AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KL Rahul: మెట్లు కూడా ఎక్కలేకపోయిన కేఎల్ రాహుల్.. అసలు ఏమైంది? కోచ్ ఏమన్నాడంటే ?

KL Rahul: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆటలో భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తీవ్రమైన కండరాల నొప్పులతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడం తీవ్ర కలకలం రేపింది. రాహుల్ తీవ్ర బాధతో పెవిలియన్ వైపు అడుగులు వేస్తున్న దృశ్యాలు అభిమానుల్లో తీవ్ర ఆందోళన నింపగా, ఆయన ఫిట్‌నెస్‌పై బిసిసిఐ కీలక అప్‌డేట్ ఇచ్చింది.

KL Rahul: మెట్లు కూడా ఎక్కలేకపోయిన కేఎల్ రాహుల్.. అసలు ఏమైంది? కోచ్ ఏమన్నాడంటే ?
Kl Rahul
Rakesh
|

Updated on: Aug 16, 2026 | 7:25 AM

Share

KL Rahul: గాలె అంతర్జాతీయ మైదానంలో శ్రీలంకతో ప్రారంభమైన తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆటలో భారత బ్యాటర్ల ఆధిపత్యమే కనిపించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ మంచి ఆరంభం అందించారు. జైస్వాల్ దురదృష్టవశాత్తూ రనౌట్ అయినప్పటికీ, రాహుల్ అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించి సెంచరీ వైపు దూసుకెళ్లాడు. 77 పరుగుల వద్ద ఉన్న సమయంలో ఆయన తీవ్రమైన కండరాల నొప్పితో అల్లాడిపోయారు.

మైదానంలో నరకయాతన

చేతులు, కాళ్లలో తీవ్రమైన నొప్పి రావడంతో రాహుల్ క్రీజులో నిలబడలేకపోయారు. టీ-విరామం సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో ఫిజియోథెరపిస్ట్ ఆయనకు ప్రత్యేక చికిత్స అందించారు. మూడో సెషన్ ప్రారంభంలో తిరిగి బ్యాటింగ్‌కు రావడానికి ప్రయత్నించినప్పటికీ, నొప్పి తీవ్రరూపం దాల్చడంతో ఆటను మధ్యలోనే ఆపేసి వెనుదిరగక తప్పలేదు. ఫిజియో సహాయంతో పెవిలియన్ వైపు మెట్లు ఎక్కుతున్నప్పుడు రాహుల్ నడవలేక పడిన బాధకు సంబంధించిన ఫోటోలు అభిమానుల హృదయాలను పిండేశాయి.

రాహుల్ స్థానంలో గిల్ ఎంట్రీ

రాహుల్ మైదానం నుంచి బయటకు వెళ్లిన తర్వాత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఐతే గిల్ ఎక్కువ సేపు నిలవకుండా 16 పరుగులకే అవుటయ్యాడు. మరోవైపు యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుతమైన సెంచరీతో మెరిసి జట్టుకు కొండంత అండగా నిలిచాడు. రాహుల్ నిష్క్రమించినా, పడిక్కల్ సెంచరీ తోడవడంతో భారత్ మొదటి రోజు భారీ స్కోరు వైపు పయనించింది.

బీసీసీఐ అధికారిక స్పందన.. కోచింగ్ స్టాఫ్ ఏమన్నారంటే?

కేఎల్ రాహుల్ గాయంపై బీసీసీఐ వర్గాల నుంచి స్పష్టత వచ్చింది. టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాంశు కొటక్ మాట్లాడుతూ, “రాహుల్ శరీరం అంతటా కండరాల సమస్య తలెత్తింది. అయితే ఆయన ఇప్పుడు కోలుకున్నారు” అని వెల్లడించారు. ఇప్పటికే సాయి సుదర్శన్, జస్ప్రీత్ బుమ్రా గాయాల కారణంగా శ్రీలంక టెస్ట్ సిరీస్‌కు దూరమైన నేపథ్యంలో, రాహుల్ కోలుకోవడం జట్టు మేనేజ్‌మెంట్‌కు పెద్ద ఊరటనిచ్చే అంశం. రాహుల్ కండరాల నొప్పుల నుంచి పూర్తిగా తేరుకోవడంతో ఆయన తదుపరి ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేయడానికి ఏలాంటి అభ్యంతరం లేదు. రాబోయే రోజుల్లో ఆయన మళ్లీ మైదానంలోకి వచ్చి తన పరుగుల వేటను కొనసాగిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us