
Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026 సీజన్ అనేక సంచలనాలకు వేదికవుతోంది. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ బుడతడి ఆటతీరు చూసి టీమిండియా స్టార్ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ కేఎల్ రాహుల్ సైతం షాక్ అయ్యారు. తాను కలలో కూడా ఊహించని అద్భుతమిది అంటూ సూర్యవంశీ టాలెంట్‌పై రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగబోయే 43వ మ్యాచ్‌కు ముందు కేఎల్ రాహుల్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజస్థాన్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “వైభవ్ సూర్యవంశీ ప్రపంచ క్రికెట్‌లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లో రెండు సెంచరీలు బాదడం అనేది అసాధారణం. నేను ఆ వయసులో ఉన్నప్పుడు కనీసం ఇలాంటి వాటి గురించి కలలో కూడా ఊహించలేదు” అని రాహుల్ కొనియాడారు. వైభవ్ ఇప్పటివరకు ఈ సీజన్‌లో 400 పరుగులు చేయడమే కాకుండా, అత్యధికంగా 37 సిక్సర్లు బాది అందరి దృష్టిని ఆకర్షించాడు.
భారతదేశంలో పుట్టుకొస్తున్న యంగ్ టాలెంట్ గురించి రాహుల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గతంలో మన దగ్గర సిక్సర్లు కొట్టే ప్లేయర్లు లేరని ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ బ్యాటింగ్ చూసి భయపడేవాళ్లమని, కానీ ఇప్పుడు ఐపీఎల్ వల్ల ఆ పరిస్థితి మారిపోయిందని ఆయన అన్నారు. వైభవ్ సూర్యవంశీతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న ఆయుష్ మ్హాత్రే కూడా అద్భుతంగా రాణిస్తున్నాడని రాహుల్ పేర్కొన్నారు. ఈ కుర్రాళ్ళు భయం లేకుండా ఆడుతూ టీ20 క్రికెట్ ఆడే తీరునే మార్చేస్తున్నారని అభినందించారు.
తన వ్యక్తిగత లక్ష్యాల గురించి స్పందిస్తూ రాహుల్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. తనకు వ్యక్తిగత రికార్డుల కంటే ట్రోఫీలు గెలవడమే ముఖ్యమని చెప్పారు. “నాకు పర్సనల్ మైల్‌స్టోన్స్ కంటే ఎంఎస్ ధోనీ గెలిచిన ఐదు ఐపీఎల్ ట్రోఫీల రికార్డును సమం చేయాలని ఉంది. క్రికెట్ అనేది ఒక టీమ్ గేమ్. సక్సెస్‌ఫుల్ టీమ్‌లో భాగం కావడమే నా లక్ష్యం” అని రాహుల్ స్పష్టం చేశారు. కేవలం రన్ మిషన్ లాగా మారడం కాకుండా, ఒక లీడర్‌గా తన జట్టుకు టైటిల్ అందించడమే తన డ్రీమ్ అని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు టాప్ ఫామ్‌లో ఉండటానికి వైభవ్ సూర్యవంశీ వంటి యంగ్ ప్లేయర్ల దూకుడే కారణం. జైపూర్‌లోని తమ హోమ్ గ్రౌండ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనున్న రాజస్థాన్, ఈ మ్యాచ్‌లోనూ వైభవ్ మెరుపులపై ఆశలు పెట్టుకుంది. మరోవైపు ఢిల్లీ జట్టు రాహుల్ కెప్టెన్సీలో రాజస్థాన్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని చూస్తోంది. ఒకవైపు అనుభవం ఉన్న రాహుల్, మరోవైపు ఫ్యూచర్ స్టార్ వైభవ్.. వీరిద్దరి మధ్య జరగబోయే పోరు కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..