IPL 2025: కొడుకు విజయాన్ని కళ్లారా చూసి.. కన్నీళ్లు పెట్టుకున్న అవేశ్ ఖాన్ తల్లి.. ఎమోషనల్ వీడియో వైరల్

చివరి ఓవర్ దాకా ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ 2 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించింది. 20వ ఓవర్లో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు ఫాస్ట్ బౌలర్ అవేష్ ఖాన్. ఈ ప్రదర్శనతో అవేశ్ కుటుంబం కూడా చాలా భావోద్వేగానికి గురైంది.

IPL 2025: కొడుకు విజయాన్ని కళ్లారా చూసి.. కన్నీళ్లు పెట్టుకున్న అవేశ్ ఖాన్ తల్లి.. ఎమోషనల్ వీడియో వైరల్
IPL 2025

Updated on: Apr 20, 2025 | 4:43 PM

IPL 2025 36వ మ్యాచ్ ఈ సీజన్‌లో అత్యంత ఉత్కంఠ మ్యాచుల్లో ఒకటిగా పరిగణించవచ్చు. జైపూర్‌ వేదికగా శనివారం (ఏప్రిల్ 19) రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ చివరి బంతి దాకా ఉత్కంఠగా జరిగింది. చివరకు
లక్నో కేవలం 2 పరుగుల స్వల్ప తేడాతో గెలిచింది. జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ సులభంగా గెలుస్తుందనుకున్నారు. కానీ కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్ అవేష్ ఖాన్ తన చివరి 2 ఓవర్లలో మ్యాచ్ గమనాన్ని మార్చాడు. మొదట 18వ ఓవర్లో యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ వికెట్లను తీశాడు అవేష్. ఆ తర్వాత 20వ ఓవర్లో రాజస్థాన్ జట్టుకు కేవలం 9 పరుగులు మాత్రమే అవసరమైనప్పుడు. ఒక వికెట్ తీసి, కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడీ లక్నో పేసర్. ఈ మ్యాచ్‌లో అవేష్ స్టార్‌గా నిలిచాడు. తన ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. సహజంగానే ఈ మ్యాచ్ అవేశ్ కు చాలా ప్రత్యేకమైనది. కానీ ఇదే మ్యాచ్ కు తన తల్లి కూడా రావడంతో ఈ స్పీడ్ స్టర్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

రాజస్థాన్ పై విజయం తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ ఒక వీడియోను పోస్ట్ చేసింది, అందులో అవేష్ ఖాన్, అతని తల్లి మధ్య జరిగిన భావోద్వేగ క్షణాలను పంచుకున్నారు. ఈ వీడియోలో మొదట ఆవేష్ ఖాన్ తన తల్లి తో వీడియో కాల్‌లో మాట్లాడటం కనిపిస్తుంది. ఈ సమయంలో అవేశ్‌ ‘ఏడవొద్దమ్మా? ‘ అంటూ సముదాయిస్తాడు. అవేష్ మాత్రమే కాదు, అతని సహచరుడు నికోలస్ పూరన్ కూడా ఏడవడానికి బదులుగా నవ్వమని అవేశ్ తల్లిని కోరతాడు.

ఇవి కూడా చదవండి

తల్లితో అవేశ్ ఖాన్.. వీడియో

ఇది జరిగాక కొద్ది సేపటికి అవేష్ స్టేడియంలోని తన తల్లిని ప్రత్యక్షంగా కలుసుకుంటాడు. కుమారుడిని చూసిన ఆనందంలో ఆమె ఎమోషనల్ అవుతుంది. కన్నీళ్లు పెట్టుకుంటూ అవేశ్ ను హత్తుకుంటుంది. ఇది చూసి అక్కడ ఉన్న మిగిలిన వారు కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

లక్నో ఆటగాళ్ల సంబరాలు..

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.