IPL Records : ఐపీఎల్‌లో వింత రికార్డు.. ఇన్ని మ్యాచ్‌లు ఆడినా ఒక్క ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా లేదా?

IPL Records : ఐపీఎల్ (IPL) అంటేనే రికార్డుల మయం. ఐపీఎల్ చరిత్రలో కొందరు స్టార్ ప్లేయర్లు ఒకే జట్టుపై దశాబ్ద కాలానికి పైగా ఆడుతున్నా.. ఇప్పటికీ ఆ నిర్దిష్ట జట్టుపై ఒక్కసారి కూడా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలవలేకపోవడం గమనార్హం.

IPL Records : ఐపీఎల్‌లో వింత రికార్డు.. ఇన్ని మ్యాచ్‌లు ఆడినా ఒక్క  ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా లేదా?
Virat Kohli

Updated on: Mar 17, 2026 | 12:48 PM

IPL Records : ఐపీఎల్ (IPL) అంటేనే రికార్డుల మయం. సెంచరీలు, హాఫ్ సెంచరీలు, వికెట్ల వేటలో ప్లేయర్లు దూసుకుపోతుంటారు. ప్రతి మ్యాచ్‌ చివరలో అద్భుత ప్రదర్శన చేసిన ఒకరికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇస్తారు. అయితే, ఐపీఎల్ చరిత్రలో కొందరు స్టార్ ప్లేయర్లు ఒకే జట్టుపై దశాబ్ద కాలానికి పైగా ఆడుతున్నా.. ఇప్పటికీ ఆ నిర్దిష్ట జట్టుపై ఒక్కసారి కూడా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలవలేకపోవడం గమనార్హం. ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28న ప్రారంభం కానున్న తరుణంలో, ఈ వింత గణాంకాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ముంబై ఇండియన్స్‌పై రవిచంద్రన్ అశ్విన్

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్‌పై టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు వింత రికార్డు ఉంది. అశ్విన్ ముంబైపై ఏకంగా 37 మ్యాచ్‌లు ఆడినప్పటికీ, ఇప్పటివరకు ఒక్కసారి కూడా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకోలేకపోయారు.

రాజస్థాన్ రాయల్స్‌పై విరాట్ కోహ్లీ

రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి కూడా ఒక జట్టు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన 33 మ్యాచ్‌ల్లో కోహ్లీ ఎన్నో పరుగులు చేసినప్పటికీ, ఆ జట్టుపై ఒక్కసారి కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవలేకపోయారు.

చెన్నై సూపర్ కింగ్స్‌పై దినేష్ కార్తీక్

ధోనీ నేతృత్వంలోని సీఎస్కేపై దినేష్ కార్తీక్ సుదీర్ఘ కాలంగా ఆడుతున్నారు. ఇప్పటివరకు చెన్నైపై 33 మ్యాచ్‌లు ఆడిన కార్తీక్, ఆ జట్టుపై ఒక్క అవార్డు కూడా సాధించలేకపోయారు.

కోల్‌కతా నైట్ రైడర్స్‌పై భువనేశ్వర్ కుమార్

కేకేఆర్ జట్టుపై స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ ఎన్నో కీలక వికెట్లు పడగొట్టారు. కానీ, ఆ జట్టుతో తలపడిన 30 మ్యాచ్‌ల్లో ఒక్కసారి కూడా ఆయనను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించలేదు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై దినేష్ కార్తీక్

దినేష్ కార్తీక్‌కు మరో జట్టుపై కూడా ఇదే రకమైన రికార్డు ఉంది. ఆర్‌సీబీతో జరిగిన 28 మ్యాచ్‌ల్లో కార్తీక్ ఒక్కసారి కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలవలేదు.

ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాబిన్ ఉతప్ప

మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్ప ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై తన కెరీర్‌లో 28 మ్యాచ్‌లు ఆడారు. అయితే ఢిల్లీపై ఆయనకు ఒక్కసారి కూడా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గౌరవం దక్కలేదు.

సన్ రైజర్స్ హైదరాబాద్‌పై సునీల్ నరైన్

మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ ఎందరో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టినప్పటికీ, ఎస్ఆర్‌హెచ్‌పై ఆడిన 27 మ్యాచ్‌ల్లో ఒక్క అవార్డు కూడా గెలవలేకపోవడం విశేషం.

పంజాబ్ కింగ్స్‌పై యూసుఫ్ పఠాన్

సిక్సర్ల కింగ్ యూసుఫ్ పఠాన్ పంజాబ్ కింగ్స్‌పై 24 మ్యాచ్‌లు ఆడారు. మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన చరిత్ర ఉన్నప్పటికీ, పంజాబ్‌పై ఆయనకు ఒక్క మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా దక్కలేదు.

గుజరాత్ టైటాన్స్ & లక్నో సూపర్ జెయింట్స్‌పై..

కొత్త జట్ల విషయానికి వస్తే:

గుజరాత్ టైటాన్స్‌పై: ట్రెంట్ బౌల్ట్ 8 మ్యాచ్‌లు ఆడినా ఒక్క అవార్డు అందుకోలేదు.

లక్నో సూపర్ జెయింట్స్‌పై: హార్దిక్ పాండ్యా 8 మ్యాచ్‌లు ఆడినా ఒక్కసారి కూడా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కాలేదు.

ఈ రికార్డులను చూస్తుంటే ఐపీఎల్ ఎంత పోటీతో కూడుకున్నదో అర్థమవుతోంది. ఐపీఎల్ 2026లోనైనా ఈ ఆటగాళ్లు ఈ రికార్డులను చెరిపివేస్తారో లేదో చూడాలి.

 

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

Follow Us