
IPL 2026 Playoffs Scenario : ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సాధించిన ఘనవిజయం పాయింట్ల పట్టికను తలకిందులు చేసింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో ఢిల్లీ కోటను బద్దలు కొట్టారు. కేవలం 75 పరుగులకే ఢిల్లీని కుప్పకూల్చిన ఆర్‌సీబీ, ప్లేఆఫ్స్ దిశగా ఒక భారీ అడుగు వేసింది. ఈ విజయంతో ఆర్‌సీబీ ఆనందంలో ఉంటే, ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి మాత్రం చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు తయారైంది.
ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ బౌలర్లు ఆరంభం నుంచే ఢిల్లీ బ్యాటర్లను వణికించారు. జోష్ హెజల్‌వుడ్ 3.3 ఓవర్లలో కేవలం 12 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు. వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తన 3 ఓవర్లలో కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసి ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బ కొట్టారు. ఢిల్లీ బ్యాటర్లలో అభిషేక్ పోరెల్ (30) తప్ప మిగిలిన వారందరూ పెవిలియన్ కు క్యూ కట్టారు. లక్ష్య ఛేదనలో ఆర్‌సీబీ కేవలం ఒకే వికెట్ కోల్పోయి విజయాన్ని అందుకుంది. విరాట్ కోహ్లీ (23 నాటౌట్) ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో 9000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించారు.
ఈ విజయంతో ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచుల్లో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించింది. ఆర్‌సీబీ నెట్ రన్ రేట్ (+1.919) లీగ్‌లో అన్ని టీమ్స్ కంటే మెరుగ్గా ఉండటం విశేషం. మిగిలి ఉన్న 6 మ్యాచుల్లో ఆర్‌సీబీ కేవలం 2 మ్యాచులు గెలిస్తే ప్లేఆఫ్స్ బెర్త్ దాదాపు ఖాయం అవుతుంది. ఒకవేళ టాప్ 2లో నిలిస్తే ఫైనల్‌కు వెళ్లడానికి రెండు అవకాశాలు దక్కుతాయి. ప్రస్తుత ఫామ్ చూస్తుంటే ఆర్‌సీబీ క్వాలిఫై అవ్వడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. 8 మ్యాచుల్లో కేవలం 3 గెలిచిన ఢిల్లీ, 5 ఓటములతో ఏడో స్థానంలో ఉంది. వారి నెట్ రన్ రేట్ (-1.060) చాలా దారుణంగా పడిపోయింది. ఢిల్లీ ప్లేఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన 6 మ్యాచుల్లో కనీసం 5 మ్యాచులు ఖచ్చితంగా గెలవాలి. అలా గెలిస్తే 16 పాయింట్లతో ముందంజ వేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ 4 మ్యాచులే గెలిస్తే 14 పాయింట్ల వద్ద ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఢిల్లీకి ఇకపై జరిగే ప్రతి మ్యాచ్ డూ ఆర్ డై లాంటిదే.
ఈ మ్యాచ్ కేవలం విజయం కోసమే కాదు, విరాట్ కోహ్లీ సాధించిన మైలురాయికి కూడా చిరస్మరణీయం. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఒకే ఫ్రాంచైజీ (ఆర్‌సీబీ)కి ఆడుతున్న కోహ్లీ, తన అద్భుత ప్రయాణంలో 9000 పరుగుల మార్కును దాటి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచారు. ప్రేక్షకులు స్టేడియంలో కోహ్లీ నామస్మరణతో హోరెత్తించారు. ఆర్‌సీబీ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఈ మూడు విభాగాల్లోనూ ఢిల్లీ కంటే ఎంతో మెరుగ్గా కనిపించింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..