LSG vs KKR: మొహ్సిన్ ఖాన్ దెబ్బకు కుదేలైన కేకేఆర్.. కట్‌చేస్తే.. సిక్సర్ సింగ్ ఒంటరి పోరు ఫలించేనా.?

LSG vs KKR Match 38: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా లక్నోలోని ఏకనా స్టేడియంలో జరిగిన 38వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ మొహ్సిన్ ఖాన్ నిప్పులు చెరిగే బంతులతో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లను హడలెత్తించాడు. రింకూ సింగ్ అద్భుత అర్ధశతకంతో ఆదుకున్నప్పటికీ, నిర్ణీత 20 ఓవర్లలో కోల్‌కతా జట్టు 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది.

LSG vs KKR: మొహ్సిన్ ఖాన్ దెబ్బకు కుదేలైన కేకేఆర్.. కట్‌చేస్తే.. సిక్సర్ సింగ్ ఒంటరి పోరు ఫలించేనా.?
Lsg Vs Kkr Rinku Singh 83 Runs

Updated on: Apr 26, 2026 | 9:30 PM

Rinku Singh 83 Runs: కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌తో టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. లక్నో బౌలర్లు కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆది నుంచే కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా మొహ్సిన్ ఖాన్ పదునైన బంతులతో కోల్‌కతా టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. ఓపెనర్ అజింక్య రహానే 10 పరుగులు చేసి మొహ్సిన్ బౌలింగ్‌లో వెనుదిరగగా, టిమ్ సీఫెర్ట్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. యువ ఆటగాడు అంగ్క్రిష్ రఘువంశీ 9 పరుగులు చేసి క్షేత్రరక్షణకు ఆటంకం కలిగించాడనే అరుదైన కారణంతో ఔట్ కావడం గమనార్హం.

మొహ్సిన్ ఖాన్ ఐదు వికెట్ల ప్రతాపం..

ఈ మ్యాచ్‌లో మొహ్సిన్ ఖాన్ కెరీర్ బెస్ట్ ప్రదర్శన చేశాడు. తన 4 ఓవర్ల కోటాలో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. మధ్య ఓవర్లలో ప్రమాదకరంగా మారుతున్న కెమెరాన్ గ్రీన్‌ను 34 పరుగుల వద్ద పెవిలియన్ పంపి కోల్‌కతా నడ్డి విరిచాడు. ఆ తర్వాత అనుకుల్ రాయ్, రోవ్‌మన్ పావెల్ వంటి కీలక ఆటగాళ్లను కూడా మొహ్సిన్ తక్కువ పరుగులకే వెనక్కి పంపాడు. లక్నో బౌలర్ల ధాటికి ఒకానొక దశలో కోల్‌కతా 100 పరుగులు కూడా దాటడం కష్టమనిపించింది.

రింకూ సింగ్ వీరోచిత పోరాటం..

ఒకవైపు వికెట్లు పడుతున్నా, మరోవైపు రింకూ సింగ్ పట్టుదలగా నిలబడ్డాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బాధ్యతాయుతమైన బ్యాటింగ్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 51 బంతులు ఎదుర్కొన్న రింకూ 7 ఫోర్లు, 5 భారీ సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివరి ఓవర్లలో రింకూ చేసిన మెరుపు దాడుల వల్ల కోల్‌కతా గౌరవప్రదమైన స్కోరును సాధించగలిగింది. అతనికి సహకరించిన కెమెరాన్ గ్రీన్ 34 పరుగులు చేయగా, మిగిలిన వారు ఎవరూ రెండంకెల స్కోరును దాటలేకపోయారు.

చివరి ఓవర్లలో కట్టుదిట్టమైన బౌలింగ్..

మొహ్సిన్ ఖాన్‌కు తోడుగా మహమ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్ పొదుపుగా బౌలింగ్ చేశారు. జార్జ్ లిండే ఒక వికెట్ తీసి మధ్యలో పరుగుల వేగాన్ని అడ్డుకున్నాడు. దిగ్వేష్ సింగ్ రాఠీ కాస్త ఖరీదైన బౌలింగ్ చేసినప్పటికీ, లక్నో బౌలర్లు సమిష్టిగా రాణించి కోల్‌కతాను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో విజయం సాధించారు. కోల్‌కతా నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని లక్నో ఎలా ఛేదిస్తుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us