రంజీ ట్రోఫీ 2025లో హీరో.. ఇప్పుడు నెట్ బౌలర్! ఇది అవకాశమా? అవమానమా?
జమ్మూ కశ్మీర్ ఫాస్ట్ బౌలర్ అకిబ్ నబీ రంజీ ట్రోఫీ 2025-26లో 60 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అతనికి భారత టెస్ట్ జట్టులో స్థానం లభిస్తుందని అభిమానులు భావించారు. అయితే, సెలెక్టర్లు ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు అతన్ని ప్రధాన జట్టులోకి తీసుకోకుండా నెట్ బౌలర్‌గా ఎంపిక చేశారు.

ఐపీఎల్ హడావిడి ముగిసింది. ఇక సంప్రదాయ క్రికెట్ సమరానికి తెరలేవనుంది. ఈ నెల 6 నుంచి భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఒక టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత 3 వన్డేల సిరీస్ కూడా ఉంది. ఇప్పటికే టెస్ట్ స్క్వౌడ్, వన్డే టీమ్‌ను సెలెక్టర్లు ప్రకటించారు. ముఖ్యంగా టెస్ట్ టీమ్‌లో రంజీల్లో రాణించిన ఆటగాళ్ల పేర్లు లేవని క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. అలా టెస్ట్ టీమ్‌లో ఉండాలని కోరుకున్న ఆటగాళ్లలో ఒకడు జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఫాస్ట్ బౌలర్ అకిబ్ నబీ. ఈ జమ్మూ బౌలర్ రంజీ సీజన్ 2025-26లో అద్భుత ప్రతిభ కనబర్చాడు.
రంజీ చరిత్రలో తొలి సారి జమ్మూ కశ్మీర్ ట్రోఫీ గెలిచిందంటే అకిబ్ నబీ పాత్ర మరువలేనిది. సూపర్ బౌలింగ్‌తో అందర్ని ఆకట్టుకున్నాడు. కేఎల్ రాహుల్ వంటి టాప్ క్లాస్ బ్యాటర్‌ను కూడా బోల్తా కొట్టించాడు. ఒక్క సీజన్‌లోనే ఏకంగా 7 సార్లు 5 కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా 10 మ్యాచ్‌లు ఆడి 60 వికెట్లు సాధించాడు. ఈ బౌలింగ్ ప్రదర్శన చూసి టీమిండియాకు మరో సూపర్ బౌలర్ దొరికేశాడని అంతా అనుకున్నారు. ఈ ప్రదర్శనతో టీమిండియాలోకి ఎంట్రీ ఖాయం అనుకున్నారు. కానీ నబీకి సెలెక్టర్లు హ్యాండిచ్చారు. ఆఫ్ఘనిస్థాన్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం అతన్ని ఎంపిక చేయలేదు.
కానీ, తాజాగా నబీని నెట్ బౌలర్‌గా ఎంపిక చేశారు. ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేసే టీమిండియా బ్యాటర్లకు నెట్స్‌లో నబీ బౌలింగ్ చేయనున్నాడు. రంజీల్లో అత్యధిక వికెట్లు తీసి, టాప్ బౌలర్‌గా ఉన్న ప్లేయర్‌ను మెయిన్ స్క్వౌడ్‌లోకి ఎంపిక చేయకుండా, నెట్ బౌలర్‌గా ఎంపిక చేసి అవమానిస్తారా అంటూ క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీన్ని అతను ఒక అవకాశంలా తీసుకోవాలని కూడా మరికొంతమంది అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఇది నబీకి అవమానమా? అవకాశమా? అనేది చెప్పలేని పరిస్థితి. నబీతో పాటు మరో ఐదుగురిని కూడా నెట్ బౌలర్లుగా ఎంపిక చేశారు. అయితే ఇటీవలె ముగిసిన ఐపీఎల్ 2026లో నబీ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని రూ.8.4 కోట్ల భారీ ధర పెట్టి తీసుకుంది. కానీ నబీ మాత్రం అంచనాలను అందుకోలేకపోయాడు. 5 మ్యాచ్‌లు ఆడి ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
