AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2027: సీఎస్కే, ఎస్ఆర్‌హెచ్ మధ్య నలుగురు ఆటగాళ్ల ట్రేడ్.. ఎవరెవరు ఏ జట్టులోకి వెళ్లారంటే?

IPL 2027: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఆటగాళ్ల ట్రేడ్‌పై చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్‌ను జట్టులోకి తీసుకునేందుకు చెన్నై ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఖలీల్ అహ్మద్ పేరు కూడా చర్చల్లో వినిపిస్తోంది.

IPL 2027: సీఎస్కే, ఎస్ఆర్‌హెచ్ మధ్య నలుగురు ఆటగాళ్ల ట్రేడ్.. ఎవరెవరు ఏ జట్టులోకి వెళ్లారంటే?
Ipl 2027 (1)
Rakesh
|

Updated on: Nov 05, 2026 | 5:51 PM

Share

IPL 2027: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు కీలక మార్పులు చేసుకున్నాయి. రెండు జట్ల మధ్య నలుగురు ఆటగాళ్ల బదిలీ ఒప్పందం పూర్తయింది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ చెన్నై జట్టులోకి వెళ్లగా.. భారత పేసర్ ఖలీల్ అహ్మద్, ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ ఎల్లిస్ హైదరాబాద్ జట్టులో చేరనున్నారు. ఈ ఒప్పందాన్ని ఐపీఎల్ అధికారికంగా ప్రకటించింది.

రూ.13 కోట్ల ఆటగాడు.. ఇప్పుడు రూ.6 కోట్లకే

ఈ ట్రేడ్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పేరు లియామ్ లివింగ్‌స్టోన్. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అతడిని రూ.13 కోట్లకు తీసుకుంది. ఇప్పుడు సీఎస్కే అతడిని రూ.6 కోట్ల ధరకు దక్కించుకుంది. అంటే పాత ధరతో పోలిస్తే రూ.7 కోట్లు తక్కువకు చెన్నైకి వచ్చాడు. మరోవైపు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ రూ.3 కోట్ల పాత ధరతోనే సీఎస్కేలో చేరనున్నాడు. భారీ షాట్లు ఆడగల లివింగ్‌స్టోన్‌తో పాటు పేస్ బౌలింగ్ చేయగల ఎడ్వర్డ్స్ కూడా జట్టుకు అదనపు ఆల్‌రౌండ్ ఎంపికగా ఉండనున్నాడు.

ఖలీల్‌కు పాత జట్టులోకి రీఎంట్రీ

చెన్నై నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వెళ్లనున్న ఆటగాళ్లలో ఖలీల్ అహ్మద్ ఒకడు. గతంలో 2018 నుంచి 2021 వరకు అతడు హైదరాబాద్ జట్టుకే ఆడాడు. ఐపీఎల్ 2025లో సీఎస్కే తరఫున 14 మ్యాచ్‌లు ఆడి 15 వికెట్లు పడగొట్టాడు. 2026 సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన తర్వాత కుడి తొడ కండరాల గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. ఇప్పుడు మళ్లీ పాత జట్టులోకి వస్తున్నాడు. మరోవైపు ఆస్ట్రేలియా పేసర్ నాథన్ ఎల్లిస్ రూ.2 కోట్ల ధరతో ఎస్ఆర్‌హెచ్‌కు వెళ్లనున్నాడు. డెత్ ఓవర్లలో వైవిధ్యమైన బంతులు వేయగల ఎల్లిస్ రాకతో హైదరాబాద్ బౌలింగ్ విభాగానికి బలం చేకూరనుంది.

ఐపీఎల్ 2026లో ఆడలేకపోయిన ఎడ్వర్డ్స్, ఎల్లిస్

ఈ ట్రేడ్‌లో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఎడ్వర్డ్స్, ఎల్లిస్ ఇద్దరూ ఐపీఎల్ 2026 సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. పాదానికి గాయం కావడంతో ఎడ్వర్డ్స్ మొత్తం సీజన్‌కు దూరమయ్యాడు. ఎల్లిస్ హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో టోర్నీకి అందుబాటులో లేకుండా పోయాడు. లివింగ్‌స్టోన్‌కు మాత్రం ఐపీఎల్‌లో మంచి అనుభవం ఉంది. ఇప్పటివరకు 51 మ్యాచ్‌లు ఆడి 1,066 పరుగులు చేశాడు. 13 వికెట్లు కూడా పడగొట్టాడు. ఎల్లిస్ 17 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 19 వికెట్లు తీసుకున్నాడు. ఈ గణాంకాలను చూస్తే సీఎస్కే బ్యాటింగ్, ఆల్‌రౌండ్ విభాగాలను బలోపేతం చేసుకోగా.. ఎస్ఆర్‌హెచ్ పేస్ బౌలింగ్‌పై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.

డిసెంబర్ 16న ఐపీఎల్ 2027 మినీ వేలం

ఐపీఎల్ 2027 మినీ వేలం డిసెంబర్ 16న గోవాలో జరగనుంది. ముందుగా నవంబర్ 15గా నిర్ణయించిన ఆటగాళ్ల రిటెన్షన్ జాబితా సమర్పణ గడువును బీసీసీఐ మరో రెండు రోజులు పొడిగించి నవంబర్ 17కు మార్చింది. భారత్-న్యూజిలాండ్ వన్డే సిరీస్ నవంబర్ 15న ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వేలానికి ముందే జట్ల మధ్య ఆటగాళ్ల మార్పులు మొదలవడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. గత కొన్ని సీజన్లుగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న సీఎస్కే, వచ్చే సీజన్‌లో పుంజుకోవాలని చూస్తోంది. మరోవైపు ఎస్ఆర్‌హెచ్ కూడా బౌలింగ్ విభాగాన్ని మరింత పటిష్ఠం చేసుకుంటోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us