AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind Vs Pak: ఇండో-పాక్ హైవోల్టేజ్ పోరు.. ఈరాత్రికి 5 ఆల్-టైమ్ రికార్డులు బద్దలు

Ind Vs Pak: మహిళల ఆసియా కప్ 2026లో భారత్, పాకిస్థాన్ హైవోల్టేజ్ పోరుకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్, షెఫాలీ వర్మ అరుదైన ప్రపంచ రికార్డులకు చేరువలో ఉన్నారు. మంధాన పరుగులు, సిక్సర్ల మైలురాళ్లపై కన్నేయగా, హర్మన్‌ప్రీత్ 150 మ్యాచ్‌ల కెప్టెన్సీ రికార్డు, షెఫాలీ 3000 పరుగుల ఘనతపై దృష్టి పెట్టింది.

Ind Vs Pak: ఇండో-పాక్ హైవోల్టేజ్ పోరు.. ఈరాత్రికి 5 ఆల్-టైమ్ రికార్డులు బద్దలు
Ind Vs Pak
Rakesh
|

Updated on: Sep 05, 2026 | 3:39 PM

Share

Ind Vs Pak: మహిళల ఆసియా కప్ 2026 టోర్నీలో అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ వర్సెస్ పాకిస్థాన్ మహాయుద్ధం నేడు జరగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఈ పోరు ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఘనవిజయాలు సాధించిన టీమిండియా సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకోగా, ఈ మ్యాచ్‌లో భారత్‌పై గెలిచి రేసులో నిలవాలని పాకిస్థాన్ ఆశిస్తోంది. అయితే ఈ మ్యాచ్ కేవలం గెలుపోటములకే పరిమితం కాకుండా, భారత మహిళా క్రికెటర్ల బ్యాటింగ్ రికార్డుల వర్షానికి వేదిక కాబోతోంది.

వరల్డ్ రికార్డుకు చేరువలో స్మృతి మంధాన

టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఈ మ్యాచ్ ద్వారా అనేక అరుదైన మైలురాళ్లను అధిగమించేందుకు సిద్ధంగా ఉంది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన న్యూజిలాండ్ ఆటగాడు సూజీ బేట్స్ (4758 పరుగులు) రికార్డును దాటడానికి మంధానకు మరో 78 పరుగులు అవసరం. ప్రస్తుతం స్మృతి ఖాతాలో 4681 పరుగులు ఉన్నాయి. దీనితో పాటు పాకిస్థాన్‌పై అత్యధిక పరుగులు చేసిన మిథాలీ రాజ్ (315 పరుగులు) రికార్డును దాటేందుకు మంధానకు కేవలం 9 పరుగులు మాత్రమే కావాలి. అంతేకాక ఈ మ్యాచ్‌లో మరో 6 సిక్సర్లు బాదితే, అంతర్జాతీయ టీ20ల్లో 100 సిక్సర్లు పూర్తి చేసిన తొలి భారతీయ మహిళా బ్యాటర్‌గా స్మృతి సరికొత్త అధ్యాయం లిఖిస్తుంది.

కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ మైండ్ బ్లోయింగ్ రికార్డ్

భారత జట్టు నాయకురాలు హర్మన్‌ప్రీత్ కౌర్ ఈరోజు టాస్ వేసేందుకు మైదానంలోకి అడుగుపెట్టగానే ఒక అపూర్వమైన ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకోనుంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలోనే ఏకంగా 150 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా హర్మన్‌ప్రీత్ రికార్డు సృష్టిస్తుంది. ఇప్పటివరకు పురుషుల, మహిళల క్రికెట్‌లో ఏ కెప్టెన్ కూడా ఈ మైలురాయిని చేరుకోకపోవడం విశేషం.

3000 పరుగుల క్లబ్‌లోకి షెఫాలీ వర్మ

భారత ఓపెనింగ్ విధ్వంసకర బ్యాటర్ షెఫాలీ వర్మ కూడా ఈ మ్యాచ్‌లో ఒక భారీ ఘనత సాధించేందుకు సిద్ధంగా ఉంది. టీమిండియా తరఫున అంతర్జాతీయ టి20ల్లో ఇప్పటివరకు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ మాత్రమే 3000 పరుగుల మైలురాయిని దాటారు. ఇప్పుడు షెఫాలీ వర్మ 3000 పరుగుల మార్కును చేరుకోవడానికి కేవలం 7 పరుగుల దూరంలో ఉంది. ప్రస్తుతం ఆమె ఖాతాలో 2993 పరుగులు ఉన్నాయి. నేటి పోరులో ఈ చిన్న మైలురాయిని దాటితే ఈ ఘనత సాధించిన మూడో భారతీయ మహిళా ప్లేయర్‌గా షెఫాలీ చరిత్రకెక్కుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us