరింత అర్థవంతమైన గుర్తులను చేర్చారు. లోగోకు ఇరువైపులా ఉన్న రెక్కలు పక్షిరాజు గరుత్మంతుడికి ప్రతీక. ఇది జట్టు ఆకాశమే హద్దుగా ఎదగాలని సూచిస్తుంది. లోగో మధ్యలో ఉన్న కిరీటం రాజసం, గర్వానికి చిహ్నం. ఇక లోగో మధ్యలో కొలువుదీరిన ఏనుగు ముఖం సాక్షాత్తూ వినాయకుడి ఉనికిని, అలాగే ఆ ప్రాంతం తిరుగులేని శక్తిని చాటిచెబుతోంది. విఘ్నహర్త అయిన గణపతి జట్టులో ఉండటం శుభసూచకమని మేనేజ్మెంట్ భావిస్తోంది.

ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ వైస్ ఛైర్మన్ శాశ్వత్ గోయెంకా ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ కొత్త లోగో లక్నో సూపర్ జెయింట్స్ అభిమానుల మనోభావాలకు ప్రతిరూపమని తెలిపారు. మొదటి రోజు నుంచి జట్టుకు అండగా ఉన్న ఫ్యాన్స్ గుర్తింపుగా దీనిని రూపొందించామని చెప్పారు. గరుడ రెక్కలు జట్టును కొత్త ఎత్తులకు తీసుకెళ్తాయని, కిరీటం జట్టు పట్టుదలను సూచిస్తుందని, ఏనుగు శక్తికి నిదర్శనమని ఆయన వివరించారు. ఇకపై సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి టీమ్ జెర్సీ, మర్చండైజ్ వరకు అన్నింటిపై ఈ కొత్త లోగోనే మెరవనుంది.

లక్నో సూపర్ జెయింట్స్ ప్రయాణం ఐపీఎల్‌లో 2022లో ప్రారంభమైంది. మొదటి రెండేళ్లు కెఎల్ రాహుల్ సారథ్యంలో వరుసగా ప్లేఆఫ్స్‌కు చేరుకున్నా, ఎలిమినేటర్ దశలోనే వెనుదిరగాల్సి వచ్చింది. 2022లో ఆర్సీబీ చేతిలో, 2023లో ముంబై చేతిలో ఓడిపోయింది. అయితే గత రెండు సీజన్లు (2024, 2025) జట్టుకు ఏమాత్రం కలిసి రాలేదు. 2024లో ఏడో స్థానంతో సరిపెట్టుకోగా.. 2025లో రిషబ్ పంత్ కెప్టెన్‌గా వచ్చినా అదృష్టం మారలేదు. ఆ ఏడాది కూడా ఏడో స్థానంలోనే నిలిచింది. అందుకే ఈసారి విఘ్నహర్త అండతో ఐపీఎల్ 2026లో కప్పు కొట్టాలని లక్నో గట్టి పట్టుదలతో ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us