
IPL 2026 Points Table : ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తర దశకు చేరుకుంది. శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరిగిన 60వ మ్యాచ్ పాయింట్ల పట్టికలో సమీకరణాలను మార్చేసింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ అద్భుత విజయం సాధించడంతో వారి ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండటమే కాకుండా, పాయింట్ల పట్టికలో ఒక మెట్టు పైకి ఎగబాకారు. అయితే, గుజరాత్ ఓటమి మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్‌కు ఒక అరుదైన అవకాశాన్ని తెచ్చిపెట్టింది. ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే మొట్టమొదటి జట్టుగా నిలిచే ఛాన్స్ ఇప్పుడు కోహ్లీ సేన ముందు ఉంది.
వాస్తవానికి కేకేఆర్‌పై గుజరాత్ టైటాన్స్ గెలిచి ఉంటే, పాయింట్ల పట్టికలో 18 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకోవడంతో పాటు ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకున్న తొలి జట్టుగా నిలిచేది. కానీ ఈ ఓటమితో గుజరాత్ 13 మ్యాచ్‌ల్లో 16 పాయింట్లతో రెండో స్థానానికే పరిమితమైంది. ఇప్పుడు ఇదే ఆర్సీబీకి వరంగా మారింది. ప్రస్తుతం 12 మ్యాచ్‌ల్లో 16 పాయింట్లతో, +1.053 నెట్ రన్ రేట్‌తో అగ్రస్థానంలో ఉన్న బెంగళూరు.. ఈరోజు (మే 17) పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే చాలు. 18 పాయింట్లతో అధికారికంగా ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయిన మొదటి టీమ్‌గా చరిత్ర సృష్టిస్తుంది.
గుజరాత్ టైటాన్స్‌ను మట్టికరిపించిన కేకేఆర్.. తన ర్యాంకింగ్‌ను మెరుగుపరుచుకుంది. ఈ విజయంతో కేకేఆర్ ఖాతాలో 12 మ్యాచ్‌లకు గాను 11 పాయింట్లు చేరాయి. ఫలితంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ను వెనక్కి నెట్టి 8వ స్థానం నుంచి 7వ స్థానానికి చేరుకుంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారీ విజయాలు సాధిస్తే కేకేఆర్ ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ విజయంతో కేకేఆర్ క్యాంప్‌లో మళ్ళీ ఉత్సాహం నెలకొంది.
ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిస్తే, వారి పేరు పక్కన Q అనే అక్షరం చేరిపోతుంది. ఒకవేళ ఆర్సీబీ పొరపాటున ఓడిపోతే మాత్రం టాప్-4 రేసులో మళ్ళీ గందరగోళం మొదలవుతుంది. గుజరాత్ ఓటమితో ఆర్సీబీకి మార్గం సుగమం అవ్వగా, కేకేఆర్ గెలుపుతో లోయర్ టేబుల్ టీమ్స్ మధ్య పోటీ పెరిగింది. ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో ఆర్సీబీ, గుజరాత్ టాప్-2లో ఉండగా, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ కూడా గట్టి పోటీనిస్తున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..