IPL 2024: అప్పుడు గంభీర్.. ఇప్పుడు అయ్యర్.. ఈసారి కోల్‌కతాదే కప్.. ప్రూఫ్స్ ఇవిగో అంటోన్న ఫ్యాన్స్
గౌతమ్ గంభీర్ KKR జట్టుకు మెంటార్‌గా మారడంతో ఆ జట్టు ప్రదర్శన కూడా మారిపోయింది. గత ఎడిషన్‌లో వరుస పరాజయాలతో చతికిలపడిన కేకేఆర్ జట్టు ఈసారి మాత్రం వరుస విజయాలు సాధిస్తోంది. అభిమానులను అలరించనుంది. గంభీర్‌తో పాటు శ్రేయాస్ అయ్యర్ నాయకత్వం కూడా కేకేఆర్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి
గౌతమ్ గంభీర్ KKR జట్టుకు మెంటార్‌గా మారడంతో ఆ జట్టు ప్రదర్శన కూడా మారిపోయింది. గత ఎడిషన్‌లో వరుస పరాజయాలతో చతికిలపడిన కేకేఆర్ జట్టు ఈసారి మాత్రం వరుస విజయాలు సాధిస్తోంది. అభిమానులను అలరించనుంది. గంభీర్‌తో పాటు శ్రేయాస్ అయ్యర్ నాయకత్వం కూడా కేకేఆర్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ ఎడిషన్‌లో ఆ జట్టు మూడు మ్యాచ్‌లు ఆడగా మూడు మ్యాచ్‌లు గెలిచింది. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చి జట్టు విజయం సాధించింది. జట్టు విజయానికి ఇదే ప్రధాన కారణం. మొత్తం జట్టుగా KKR ప్రస్తుత ప్రదర్శనను చూస్తుంటే, ఈసారి ఆ టీమ్ దే ఐపీఎల్ కప్ అంటున్నారు ఫ్యాన్స్. అదే సమయంలో కొన్ని యాదృచ్చిక సంఘటనలను కూడా గుర్తు చేస్తున్నారు. నిజానికి ఈ కో-ఇన్సిడెన్స్ అనేవి జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌లకు సంబంధించినది.
కోల్‌కతా నైట్ రైడర్స్ ఇప్పటి వరకు రెండుసార్లు (2012, 2014) ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. గౌతమ్ గంభీర్ నాయకత్వంలోనే ఈ జట్టు రెండుసార్లు ఈ ఘనత సాధించింది. 2012లో KKR బాధ్యతలు చేపట్టడానికి ముందు, గంభీర్ ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఉన్నాడు. 2010లో ఢిల్లీ జట్టు పేలవ ప్రదర్శన కారణంగా ప్లే ఆఫ్‌కు అర్హత సాధించడంలో విఫలమవడంతో గంభీర్‌ను జట్టు నుంచి తప్పించారు. ఆ తర్వాత 2011 మెగా వేలంలో కోల్‌కతా 14.9 కోట్లకు (ఆ సీజన్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడు) గంభీర్‌ను జట్టులోకి తీసుకుంది. ఇది జరిగిన వెంటనే గంభీర్‌ను జట్టు కెప్టెన్‌గా కూడా నియమించారు. ఆ తర్వాత వరుసగా రెండో సీజన్ కేకేఆర్ తరఫున ఆడిన గంభీర్.. తొలిసారి కేకేఆర్ ను చాంపియన్ గా నిలబెట్టాడు.
ఢిల్లీ టు కోల్ కతా..
గౌతమ్ గంభీర్ లాగే శ్రేయాస్ అయ్యర్ కూడా కోల్‌కతాకు ఆడటానికి ముందు ఢిల్లీకి ఆడాడు. 2018లో ఢిల్లీ జట్టు కెప్టెన్సీ నుంచి గంభీర్ తప్పుకోవడంతో అయ్యర్‌ను ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గా నియమించారు. అయ్యర్ 2021 వరకు ఢిల్లీ తరపున ఆడాడు. అయితే అయ్యర్ నాయకత్వంలో కూడా ఢిల్లీ జట్టు ఆటతీరు మెరుగుపడలేదు. ఆ విధంగా, ఢిల్లీ 2022లో అయ్యర్‌ను జట్టు నుండి విడుదల చేసింది. దీని తర్వాత, గంభీర్ వలే అయ్యర్ కూడా మెగా వేలంలో 12.25 కోట్లకు KKR లో చేరాడు. ఆ ఎడిషన్‌లో KKR కొనుగోలు చేసిన అత్యంత ఖరీదైన ఆటగాడిగా కూడా నిలిచాడు. దీనితో పాటు, అతను ఆ సీజన్‌లో అత్యంత ఖరీదైన ముగ్గురు ఆటగాళ్ళలో శ్రేయస్ కూడా ఒకడు. గంభీర్‌లా అతనిని కూడా కేకేఆర్ కు కెప్టెన్‌గా నియమించారు. కానీ అయ్యర్ కూడా కేకేఆర్ జట్టును ప్లే ఆఫ్‌కు కూడా తీసుకెళ్లలేకపోయాడు.
కలిసొచ్చిన రెండో సీజన్..
శ్రేయాస్ అయ్యర్ ఇప్పుడు కోల్‌కతా తరపున తన రెండవ సీజన్‌ను ఆడుతున్నాడు. ఎందుకంటే 2023లో అతను గాయం కారణంగా మొత్తం సీజన్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు KKR తరఫున రెండవ సీజన్ ఆడుతున్నాడు. అయ్యర్ నాయకత్వంలో, KKR జట్టు ఇప్పటివరకు చూపిన ఆటను పరిశీలిస్తే IPL టైటిల్ కోసం బలమైన పోటీదారుగా పరిగణంచాల్సిదే. గంభీర్ తన రెండవ సీజన్‌లో KKR కు IPL టైటిల్‌ను అందించినట్లే అయ్యర్ కూడా తన రెండవ సీజన్‌లో కోల్ కతాకు కప్ అందిస్తాడో లేదో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..