India Test captain: ఆయన ఫిట్‌గా ఉంటే ఆటోమెటిక్ గా కెప్టెన్ అవుతాడు! టెస్ట్ కెప్టెన్ పంచాయితీ తెగ్గొట్టిన భారత మాజీ ఓపెనర్!
జస్ప్రీత్ బుమ్రాను భారత టెస్ట్ జట్టు కొత్త కెప్టెన్‌గా ఎంపిక చేయాలన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. వసీం జాఫర్ అతడిని ఆటోమేటిక్ కెప్టెన్ ఎంపికగా అభివర్ణించారు. గిల్‌ను భవిష్యత్తు నాయకుడిగా తీర్చిదిద్దేందుకు వైస్ కెప్టెన్‌గా నియమించాలని సూచించారు. కానీ బుమ్రా ఫిట్‌నెస్ అంశం అతని ఎంపికపై ప్రశ్నలు వేస్తోంది.

భారత టెస్ట్ జట్టులో రోహిత్ శర్మ రిటైర్మెంట్ నేపథ్యంలో కొత్త కెప్టెన్సీ బాధ్యతలపై చర్చలు ఊపందుకున్నాయి. వచ్చే నెల ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు జట్టును ప్రకటించనుండటంతో, భారత తదుపరి రెడ్ బాల్ కెప్టెన్ ఎవరు అనే అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్, జస్ప్రీత్ బుమ్రాను “ఆటోమేటిక్ కెప్టెన్ ఎంపిక”గా అభివర్ణించాడు. అతను కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించనప్పుడు మాత్రమే వేరే పేరు పరిశీలనకు రావాలని అభిప్రాయపడ్డాడు. అలాగే, భవిష్యత్తులో గిల్‌ను పూర్తిస్థాయి నాయకత్వానికి సిద్ధం చేయాలంటే, బుమ్రా విశ్రాంతి పొందే ప్రతి సందర్భంలో గిల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలని సూచించాడు. అలాగే శుభ్‌మాన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించడం ద్వారా, అతడిని గమనించి తీర్చిదిద్దే అవకాశం లభిస్తుంది అని జాఫర్ అన్నారు.
బుమ్రా ఇప్పటికే భారత్ తరపున వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. రోహిత్ లేనప్పుడు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టుల్లో జట్టుకు నాయకత్వం వహించాడు. ముఖ్యంగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ సాధించిన ఏకైక టెస్ట్ విజయం బుమ్రా నేతృత్వంలోనే నమోదైంది. అయితే అతని ఫిట్‌నెస్ విషయంలో నిరంతర అనిశ్చితి, గతంలో అతను గాయాల వల్ల సుదీర్ఘకాలం ఆటకు దూరంగా ఉండడం సెలెక్టర్లను ఆలోచనలో పడేసింది. PTI నివేదిక ప్రకారం, చివరి టెస్ట్‌లో గాయం కారణంగా అతను రెండవ ఇన్నింగ్స్ బౌలింగ్ చేయలేకపోవడం, భారత్ గెలుపు అవకాశాలను దెబ్బతీసిందని విశ్లేషణలున్నాయి. ఇదే గాయం వల్ల బుమ్రా తరువాత ఛాంపియన్స్ ట్రోఫీ, ఐపీఎల్ ప్రారంభంలో కొన్ని మ్యాచ్‌లు కోల్పోయాడు. అయినా తర్వాత తిరిగి మళ్లీ బలంగా వచ్చి మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టుకు కీలకంగా నిలిచాడు.
ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ లాంటి వారు కూడా ఫిట్‌గా ఉన్న ఆటగాడిని ఆటోమేటిక్ కెప్టెన్‌గా ఎంచుకోవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, ఇదే కారణంగా హార్దిక్ పాండ్యా కంటే సూర్యకుమార్ యాదవ్‌ను T20I కెప్టెన్‌గా ఎంచుకున్నట్టు గుర్తుచేశారు. జాఫర్ కూడా ఇదే దిశగా ఆలోచిస్తూ, బుమ్రా పూర్తిస్థాయి కెప్టెన్‌గా ఉండాలనీ, అయితే అతనికి విశ్రాంతి అవసరమైనప్పుడు గిల్‌ను ఆ బాధ్యతల్లోకి తీసుకురావాలన్నారు. దీనివల్ల గిల్‌పై పూర్తి స్థాయి ఒత్తిడి లేకుండానే, అతనిలో నాయకత్వ లక్షణాలు పెంపొందించవచ్చని పేర్కొన్నారు.
మొత్తానికి, బుమ్రా ఫిట్‌గా ఉంటే టెస్ట్ కెప్టెన్సీకి అతడే ఉత్తమ ఎంపిక అని, అతని అభిప్రాయం, ఆరోగ్య పరిస్థితిని బట్టి గిల్ వంటి యువ నాయకుడిని దశలవారీగా తీర్చిదిద్దవచ్చని జాఫర్ విశ్వాసం వ్యక్తం చేశాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..