
ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఐపీఎల్ 2025 సీజన్‌ను అద్భుతంగా ముగించిన తర్వాత భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ తన తదుపరి లక్ష్యం 2026 టీ20 ప్రపంచకప్ అని వెల్లడించాడు. గతంలో నవంబర్ 2022లో చివరిసారి జాతీయ టీ20 జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రాహుల్, ఈ సీజన్‌లో తన ఫార్మ్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ సీజన్‌లో అతను 13 మ్యాచ్‌ల్లో 539 పరుగులు చేసి, తన అత్యుత్తమ స్కోరు గుజరాత్ టైటాన్స్‌పై 65 బంతుల్లో 112 నాటౌట్‌గా నమోదయ్యింది. ఇదే ఊపుతో టీ20 ప్రపంచకప్‌కు ముందు జాతీయ జట్టులోకి తిరిగి రావాలని ఆశిస్తున్నాడు.
రాహుల్ మాట్లాడుతూ, “అవును, నేను టీ20 జట్టులోకి తిరిగి రావాలనుకుంటున్నాను. ప్రపంచకప్ నా మనసులో ఉంది. కానీ ప్రస్తుతం నేను నా ఆటను ఆస్వాదిస్తున్నాను. నాకు వైట్-బాల్ ఆట గురించి ఆలోచించే సమయం దొరికింది. నా ప్రదర్శనలతో నేను సంతోషంగా ఉన్నాను,” అని స్కై స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాసర్ హుస్సేన్‌తో అన్నాడు. 33 ఏళ్ల రాహుల్ గతంలో స్ట్రైక్ రేట్ విషయంలో విమర్శల పాలయ్యాడు. కానీ ఇప్పుడు తాను తన ఆటను ఎలా మెరుగుపరిచాడో వివరించాడు. “ఒకప్పుడు, అంటే సుమారు 12-15 నెలల క్రితం, ఆట వేగంగా మారుతుందని గ్రహించాను. ఇప్పుడు మ్యాచ్‌లు గెలవాలంటే ఎక్కువ బౌండరీలు కొట్టే జట్టు ముఖ్యమైంది. బౌండరీలు కొట్టలేని జట్టు ఓడిపోతుంది. వైట్-బాల్ క్రికెట్ అదే దిశగా సాగుతోంది,” అని వివరించాడు.
ఈ మార్పులో భారత మాజీ బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్ పాత్రను కూడా రాహుల్ గుర్తు చేశాడు. “గత రెండు సంవత్సరాలుగా నేను టీ20 జట్టులో లేను. ఇది నాకు ఆ ఫార్మాట్ గురించి ఆలోచించేందుకు సమయం ఇచ్చింది. నేను కూర్చొని పలు విషయాలను విశ్లేషించాను. అభిషేక్ నాయర్‌తో గత 12 నెలల్లో నేను చాలా సమయం గడిపాను. అతను నా ఆలోచనలను మార్చుకోవడంలో, ఆటను మెరుగుపర్చుకోవడంలో కీలక పాత్ర పోషించాడు,” అని రాహుల్ చెప్పాడు.
రాహుల్ 2016లో జింబాబ్వేతో టీ20 అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇప్పటివరకు 72 మ్యాచ్‌లు ఆడి, 2,265 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు, 22 అర్థ శతకాలు ఉన్నాయి. ఈ ఐపీఎల్‌లో దూకుడు ఆటతీరుతో రాహుల్ తనను తాను మళ్లీ నిరూపించుకున్నాడు.
ఇక రాహుల్ ప్రాతినిధ్యం వహించిన ఢిల్లీ క్యాపిటల్స్, ఈ సీజన్‌లో గట్టి పోటీ ఇచ్చింది. ఇటీవల పంజాబ్ కింగ్స్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి 14 మ్యాచ్‌లలో 7 విజయాలతో తమ లీగ్ దశను ముగించింది. ఈ విజయం ఢిల్లీకి మరింత శక్తి కలిగించగా, పంజాబ్ కింగ్స్‌కు మొదటి రెండు స్థానాల్లో నిలిచే అవకాశాలను క్లిష్టతరం చేసింది. ఇప్పుడు PBKS తమ చివరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ముంబై కూడా మొదటి రెండు స్థానాల్లోకి చేరే అవకాశాలను ఆశిస్తోంది. ఇది ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..