గేల్, మాక్స్వెల్ కాదు భయ్యో.. ప్రపంచ క్రికెట్‌లో భారీ సిక్స్ బాదిన బ్యాటర్ ఎవరో తెలుసా? లిస్ట్‌లో మనోళ్లు కూడా
Cricket Records: క్రికెట్ చరిత్రలో ఎన్నో అద్భుతమైన రికార్డులు, సంఘటనలు నమోదయ్యాయి. ఆధునిక క్రికెట్‌లో భారీ సిక్సర్లు కొట్టడం సాధారణమైపోయింది. కానీ, 19వ శతాబ్దంలో, పిచ్‌లు సరిగా లేని సమయంలో, బ్యాటింగ్ పరికరాలు అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో, ఒక బ్యాట్స్‌మెన్ కొట్టిన సిక్స్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ పెవిలియన్‌ను దాటి పోవడం అనేది కనీవినీ ఎరుగని రికార్డు.

Cricket Records: క్రికెట్‌లో భారీ సిక్స్ కొట్టిన రికార్డు క్రిస్ గేల్ పేరిట లేదా మహేంద్ర సింగ్ ధోని, గ్లెన్ మాక్స్వెల్ పేరిట లేదు. 100 సంవత్సరాల క్రితం, క్రికెట్‌లో అత్యంత పొడవైన సిక్స్ నమోదైందని మీకు తెలుసా? అంటే ఈ భారీ సిక్స్ ప్రపంచ రికార్డు వందేళ్ల క్రితమే రికార్డుల పుస్తకాల్లో నమోదైంది. అయితే, ఇప్పటివరకు ఎవరూ ఈ రికార్డుకు దగ్గరగా కూడా రాలేకపోయారు.
ప్రపంచ క్రికెట్‌లో అత్యంత పొడవైన సిక్స్ కొట్టిన ప్లేయర్..
క్రికెట్ చరిత్రలోనే అతి పొడవైన సిక్స్‌ను 19వ శతాబ్దంలో ఆల్బర్ట్ ట్రాట్ కొట్టాడు. ఆల్బర్ట్ ట్రాట్ ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా రెండింటికీ క్రికెట్ ఆడాడు. 19వ శతాబ్దంలో ఆల్బర్ట్ ఒక సిక్స్ కొట్టి లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ పెవిలియన్ దాటించాడు. ఈ సిక్స్ పొడవు 164 మీటర్లు. క్రికెట్ చరిత్రలో ఇదే అతి పొడవైన సిక్స్. ఇంగ్లాండ్‌కు చెందిన మేరీల్‌బోన్ క్రికెట్ క్లబ్ తరపున ఆడుతున్నప్పుడు ఆస్ట్రేలియాపై ఆల్బర్ట్ ఈ షాట్ కొట్టాడు. బంతి బౌండరీ దాటి పోయింది.
164 మీటర్ల సిక్స్ తో అరుదైన ఫీట్..
ఆల్బర్ట్ ట్రాట్ 19వ శతాబ్దపు అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా నిలిచాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా రెండు దేశాల తరపున క్రికెట్ ఆడాడు. చరిత్రలో అతి పొడవైన ‘సిక్స్’ ఆల్బర్ట్ పేరుతో నమోదైంది. అతను 164 మీటర్ల పొడవైన సిక్స్ కొట్టే ఘనతను సాధించాడు. 19వ శతాబ్దంలో, బౌలర్లు ఆల్బర్ట్ ట్రాట్ పేరుతో భయపడేవారు. ఇది మాత్రమే కాదు, బౌలింగ్‌లో కూడా అతను బ్యాట్స్‌మెన్‌కు భయంకరంగా మారాడు.
అఫ్రిది పేరుతో..
పాకిస్తాన్ మాజీ తుఫాన్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది తన కెరీర్ మొత్తంలో ఎన్నో తుఫాన్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. 2013లో దక్షిణాఫ్రికాపై షాహిద్ అఫ్రిది 158 మీటర్ల భారీ సిక్స్ కొట్టాడు.
