
IPL 2026 KKR vs LSG : ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. నేడు ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఈ సీజన్‌లో ఇది 15వ మ్యాచ్. ఇప్పటివరకు బోణీ కొట్టని కేకేఆర్ ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉండగా, పటిష్టమైన లక్నో తన జోరును కొనసాగించాలని చూస్తోంది. ఐపీఎల్ చరిత్రలో కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఇప్పటివరకు ఆరు సార్లు పోటీ జరిగింది. ఇందులో లక్నో టీమ్ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఏకంగా నాలుగు మ్యాచ్‌ల్లో లక్నో గెలవగా, కేకేఆర్ కేవలం రెండు సార్లు మాత్రమే విజయం సాధించింది. ఇక ఈడెన్ గార్డెన్స్ విషయానికొస్తే, ఇక్కడ జరిగిన మూడు మ్యాచ్‌ల్లో లక్నో రెండు సార్లు నెగ్గింది. గణాంకాల పరంగా చూస్తే కోల్‌కతా కంటే లక్నో వైపే మొగ్గు ఎక్కువగా కనిపిస్తోంది.
పిచ్ ఎలా ఉండబోతోంది?
ఈడెన్ గార్డెన్స్ పిచ్ ఎప్పుడూ బ్యాటర్లకు స్వర్గధామంలా ఉంటుంది. ఇక్కడ బంతి బ్యాట్‌పైకి చాలా వేగంగా వస్తుంది, కాబట్టి భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా కోల్‌కతాలో వర్షాలు కురిసినప్పటికీ, నేటి మ్యాచ్ సమయానికి ఆకాశం నిర్మలంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. కొత్త బంతితో పేసర్లకు కాస్త బౌన్స్ లభిస్తుంది, కానీ పాతబడే కొద్దీ బ్యాటర్లు రెచ్చిపోవచ్చు. టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుని, లక్ష్యాన్ని ఛేదించడానికి మొగ్గు చూపే అవకాశం ఉంది.
జట్ల పరిస్థితి, అంచనాలు
కేకేఆర్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడి రెండింటిలో ఓడిపోయింది, ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. అంటే ఇప్పటివరకు వారు ఒక్క విజయం కూడా నమోదు చేయలేదు. అజింక్య రహానే సారథ్యంలోని ఈ జట్టులో ఫిన్ అలెన్, కామెరూన్ గ్రీన్ వంటి భారీ హిట్టర్లు ఉన్నా ఫలితం అనుకూలంగా రావట్లేదు. మరోవైపు రిషబ్ పంత్ నాయకత్వంలోని లక్నో టీమ్ సమతూకంతో కనిపిస్తోంది. మహమ్మద్ షమీ, ఆవేష్ ఖాన్ వంటి అనుభవం ఉన్న బౌలర్లతో పాటు నికోలస్ పూరన్ లాంటి విధ్వంసకర బ్యాటర్లు ఆ జట్టుకు బలం.
ఎవరు గెలిచే అవకాశం ఉంది?
మా విశ్లేషణ ప్రకారం, నేటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ గెలిచే అవకాశాలు 55 శాతం ఉండగా, లక్నోకు 45 శాతం ఉన్నాయి. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కేకేఆర్‌కు కలిసొచ్చే అంశం. అయితే పాయింట్ల పట్టికలో ఎగబాకాలంటే ఇరు జట్లకు ఈ విజయం చాలా ముఖ్యం. ఎయిడెన్ మార్‌క్రమ్, మిచెల్ మార్ష్ వంటి స్టార్ ప్లేయర్ల ప్రదర్శన ఈ మ్యాచ్ ఫలితాన్ని శాసించనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..