
IPL 2026 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. లక్నో సూపర్ జాయింట్స్‌పై పంజాబ్ కింగ్స్ సాధించిన అద్భుతమైన విజయంతో ప్లేఆఫ్స్ నాలుగో స్థానం కోసం పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఒకే ఒక్క ఖాళీ స్థానం కోసం పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు చావో రేవో తేల్చుకునేందుకు సిద్ధమవడంతో ఆదివారం నాటి మ్యాచ్‌లు అత్యంత కీలకంగా మారాయి.
లక్నోపై పంజాబ్ ఘన విజయం
శనివారం రాత్రి జరిగిన కీలక పోరులో పంజాబ్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జాయింట్స్‌పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 197 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ జట్టు కేవలం 18 ఓవర్లలోనే ఛేదించింది. పంజాబ్ నాయకుడు శ్రేయస్ అయ్యర్ 51 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 పరుగులు చేసి అజేయ సెంచరీతో జట్టును నడిపించాడు. ఈ విజయంతో పంజాబ్ 14 మ్యాచ్‌లలో 15 పాయింట్లతో ప్రస్తుతానికి పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. పంజాబ్ గెలుపుతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది.
పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు
ప్రస్తుతం 15 పాయింట్లతో నెట్ రన్ రేట్ ప్లస్ 0.309 కలిగి ఉన్న పంజాబ్ కింగ్స్ ఆశలు ఇతర జట్ల విజయాలపై ఆధారపడి ఉన్నాయి. పంజాబ్ తదుపరి దశకు చేరుకోవాలంటే ఆదివారం జరిగే మ్యాచ్‌లలో ముంబై ఇండియన్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవాలి. అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో కోల్‌కతా నైట్ రైడర్స్ పరాజయం పాలుకావాలి. ఒకవేళ కోల్‌కతా గెలిచినా, అది స్వల్ప మార్జిన్‌తోనే ఉండాలి. అప్పుడే పంజాబ్ జట్టుకు లీగ్ లో ముందంజ వేసే అవకాశం దక్కుతుంది.
రాజస్థాన్ రాయల్స్‌కు ఛాన్స్ ఉందా ?
రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రస్తుతం 13 మ్యాచ్‌లలో 14 పాయింట్లతో ఉంది. ఆ జట్టుకు ప్లేఆఫ్స్ చేరడానికి సమీకరణం చాలా స్పష్టంగా ఉంది. ఆదివారం మధ్యాహ్నం ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధిస్తే నేరుగా నాలుగో జట్టుగా ప్లేఆఫ్స్ అర్హత సాధిస్తుంది. అయితే, ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే మాత్రం రాజస్థాన్ రేసు నుంచి తప్పుకుంటుంది. ఎందుకంటే పంజాబ్ జట్టు కంటే రాజస్థాన్ నెట్ రన్ రేట్ తక్కువగా ఉంది.
కోల్‌కతా నైట్ రైడర్స్‌కు లక్ కలిసి వస్తుందా?
మరోవైపు 13 మ్యాచ్‌లలో 13 పాయింట్లతో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ కథ విభిన్నంగా ఉంది. కోల్‌కతా జట్టు తన చివరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఎదుర్కోనుంది. కోల్‌కతా ప్లేఆఫ్స్ చేరాలంటే ముందుగా ముంబై చేతిలో రాజస్థాన్ ఓడిపోవాలి. ఆ తర్వాత ఢిల్లీపై కోల్‌కతా భారీ పరుగుల తేడాతో విజయం సాధించి, పంజాబ్ కంటే మెరుగైన నెట్ రన్ రేట్ సాధించాల్సి ఉంటుంది. ఈ మూడు జట్లలో ఆదివారం ఏ జట్టు అదృష్టాన్ని వరించనుందో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..