ఈ జాబితాలో ఇద్దరు భారతీయుల పేర్లు..
పొడవైన సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నారు. యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోని ఈ లిస్టులో ఉన్నారు. యువరాజ్ సింగ్ 119 మీటర్ల దూరం సిక్స్ కొట్టాడు. టీ20ల్లో 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన రికార్డు కూడా యువీ పేరిట ఉంది. కాగా, ఎంఎస్ ధోని 112 మీటర్లలో సిక్స్ కొట్టాడు. 2007 టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ప్లేయర్ యువరాజ్ సింగ్ ఆస్ట్రేలియాపై 70 పరుగుల ఇన్నింగ్స్‌లో బ్రెట్ లీ బంతికి 119 మీటర్ల పొడవైన సిక్స్ కొట్టాడు. ఈ సిక్స్ కూడా అద్భుతంగా ఉంది. ఎందుకంటే, ఈ సిక్స్ కోసం యూవీ తన మణికట్టును మాత్రమే ఉపయోగించాడు.
మహేంద్ర సింగ్ ధోని..
2011-12లో కామన్ వెల్త్ బ్యాంక్ సిరీస్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ధోని ఈ లక్ష్యాన్ని చేధించాడు. ఈ సిక్స్ లాంగ్ ఆఫ్ దిశలో బాదాడు. అది ఆ స్టేడియంలో చాలా పెద్ద బౌండరీ. కానీ, ధోని బాదిన ఈ సిక్స్ ఆ బౌండరీని సులభంగా దాటి 112 మీటర్ల దూరాన్ని అధిగమించింది.
ఆల్బర్ట్ ట్రాట్ కెరీర్ విశేషాలు..
- అరంగేట్రం రికార్డు: ఆల్బర్ట్ ట్రాట్ 1894-95లో ఆస్ట్రేలియా తరపున ఇంగ్లాండ్‌తో జరిగిన తన తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే 8 వికెట్లు తీసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అతని అరంగేట్రంలో ఎనిమిది వికెట్లు తీసిన ఆటగాడిగా ఇప్పటికీ ఆ రికార్డు అతని పేరు మీదనే ఉంది.
- రెండు దేశాలకు ప్రాతినిధ్యం: ట్రాట్, ఆస్ట్రేలియా తరపున మూడు టెస్టులు, ఆ తర్వాత ఇంగ్లాండ్ తరపున రెండు టెస్టులు ఆడాడు. రెండు వేర్వేరు దేశాలకు టెస్ట్ క్రికెట్ ఆడిన కొద్దిమంది క్రికెటర్లలో అతను ఒకరు.
- ఫస్ట్-క్లాస్ క్రికెట్: అతని టెస్ట్ కెరీర్ పెద్దగా లేకపోయినప్పటికీ, ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అతను అద్భుతమైన రికార్డులను కలిగి ఉన్నాడు. 375 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 10,000 పరుగులకు పైగా, 1674 వికెట్లు సాధించాడు. 42 పరుగులు ఇచ్చి ఒక ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన ఘనత కూడా అతని పేరు మీద ఉంది.
ఆల్బర్ట్ ట్రాట్ 1914లో 41 సంవత్సరాల వయసులో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. అతని జీవితం విషాదకరంగా ముగిసినప్పటికీ, క్రికెట్ చరిత్రలో అతను నెలకొల్పిన కొన్ని అసాధారణ రికార్డులు, ముఖ్యంగా లార్డ్స్ పెవిలియన్‌ను దాటిన సిక్స్, అతనిని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తాయి. ఆధునిక క్రికెట్‌కు ముందు, ఆట ఇంకా తన బాల్య దశలో ఉన్నప్పుడు, ట్రాట్ వంటి ఆటగాళ్లు చూపిన ప్రతిభ, సాహసం క్రికెట్ అభిమానులకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








