Lalit Modi: ఇండియాకు తిరిగొస్తున్న ఐపీఎల్ సృష్టికర్త..! మరి కేసుల సంగతేంటి అంటే..?
16 ఏళ్ల తర్వాత ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీ భారత్‌కు తిరిగి రానున్నారు. 2009 ఐపీఎల్ ఫెమా కేసులో అప్పీలేట్ ట్రిబ్యునల్ నుంచి కీలక ఉపశమనం లభించింది. ఈడీ ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని ట్రిబ్యునల్ పేర్కొంది. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో భారత్‌కు వస్తానని లలిత్ మోడీ ప్రకటించారు.

ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ దాదాపు 16 సంవత్సరాల తర్వాత భారతదేశానికి తిరిగి రానున్నట్లు ప్రకటించారు. 2009 ఐపీఎల్ సౌతాఫ్రికా నిర్వహణకు సంబంధించిన ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (FEMA) కేసులో అప్పీలేట్ ట్రిబ్యునల్ నుంచి కీలక ఉపశమనం లభించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో భారత్‌కు వస్తానని తెలిపారు.
ట్రిబ్యునల్ తీర్పు అనంతరం స్పందించిన లలిత్ మోడీ, 16 ఏళ్ల న్యాయపోరాటానికి చివరికి న్యాయం జరిగిందని పేర్కొన్నారు. తాను మొదటి నుంచి ఐపీఎల్ ప్రయోజనాల కోసమే పనిచేశానని చెబుతూ వచ్చానని, తాజా తీర్పు తన వాదనకు బలం చేకూర్చిందన్నారు. ఈ కేసు ముగియడంతో జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలిపారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాన్ని కూడా మోడీ వెల్లడించారు. అక్టోబర్‌లో తన కుమార్తెకు కుమారుడు జన్మించనున్నాడని, ఆ తర్వాత భారత్‌కు తిరిగి రావాలని యోచిస్తున్నట్లు చెప్పారు.
Lalit Modi (@LalitKModi) posts: “I am really looking forward to returning to India after a long long time. Stay well and stay safe.”
“For clarity. I will continue to live in London and visit India as it’s my country from time to time and to establish my son rightful place in… pic.twitter.com/kaVQPfXbl8
— Press Trust of India (@PTI_News) July 22, 2026
జూలై 16న స్మగ్లర్లు, విదేశీ మారక ద్రవ్య మానిప్యులేటర్ల (ఆస్తి జప్తు) చట్టం (SAFEMA) కింద ఏర్పాటు చేసిన అప్పీలేట్ ట్రిబ్యునల్ కీలక తీర్పు వెలువరించింది. 2009 ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విధించిన పలు జరిమానాలు, నిర్ధారణలను ట్రిబ్యునల్ కొట్టివేసింది. లలిత్ మోడీ ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని నిరూపించే స్పష్టమైన ఆధారాలు లేవని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. ఈ కేసు 2009లో జరిగిన ఐపీఎల్ సీజన్‌కు సంబంధించినది. ఆ సమయంలో లోక్‌సభ ఎన్నికల కారణంగా టోర్నమెంట్‌ను భారతదేశంలో కాకుండా దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. టోర్నమెంట్ నిర్వహణ కోసం విదేశాలకు పంపిన నిధులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి ముందస్తు అనుమతి తీసుకోలేదని ఈడీ ఆరోపించింది.
అయితే, ఈ చెల్లింపులు కరెంట్ అకౌంట్ లావాదేవీల పరిధిలోకి వస్తాయని, క్యాపిటల్ అకౌంట్ లావాదేవీలు కావని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. అందువల్ల ఈడీ ప్రధాన వాదనకు చట్టపరమైన ఆధారం లేదని పేర్కొంది. 2010 నుంచి విదేశాల్లోనే నివసిస్తున్న లలిత్ మోడీపై ఈడీ, బీసీసీఐ, ఆదాయపు పన్ను శాఖలు పలు దర్యాప్తులు చేపట్టాయి. అయితే తాజా ట్రిబ్యునల్ తీర్పుతో ఫెమా కేసులో ఆయనకు ఊరట లభించింది. దీంతో దాదాపు 16 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి రావడానికి మార్గం సుగమమైనట్లు భావిస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
