IPL 2022: మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు.. ముంబై-పుణెల్లోనే హోరాహోరీ పోరు.. ఐపీఎల్ 2022 తొలి మ్యాచ్ ఎప్పుడంటే?
ఐపీఎల్ 2022 షెడ్యూల్ కోసం క్రికెట్ ప్రేమికులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ ట్రోఫీ కోసం ఈసారి 10 జట్ల మధ్య పోటీ జరగనుంది.
ఐపీఎల్ 2022(IPL 2022)లో మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు జరిగే చాన్స్ ఉంది. ఇందులోభాగంగా ముంబై, పుణెలలో అత్యధిక మ్యాచ్‌లు నిర్వహించాలని భావిస్తున్నారు. ఐపీఎల్ 2022 మార్చి 26 నుంచి ప్రారంభం కానుందని సమాచారం. లీగ్ దశలో 70 మ్యాచ్‌లకు గాను 55 మ్యాచ్‌లు ముంబై(Mumbai)లోని వాంఖడే స్టేడియంతోపాటు బ్రబౌర్న్ స్టేడియం, డివై పాటిల్ స్టేడియంలలో నిర్వహించవచ్చని చెబుతున్నారు. మిగిలిన 15 మ్యాచ్‌లు పూణెలోని ఎంసీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్నాయి. క్రిక్‌బజ్ వెబ్‌సైట్ ఈ నివేదికను అందించింది. వాంఖడే, డివై పాటిల్ స్టేడియంలో అన్ని జట్లు తలా నాలుగు మ్యాచ్‌లు ఆడవచ్చని తెలుస్తోంది. మరోవైపు బ్రబౌర్న్ స్టేడియం, పుణెలో ఒక్కో జట్టు మూడు మ్యాచ్‌లు ఆడవచ్చని తెలుస్తోంది.
ప్రస్తుతం IPL 2022 ప్రారంభం గురించి BCCI నుంచి అధికారిక సమాచారం బయటకు రాలేదు. ఐపీఎల్ ఈ సీజన్ మార్చి 26 లేదా 27 నుంచి ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. టోర్నమెంట్ ప్రసారకర్త స్టార్ ఇండియా మార్చి 26 (శనివారం) నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో, బోర్డు మాత్రం మార్చి 27 (ఆదివారం) నుంచి ప్రారంభించాలని చూస్తోంది. మరి ఏ తేదీని ఫైనల్ చేస్తారో చూడాలి. మే 29న టోర్నీ ఫైనల్‌ను నిర్వహించేందుకు ఏర్పాటు కూడా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి 24న ఐపీఎల్ షెడ్యూల్, మ్యాచ్‌లపై నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. రేపు జరిగే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది.