ఐపీఎల్ 2024లో 33వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. పంజాబ్ హోమ్ గ్రౌండ్ ముల్లన్‌పూర్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న పంజాబ్, ముంబై జట్లకు ఇది చాలా కీలకమైన మ్యాచ్. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ లో గెలవడం ఇరు జట్లకు తప్పనిసరి. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఒక అరుదైన రికార్డును లిఖించనున్నాడు. ఈరోజు పంజాబ్ కింగ్స్‌తో జరగనున్న మ్యాచ్ ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు ఐపీఎల్‌లో 250వ మ్యాచ్. తద్వారా ఐపీఎల్‌లో 250 మ్యాచ్‌లు ఆడిన రెండో ఆటగాడిగా రోహిత్ నిలవనున్నాడు. రోహిత్ శర్మ కంటే ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఈ ఘనత సాధించాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో 250కి పైగా మ్యాచ్‌లు ఆడిన ఏకైక ఆటగాడు ఎంఎస్ ధోని.
ఐపీఎల్‌లో ఇప్పటివరకు ధోనీ 256 మ్యాచ్‌లు ఆడాడు. అలాగే, అతని నాయకత్వంలో చెన్నై జట్టు 5 సార్లు IPL టైటిల్‌ను గెలుచుకుంది. ఇప్పుడు MS ధోని రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో CSK తరపున ఆడుతుండగా, రోహిత్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడుతున్నాడు. రోహిత్ శర్మ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 249 మ్యాచ్‌లు ఆడి 6472 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో హిట్ మ్యాన్ అత్యుత్తమ స్కోరు 109 నాటౌట్. దీంతో పాటు ఐపీఎల్ 2024లో కూడా రోహిత్ అద్భుత బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు రోహిత్ 6 మ్యాచ్‌ల్లో 167 స్ట్రైక్ రేట్‌తో 261 పరుగులు చేశాడు. గత మ్యాచ్‌లో CSKపై రోహిత్ భారీ సెంచరీ సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో రోహిత్‌కి ఇది రెండో సెంచరీ. టీ20 ప్రపంచకప్‌కు ముందు రోహిత్ ఫామ్‌లో ఉండటంతో టీమ్ ఇండియా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక లీగ్‌లో ఇరు జట్ల ప్రదర్శన గురించి మాట్లాడుకుంటే.. ఇప్పటి వరకు ఇరు జట్లు చెరో 2 మ్యాచ్‌లు గెలిచి 4 మ్యాచ్‌ల్లో ఓడిపోయాయి. కాబట్టి ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవడానికి ఇరు జట్లకు ఈ మ్యాచ్ గెలవడం చాలా కీలకం.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న దినేష్ కార్తీక్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. అతను ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ లయన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున 249 మ్యాచ్‌లు ఆడాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ ప్రారంభం నుంచి విరాట్ కోహ్లి ఆర్‌సీబీ తరఫున ఆడుతున్నాడు. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 244 మ్యాచ్‌లు ఆడగా, మరో 6 మ్యాచ్‌ల్లో 250 మ్యాచ్‌ల క్లబ్ లో చేరనున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..