
ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పాకిస్థాన్‌పై అజేయ సెంచరీ (100* పరుగులు 111 బంతుల్లో) చేసి, వన్డే క్రికెట్‌లో తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నాడు. ఈ విజయంతో, కోహ్లీ వన్డే క్రికెట్ ఆడిన అన్ని దేశాల్లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు అతను వన్డేలు ఆడిన 10 దేశాలలోనూ శతకాన్ని నమోదు చేశాడు. అవి ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ), వెస్టిండీస్, జింబాబ్వే, చివరకు స్వదేశం భారత్.కోహ్లీ రికార్డు సునామీ! అన్ని దేశాల్లో శతకం
ఈ ఘనతతో విరాట్ కోహ్లీ, సనత్ జయసూర్య, సచిన్ టెండూల్కర్, క్రిస్ గేల్ వంటి దిగ్గజ ఆటగాళ్ల సరసన చేరాడు. 10 లేదా అంతకంటే ఎక్కువ దేశాల్లో వన్డే సెంచరీలు చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. గేల్, కోహ్లీ 10 దేశాల్లో సెంచరీలు సాధించగా, జయసూర్య, టెండూల్కర్ 12 దేశాల్లో వన్డే శతకాలను నమోదు చేశారు. అయితే, ఈ నలుగురిలో విరాట్ కోహ్లీ ప్రత్యేక స్థాయిలో ఉన్నాడు. ఎందుకంటే అతను ఆడిన ప్రతి దేశంలో సెంచరీ చేయగలిగాడు, కానీ మిగిలిన ముగ్గురు తమ కెరీర్‌లో కొన్ని దేశాల్లో శతకాలు చేయలేకపోయారు. సనత్ జింబాబ్వే, కెన్యా, మొరాకోలో వన్డే సెంచరీలు చేయలేకపోగా, సచిన్ ఐర్లాండ్, కెన్యా, కెనడా, వెస్టిండీస్‌లలో సెంచరీలు నమోదు చేయలేకపోయాడు. గేల్ అయితే బంగ్లాదేశ్, ఐర్లాండ్, మలేషియా, పాకిస్తాన్, శ్రీలంకలలో సెంచరీ చేయలేకపోయాడు.
ఇక పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో, టాస్ గెలిచిన పాక్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ బాబర్ అజామ్ (23), కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (46), సౌద్ షకీల్ (62) మంచి శురువును అందించినప్పటికీ, భారత్ బౌలింగ్ ముందు పెద్ద స్కోరు చేయలేక 49.4 ఓవర్లలో 241 పరుగులకే ఆలౌటైంది. 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కి ఓపెనర్ రోహిత్ శర్మ (20) ముందుగానే ఔటైనప్పటికీ, శుభ్‌మాన్ గిల్ (46), కోహ్లీ (100*), శ్రేయస్ అయ్యర్ (67) అద్భుతంగా రాణించడంతో 45 బంతులు మిగిలుండగానే ఆరు వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.
ఈ విజయంతో, విరాట్ కోహ్లీ భారత జట్టు విజయానికి కీలకంగా మారడమే కాకుండా, క్రికెట్ చరిత్రలో మరో అద్భుతమైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అతని అప్రతిహత ఫామ్ భారత జట్టు విజయ యాత్రకు మరింత బలాన్నిస్తుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..