Kavya Maran : కావ్య మారన్ వర్సెస్ అంబానీ.. కొత్త టీమ్ కోసం ఐపీఎల్ దిగ్గజాల పోటీ
Kavya Maran : ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్ (BBL) ప్రైవేటీకరణలో భాగంగా మెల్బోర్న్ ఫ్రాంచైజీని కొనుగోలు చేయడానికి కావ్య మారన్ సన్ గ్రూప్, అంబానీ రిలయన్స్ గ్రూప్ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. కావ్య మారన్ కు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్, ది హండ్రెడ్ లీగ్‌లో సన్‌రైజర్స్ లీడ్స్ జట్లు ఉన్నాయి.

Kavya Maran : ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన, విజయవంతమైన క్రికెట్ టోర్నమెంట్‌గా అవతరించింది. దీని క్రేజ్ చూసి ప్రపంచంలోని మిగతా దేశాలన్నీ కూడా తమ సొంత లీగ్‌లను భారీగా విస్తరించుకోవాలని చూస్తున్నాయి. ఇందులో భాగంగానే ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానులకు అంతర్జాతీయంగా అనేక ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే గ్లోబల్ క్రికెట్ బిజినెస్‌లో దూసుకుపోతున్న కావ్య మారన్ నేతృత్వంలోని సన్ గ్రూప్ (సన్‌రైజర్స్ హైదరాబాద్), అంబానీ ఫ్యామిలీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (ముంబై ఇండియన్స్) ప్రపంచవ్యాప్తంగా తమ ఫ్రాంచైజీ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తున్నాయి.
తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ టీ20 టోర్నమెంట్ బిగ్ బాష్ లీగ్(BBL)లో ప్రైవేటీకరణ మోడల్‌ను ప్రవేశపెట్టేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా (CA) సిద్ధమైంది. ఈ నెలలోనే జరగబోయే స్టేట్ చైర్స్ సమావేశంలో దీనికి ఆమోదం లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ జట్ల యజమానులు ఆస్ట్రేలియాకు చెందిన ఒక ప్రముఖ ఫ్రాంచైజీని కొనుగోలు చేయడానికి విపరీతమైన ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా మెల్బోర్న్ నగరానికి చెందిన క్లబ్‌లలో వస్తున్న మార్పులు ఇందుకు వేదికగా మారాయి.
క్రికెట్ విక్టోరియా (CV) బోర్డు తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం.. రాబోయే సీజన్ కంటే ముందే వారి రెండు ప్రముఖ బిగ్ బాష్ లీగ్ క్లబ్‌లైన మెల్బోర్న్ స్టార్స్, మెల్బోర్న్ రెనెగేడ్స్‌ను ఒకే గొడుగు కిందికి తీసుకురానున్నారు. ప్రముఖ ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్ టామ్ మోరిస్ ఎక్స్ వేదికగా ఈ సంచలన మార్పును అధికారికంగా వెల్లడించారు. మనం ఇప్పటివరకు చూసిన స్టార్స్, రెనెగేడ్స్ జట్ల ప్రస్థానం ముగిసిందని, ఈ రెండింటినీ కలిపి నేవీ బ్లూ జెర్సీతో సరికొత్త విక్టోరియన్ ఫ్రాంచైజీని ఏర్పాటు చేయబోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కొత్త జట్టు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG) వేదికగా మ్యాచ్‌లు ఆడుతుంది.
ఈ మెల్బోర్న్ జట్ల విలీనం వెనుక అసలు కారణం క్రికెట్ విక్టోరియా తన వద్ద ఉన్న రెండో బిగ్ బాష్ ఫ్రాంచైజీ లైసెన్స్‌ను పూర్తిగా ఒక ప్రైవేట్ పెట్టుబడిదారునికి విక్రయించడమేనని ESPNcricinfo నివేదించింది. క్రికెట్ ఆస్ట్రేలియా ప్రైవేటీకరణకు అనుమతి ఇచ్చిన వెంటనే ఈ విక్రయ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ రెండో మెల్బోర్న్ క్లబ్‌ను ఒక ఐపీఎల్ జట్టు యజమానికి విక్రయించడానికి క్రికెట్ విక్టోరియా సుముఖంగా ఉందని సమాచారం. దీని కోసం ఇప్పటికే పలువురు ఐపీఎల్ ఓనర్లు సంప్రదింపులు కూడా జరిపారు.
📰 | BBL 2026-27
Sun Group (SRH) & Reliance Industries (Mumbai Indians) are understood to have expressed interest in acquiring the second Melbourne BBL club if Cricket Victoria proceeds with a sale.#BBL17 | via ESPNcricinfo pic.twitter.com/ue2rxxwpzp
— T20 Tracker (@t20tracker) June 2, 2026
ప్రముఖ మీడియా సంస్థ టీ20 ట్రాకర్ అందించిన సమాచారం ప్రకారం.. ఈ సరికొత్త మెల్బోర్న్ ఫ్రాంచైజీని దక్కించుకోవడానికి సన్ గ్రూప్, రిలయన్స్ గ్రూప్ అత్యంత ఆసక్తిగా ఉన్నాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎంసీజీ (MCG) స్టేడియం హోమ్ గ్రౌండ్‌గా ఉండే జట్టును సొంతం చేసుకోవడం తమ గ్లోబల్ బ్రాండ్ వాల్యూను మరింత పెంచుతుందని ఈ రెండు దిగ్గజ సంస్థలు భావిస్తున్నాయి. దీనికోసం కావ్య మారన్, అంబానీ కుటుంబం మధ్య గట్టి పోటీ నడుస్తోంది.
ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఫ్రాంచైజీ బాస్‌లలో కావ్య మారన్, అంబానీలు అగ్రస్థానంలో ఉన్నారు. కావ్య మారన్ కు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్, ది హండ్రెడ్ లీగ్‌లో సన్‌రైజర్స్ లీడ్స్ జట్లు ఉన్నాయి. మరోవైపు అంబానీ కుటుంబానికి ఐపీఎల్ (ముంబై ఇండియన్స్)తో పాటు మేజర్ లీగ్ క్రికెట్ (MLC), ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ILT20), ది హండ్రెడ్, ఎస్ఏ20 లీగ్‌లలో కూడా సొంత జట్లు ఉన్నాయి.
క్రికెట్ ఆస్ట్రేలియా కూడా భారతీయ మార్కెట్, ప్రేక్షకులను ఆకర్షించడానికి సరికొత్త ప్లాన్ వేసింది. గత సీజన్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లను చేర్చుకోవడం ద్వారా సబ్‌కాంటినెంట్ వీక్షకులను ఆకట్టుకున్న ఆస్ట్రేలియా బోర్డు, ఈసారి అంతకంటే పెద్ద స్కెచ్ వేసింది. బిగ్ బాష్ లీగ్ 2027/28 సీజన్ మొట్టమొదటి మ్యాచ్‌ను ఏకంగా భారతదేశంలోని చెన్నై వేదికగా నిర్వహించాలని నిర్ణయించింది. దీనివల్ల భారతీయ క్రికెట్ అభిమానుల మద్దతుతో పాటు లీగ్‌కు భారీ ఆదాయం లభిస్తుందని క్రికెట్ ఆస్ట్రేలియా గట్టి నమ్మకంతో ఉంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
