IPL 2026 Update : కేకేఆర్‌కు బిగ్ షాక్.. హర్షిత్ రాణా స్థానంలో ఎవరికి ఛాన్స్? రేసులో ముగ్గురు స్పీడ్‌స్టర్లు

IPL 2026 Update : కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ పేసర్ హర్షిత్ రాణా గాయంతో ఐపీఎల్ 2026కు దూరమయ్యే ఛాన్స్ ఉంది. అతని స్థానంలో సిమర్‌జీత్ సింగ్, కేఎం ఆసిఫ్ లేదా సందీప్ వారియర్ వచ్చే అవకాశం ఉంది.సిమర్‌జీత్ సింగ్ గతంలో సీఎస్‌కే, సన్‌రైజర్స్ తరపున రాణించారు.

IPL 2026 Update : కేకేఆర్‌కు బిగ్ షాక్.. హర్షిత్ రాణా స్థానంలో ఎవరికి ఛాన్స్? రేసులో ముగ్గురు స్పీడ్‌స్టర్లు
Harshit Rana

Updated on: Mar 19, 2026 | 8:15 AM

IPL 2026 Update : ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ హర్షిత్ రాణా గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తుండటంతో కేకేఆర్ మేనేజ్మెంట్ అప్రమత్తమైంది. అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు ముగ్గురు కీలక బౌలర్లను రంగంలోకి దించి ట్రయల్స్ నిర్వహిస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రధాన బౌలింగ్ అస్త్రం హర్షిత్ రాణా ఐపీఎల్ 2026 నుంచి దాదాపు తప్పుకున్నట్లే కనిపిస్తోంది. టి20 వరల్డ్ కప్ 2026 సన్నాహకాల్లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఆయన గాయపడ్డారు. కేవలం ఒక ఓవర్ వేసిన వెంటనే కుడి మోకాలికి లిగమెంట్ స్ట్రెయిన్ కావడంతో గ్రౌండ్ వీడాల్సి వచ్చింది. దీనికి ఆపరేషన్ అవసరం కావడంతో ప్రస్తుతం ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. బీసీసీఐ మెడికల్ టీమ్ రిపోర్ట్ ప్రకారం.. ఐపీఎల్ సీజన్ మొత్తానికి లేదా మెజారిటీ మ్యాచ్‌లకు ఆయన అందుబాటులో ఉండటం కష్టమని తేలింది. దీంతో కేకేఆర్ తమ బౌలింగ్ కాంబినేషన్ దెబ్బతినకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయాలను వెతుకుతోంది.

ట్రయల్స్‌లో ముగ్గురు పేసర్లు

హర్షిత్ రాణా స్థానాన్ని భర్తీ చేసేందుకు కేకేఆర్ మేనేజ్మెంట్ ముగ్గురు అనుభవం ఉన్నటువంటి దేశవాళీ పేసర్లను సెలక్ట్ చేసి ట్రయల్స్ కు పిలిచింది. వారిలో సిమర్‌జీత్ సింగ్, కేఎం ఆసిఫ్, సందీప్ వారియర్ ఉన్నారు. సిమర్‌జీత్ సింగ్ గతంలో సీఎస్‌కే, సన్‌రైజర్స్ తరపున రాణించారు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బంతులు విసరగలగడం, పదునైన యార్కర్లు వేయడం అతని స్పెషాలిటీ. ముంబైలో జరిగిన ఫస్ట్ ఫేజ్ ట్రయల్స్‌లో కేకేఆర్ స్కౌటింగ్ హెడ్ బిజూ జార్జ్ సమక్షంలో ఆయన తన టాలెంటును నిరూపించుకున్నారు. ప్రస్తుతానికైతే ఇతనికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.

ఈడెన్ గార్డెన్స్‌లో ఆసిఫ్, సందీప్ సందడి

మరోవైపు కేఎం ఆసిఫ్, సందీప్ వారియర్ బుధవారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన కేకేఆర్ మొదటి ట్రెయినింగ్ సెషన్‌లో పాల్గొన్నారు. 32 ఏళ్ల కేఎం ఆసిఫ్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతమైన ఫామ్‌ను కనబరిచారు. వేగంతో పాటు వేరియేషన్స్ చూపించడంలో ఆయన దిట్ట. ఇక సందీప్ వారియర్ విషయానికి వస్తే, ఆయనకు కేకేఆర్ కొత్తేమీ కాదు. 2019లో ఇదే టీమ్‎తో ఐపీఎల్ అరంగేట్రం చేసి మూడు సీజన్ల పాటు కోల్‌కతా జెర్సీ ధరించారు. గుజరాత్ టైటాన్స్ తరపున కూడా ఆడిన అనుభవం ఉండటంతో మేనేజ్మెంట్ ఆయన వైపు కూడా మొగ్గు చూపే అవకాశం ఉంది.

స్కాట్స్ పర్యవేక్షణలో సెలక్షన్ ప్రక్రియ

ఈ ట్రయల్స్ ను కేకేఆర్ డిప్యూటీ కోచ్ మన్విందర్ బిస్లా, ఇతర కోచింగ్ సిబ్బంది నిశితంగా గమనిస్తున్నారు. హర్షిత్ రాణా లాంటి స్పీడ్ బౌలర్ లేని లోటును ఎవరు తీర్చగలరో చూసి ఒకరిని టీమ్‌లోకి తీసుకుంటారని సమాచారం. ఐపీఎల్ వేలానికి ముందు, తర్వాత జట్టు బాలెన్స్ దెబ్బతినకుండా ఉండాలంటే సమర్థవంతమైన పేసర్ అవసరం. ఈ ముగ్గురిలో ఒకరిని త్వరలోనే అఫీషియల్‌గా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న కేకేఆర్, ఈ ఒక్క మార్పుతో మళ్లీ పటిష్టంగా మారుతుందో లేదో చూడాలి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us